
సినిమాల లాభాలు సాధారణంగా ఆ సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత గానీ లెక్కకు రావు. అరుదుగా కొన్ని సెన్సేషనల్ చిత్రాలు మాత్రం బిజినెస్ రైట్స్ అమ్మకాలు వంటి వాటి ద్వారా ముందే రికార్డ్స్ సృష్టిస్తాయి. అయితే వీటన్నింటికీ అతీతంగా హక్కుల అమ్మకాల ద్వారా కాకుండా ఎప్పుడూ ఎవరూ చవిచూడని రీతిలో ఓ సినిమా లాభాలను ఆర్జించి వార్తల్లో నిలిచింది. బహుశా భారతీయ సినీ చరిత్రలో ఈ తరహా లాభాలు అదీ ఈ స్థాయిలో అందుకున్న తొలిసినిమా ఇదే కావచ్చు. ఆ సినిమా పేరు రామాయణ(Ramayana).

భారత దేశంలో హిందూ సంస్కృతీ సంప్రదాయాలను ప్రత్యక్షంగా పరోక్షంగా శాసించే పౌరాణిక గాధ... భారతీయ సినిమాను సైతం శాసించనున్నట్టు ఈ రికార్డ్స్ వెల్లడిస్తున్నాయి. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే నభూతో నభవిష్యత్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. దాదాపుగా రూ.1000 కోట్ల వరకూ అంచనా వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమా అప్పుడే రూ.1000 కోట్ల లాభాలు ఎలా అర్జించిందీ అంటే...
వెయ్యికోట్ల లాభం వెనుక...
ఈ భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్‌ను నమిత్ మల్హోత్రా ఆధ్వర్యంలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ నిర్మిస్తోంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్‌ఇ)లో లిస్టింగ్ లో ఉన్న కంపెనీ ప్రైమ్ ఫోకస్. ఈ ప్రతిష్టాత్మక సినిమా ‘రామాయణ’ తొలి గ్లింప్స్ ఈ నెల3న విడుదలైంది. ఆ విడుదలతోనే దేశవ్యాప్తంగా ఈ సినిమా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన అంచనాలు, ప్రచారం పెరుగుతూ పోతుండడంతో ప్రైమ్ ఫోకస్ కంపెనీకి స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు రావడం మొదలైంది. ఈ కంపెనీ షేర్లు జూన్ 25న రూ113.47 వద్ద ఉండగా, జూలై 1 నాటికి రూ.149.69కి పెరిగాయి. అయితే, జూలై 3న ‘రామాయణం’ ఫస్ట్ లుక్ విడుదలైన రోజున ఈ షేర్ విలువ ఏకంగా రూ.176కి చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ జూలై 1న రూ.4638 కోట్ల నుంచి రూ5641 కోట్లకు పెరిగింది. అంటే, కేవలం రెండు రోజుల్లోనే సంస్థకు రూ.1000 కోట్ల వరకూ సంపద పెరిగింది. మార్కెట్ ముగిసే సమయానికి షేర్ ధర ₹169గా ఉండగా, మొత్తం క్యాప్ దాదాపు 5200 కోట్ల వద్ద స్థిరపడింది.
భారీ పారితోషికం...హీరోకి కూడా షేర్లు...
ఇక ఈ సినిమా హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) కూడా నిర్మాణ సంస్థలో పెట్టుబడి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. కంపెనీ బోర్డు మంజూరు చేసిన 462.7 మిలియన్ షేర్ల ప్రిఫరెన్షియల్ ఇష్యులో రణబీర్ కూడా షేర్లను పొందారని బిజినెస్ స్టాండర్డ్ వెల్లడించింది. రణబీర్ మొత్తం 12.5 లక్షల షేర్లను కలిగి ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను రణబీర్‌కు రూ.150కోట్ల వరకూ పారితోషికం చెల్లిస్తున్నట్టు సమాచారం. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న రామాయణం సినిమా రెండు భాగాలుగా రూపొందుతుంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027లో విడుదల కానుంది.
సీతగా సాయిపల్లవి...
ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్ శ్రీరాముడిగా రావణుడిగా, యష్(yash)లు నటిస్తుండగా సీత పాత్రలో దక్షిణాది స్టార్ హీరోయిన్ సాయిపల్లవి(Sai Pallavi) నటిస్తుండడం విశేషం. ఇక లక్ష్మణుడిగారవీ దూబే హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని ఏఆర్ రెహ్మాన్, హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ కలిసి సంయుక్తంగా రూపొందించనున్నారు. హాన్స్ జిమ్మర్‌కు ఇది బాలీవుడ్ లో ఆరంగేట్రం కావడం విశేషం.రామాయణం’ ప్రాజెక్ట్‌తో భారతీయ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం సాకారమవుతోందని సినీవర్గాలు భావిస్తున్నాయి.