
‘పుష్ప’ ఫ్రాంచైజీలోని ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ సినిమాల తర్వాత హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మికా మందన్నా మరోసారి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమాలో కథ రీత్యా ఐదుగురు హీరోయిన్లు నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రంలోని ఓ హీరోయిన్ పాత్రలో దీపికా పదుకోన్ నటించనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ... ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు మరో హీరోయిన్ మృణాల్ ఠాగూర్.
మిగిలిన ముగ్గురు హీరోయిన్స్ పాత్రల్లో రష్మికా మందన్నా, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ భోర్సే, బాలీవుడ్ నటి ఆలియా. ఎఫ్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఈ చిత్రంలో రష్మికా మందన్నా, జాన్వీ కపూర్‌ల పేర్లు దాదాపు ఖరారయ్యాయని సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ఈ సినిమాలో రష్మికా మందన్నాది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదట. ఆమె పాత్రకు ప్రతినాయిక ఛాయలు ఉంటాయని, కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా రష్మిక కనిపిస్తారని, ఈ యాక్షన్ సన్నివేశాల కోసం ఆమె ప్రత్యేకమైన శిక్షణ తీసుకోనున్నారని టాక్. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.