
ఆపరేషన్ సిందూర్‌పై పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న రియాక్ట్ అయ్యారు. ఈమేరకు సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేశారు. 'ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే హక్కును కూడా కొందరు తప్పుపడుతున్నారని, దానిని యుద్ధ దాహమంటూ తప్పుగా అర్థం చేసుకోకూడదని ఆమె అన్నారు. అన్యాయానికి బదులు తీర్చుకునే దేశాన్ని ఎవరూ ప్రశ్నించొద్దని రష్మిక (Rashmika) కోరారు.
"ఉగ్రవాదం నుంచి రక్షణ కోసం చేసే పోరాటం యుద్ధం కాదు. ఈ పోరాటానికి మద్ధతిచ్చే వారు యుద్ధోన్మాదులు కాదు. వారందరూ దేశ భద్రత, న్యాయం విలువైనవిగా భావించే పౌరులు. మేము శాంతిని కోరుకుంటాం.., అలా అని మాకు తలపెట్టిన హానిని అంగీకరించడానికి సిద్ధంగా ఎంతమాత్రం లేము. రెచ్చగొట్టే దురాక్రమణకు, ఆత్మ రక్షణకు మధ్య లోతైన నైతిక వ్యత్యాసం ఉంది. కుట్రలు పన్ని ఉద్దేశపూర్వకంగా జరిగిన ఉగ్రవాద చర్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవడం మా దేశ బాధ్యతే అవుతుంది. అది ఎంతమాత్రం అవకాశం కాదు. శాంతిని కోరుకోవడం అంటే మౌనంగా హానిని అంగీకరించడం కాదు. మాకు జరిగిన అన్యాయాన్ని బదులు తీర్చుకుంటున్న దేశాన్ని ఎవరూ ప్రశ్నించొద్దు.. మీకు చేతనైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని ప్రశ్నించండి. మా దేశ సరిహద్దుల మీదుగా ఉగ్రవాదులను పంపుతున్న దేశాన్ని ప్రశ్నించండి.' అని రష్మిక రాసుకొచ్చారు.