‘ఎస్‌ 5: నో ఎగ్జిట్‌’ రివ్యూ

S5 No Exit Movie Review In Telugu - Sakshi

టైటిల్‌: ఎస్‌ 5: నో ఎగ్జిట్‌
నటీనటులు: తారకరత్న, ప్రిన్స్‌, సునీల్‌, అలీ, సాయి కుమార్‌ తదితరులు
నిర్మాతలు: అదూరి ప్రతాప్‌రెడ్డి, దేవు శ్యాముల్‌, షైక్‌ రహీమ్‌, గాదె మిల్కిరెడ్డి, గౌతమ్‌ కొండెపూడి
ద‌ర్శ‌క‌త్వం: భరత్‌ కోమలపాటి
సంగీతం: మణిశర్మ
విడుదల తేది: డిసెంబర్‌ 30, 2022

కథేంటంటే..
సుబ్బు(తారకరత్న).. ముఖ్యమంత్రి సుబ్రహ్మణ్యం నాయుడు(సాయి కుమార్‌) కొడుకు. తండ్రికి రాజకీయంగా అండగా ఉంటాడు. తనను ప్రాణంగా ఇష్టపడే కొడుకు బర్త్‌డే వేడుకలను కాస్త వెరైటీగా చేద్దామని ట్రైన్‌లో ప్లాన్‌ చేస్తాడు సీఎం. బర్త్‌డే పార్టీ కోసమని సుబ్బు, స్నేహితుల కోసం విశాఖ పట్నం వెళ్లే ట్రైన్‌లో స్పెషల్‌ బోగీని ఏర్పాటే చేస్తాడు. ఆ బోగిలోకి అనుకోకుండా సన్నీ(ప్రిన్స్‌)కి సంబంధించిన బృందం ఎక్కుతుంది. సుబ్బు, సన్నీ టీమ్‌ మధ్య గొడవ జరుగుతుంది. దీంతో సన్నీ టీమ్‌ మధ్యలోనే ట్రైన్‌ దిగేందుకు సిద్దమవుతుంది. కానీ డోర్స్‌ ఓపెన్‌ కావు. అంతేకాదు బోగీలో ఉన్నవాళ్లు ఒక్కొక్కరుగా మాయవుతుంటారు. ఇంతలోనే ఆ బోగీ అగ్ని ప్రమాదానికి గురవుతుంది? అసలు ఆ బోగీ డోర్స్‌ ఎందుకు ఓపెన్‌ కాలేదు? అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? కొడుకు బర్త్‌డే వేడుకలను ట్రైన్‌లోనే జరపాలని ముఖ్యమంత్రి ఎందుకు ప్లాన్‌ చేశాడు? బోగీలో దాగి ఉన్న సీక్రెట్‌ ఏంటి? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
అధికారం కోసం కొంతమంది ఎంతటి క్రూరమైన నిర్ణయాలైన తీసుకుంటారనేది ఈ సినిమా ద్వారా చూపించాడు దర్శకుడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ బాగున్నప్పటికీ తెరపై చూపించడంలో తడబడ్డాడు. సినిమా ప్రారంభంలోనే అసలు కథను మొదలెట్టాడు. ట్రైన్‌లో జరిగే సన్నివేషాలను అలీ ‘బిగ్‌బాస్‌’షోతో పోల్చడం నవ్వులు పూయిస్తుంది. దెయ్యం ఒక్కొక్కరిని మాయం చేయడం.. అసలు ఏం జరుగుతుందో తెలియక బోగీలో వాళ్లు టెన్షన్‌ పడడం ఆసక్తికరంగా అనిపించనప్పటికీ.. కొన్ని లాజిక్‌ లేని సీన్స్‌  ఇబ్బంది కలిగిస్తాయి. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు కాస్త ఆకట్టుకుంటాయి.

ఇక నటీనటుల విషయానికొస్తే.. తారకరత్న గెటప్‌ బాగుంటుంది. కానీ అతని నటన అంతగా ఆకట్టుకోలేకపోయింది. దొంగల ముఠా సభ్యునిగా ప్రిన్స్‌ నటన పర్వాలేదు. సీఎం పాత్రలో సాయికుమార్‌ ఒదిగిపోయాడు. టీసీగా అలీ, యూట్యూబర్‌గా సునీల్‌ కామెడీ అంతగా వర్కౌట్‌ కాలేదు. రఘు, మెహబూబ్‌ దిల్‌సే తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. మణిశర్మ నేపథ్య సంగీతం బాగుంది. గరుడవేగ అంజి సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌ తన కత్తెరకు చాలా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గటుగా ఉన్నాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top