రవిశంకర్, ప్రియ భవాని, రవితేజ, బేబి నక్షత్ర, శివ నిర్వాణ, నవీన్ యెర్నేని
‘‘ఇరుముడి’ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘ఇరుముడి’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే నా కళ్లు చెమర్చాయి. 20 ఏళ్ల క్రితం థియేటర్‌కి వచ్చిన వాళ్లు ఇప్పుడు మళ్లీ ‘ఇరుముడి’కి థియేటర్‌కి రావడం భావోద్వేగంగా అనిపించింది’’ అని హీరో రవితేజ చెప్పారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్ జోడీగా, బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషించిన చిత్రం ‘ఇరుముడి’.
మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం(ఆగస్టు 21) విడుదలయింది. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్‌లో రవితేజ మాట్లాడుతూ–‘‘ఇరుముడి’ చూస్తున్నప్పుడు జీవీ ప్రకాష్ మ్యూజిక్‌తో ఆటోమేటిక్‌గా ప్రేక్షకులకు కళ్లలో నీళ్లు వచ్చేస్తున్నాయి. మా అమ్మాయి మోక్ష కూడా కన్నీళ్లు పెట్టుకుంది. నిర్మాతలు రవి, నవీన్‌లతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. నాతో ఇంత మంచి సినిమా చేసినందుకు శివ నిర్వాణకి ధన్యవాదాలు’’ అన్నారు.
‘‘ఒక దర్శకుడికి, నిర్మాతకి, హీరోకి, డిస్ట్రిబ్యూటర్‌కి, ప్రేక్షకుడికి ఒక సినిమా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది’’ అని శివ నిర్వాణ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలో కావేరిలాంటి పాత్ర ఇచ్చినందుకు శివ నిర్వాణగారికి ధన్యవాదాలు’’ అన్నారు ప్రియా భవాని శంకర్. ‘‘ఈ సినిమాకి ఎదురు లేదు. మరో నాలుగు వారాలు వెళ్తూనే ఉంటుంది’’ అని వై. రవిశంకర్ పేర్కొన్నారు.
‘‘ఒక సినిమా విడుదలైన రోజున్నరలోనే లాభాల్లోకి రావడం యాభై ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతుంటే చాలా సంతోషంగా అనిపించింది’’ అని నవీన్ యెర్నేని తెలిపారు. నటుడు సాయికుమార్, నటి స్వసిక, బేబీ నక్షత్ర, కెమెరామేన్ విష్ణు శర్మ, పాటల రచయిత అనంత శ్రీరామ్ తదితరులు మాట్లాడారు.


