‘ఆ సన్నివేశాన్ని తొలగించకుంటే థియేటర్లు తగలబెడుతాం’

RRR Movie: MP Soyam Bapurao Warned To Rajamouli - Sakshi

రాజమౌళికి ఎంపీ సోయం బాపురావు వార్నింగ్‌

సాక్షి, కొమురం భీమ్‌ :  ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో కొమురం భీమ్‌ వేషాధారణలో ఎన్టీఆర్‌ ఓ మతానికి సంబంధించిన టోపీ పెట్టుకోవడం ఆదివాసీయులను కించపర్చడమేనని బీజేపీ ఎంపీ సోయం బాపురావు అన్నారు. అలాంటి సన్నివేశాలను తొలగించాలని, లేదంటే సినిమా థియేటర్లు తగలబెడుతామని హెచ్చరించారు. శనివారం ఆయన కెరమెరి మండలం జోడేఘాట్లో నిర్వహించిన కొమురం భీమ్‌ 80వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గిరిజనులు భారీగా తరలివచ్చి ఇందులో పాల్గొన్నారు. జల్ జంగల్ జమీన్ కోసం నిజాం సర్కార్ తో పోరాడి అసువులు బాసిన కొమురం భీమ్‌ వర్ధంతిని ఏటా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంది. ఈసారి కూడా జోడేఘాట్ కు ఉమ్మడి జిల్లా లోని గిరిజనులతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రల నుంచి భారీ గిరిజనులు తరలి వచ్చారు. మొదట గిరిజన సంప్రదాయ బద్దంగా పూజలు చేసిన అనంతరం భీమ్‌ సమాధి వద్ద నివాళులర్పించారు.
(చదవండి : రాజశేఖర్ ఆరోగ్యంపై కూతురు శివాత్మిక ట్వీట్‌)

ఈ సందర్భంగా ఎంపీ బాపురావు మట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో కొమురం భీమ్‌ చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సినిమా ట్రైలర్‌లో భీమ్‌ వేషాధారణలో ఎన్టీఆర్‌ ఓ మతానికి సంబంధించిన టోపి పెట్టుకోవడం ఆదివాసీయులను కించపర్చడమేనని, అలాంటి సన్నివేశాలను తొలగించాలని, లేదంటే సినిమా థియేటర్లు తగలబెడుతామని హెచ్చరించారు. పొడు భూములకు పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లంబాడులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్నారు. ఈసారి కరోనా కారణంగా దర్బార్ రద్దు కావడం పట్ల గిరిజనులు నాయకులు స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదటి సారిగా వచ్చి ఇచ్చిన హామీల్లో 25 కోట్లతో మ్యూజియం  భీం విగ్రహం సమాధి పూర్తి అయ్యాయి. ఇంకా బీమ్, పోరు గ్రామాలను మరింత అభివృద్ది చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావుతో పాటు జడ్పీ చైర్మన్ కోవా లక్ష్మీ, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కొనప్ప, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కోమురం భీమ్‌ మనవడు సోనే రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top