‘యానిమల్:పార్క్’ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాదిప్రారంభం అవుతుందని తెలిపారు బాలీవుడ్ నటుడు రణ్‌బీర్‌కపూర్. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘యానిమల్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా, బాబీడియోల్ విలన్ గా, ఓ కీలక పాత్రలో త్రిప్తి దిమ్రీ నటించారు. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, మురాద్ ఖేతని, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం 2023 డిసెంబరు 1న విడుదలై, బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. అయితే ఈ చివర్లో ‘యానిమల్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘యానిమల్:పార్క్’ రానున్నట్లుగా మేకర్స్ తెలిపారు.
తాజాగా ఈ ‘యాని మల్’ సినిమా సీక్వెల్‌పై ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌కపూర్ స్పందించారు. ‘‘సందీప్‌రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమాను ఓ ఫ్రాంచైజీలా మూడు భాగాలుగా తీయాలని నాతో అన్నారు. తొలిభాగం ఆల్రెడీ వచ్చేసింది. రెండోభాగం ‘యానిమల్: పార్క్’ సినిమా చిత్రీకరణను 2027లో స్టార్ట్ చేస్తాం. ఈ సినిమాలో నేను రెండు పాత్రల్లో కనిపిస్తాను. హీరోగా నటించడంతో పాటుగా, విలన్ గానూ కనిపిస్తాను. చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది’’ అని చెప్పుకొచ్చారు రణ్‌బీర్‌కపూర్. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ: పార్టు 1, రామాయణ: పార్టు 2’ చిత్రాలతో పాటుగా, ‘లవ్ అండ్ వార్’ అనే సినిమా చేస్తున్నారు. ఇక ఈ దీపావళికి ‘రామాయణ: పార్టు 1, వచ్చే దీపావళికి రామాయణ:పార్టు 2’ చిత్రాలు రిలీజ్ కానున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ‘లవ్ అండ్ వార్’ చిత్రం 2027లో రిలీజ్ కానుంది.
రాణీముఖర్జీ గొప్ప నటి: రణ్‌బీర్ కపూర్
నటిగా బాలీవుడ్ హీరోయిన్ రాణీముఖర్జీ ఇండస్ట్రీలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయంపై కూడా రణ్‌బీర్‌కపూర్ స్పందించారు. ‘‘భారతదేశంలోని గొప్ప నటీమణుల్లో రాణీముఖర్జీ ఒకరు. నా తొలి చిత్రం ‘సావరియా’లో రాణీతో కలిసి నటించాను నేను. కష్టపడి నటించాలని నాకు చెబుతూ, నన్నుప్రోత్సహించిన తొలి వ్యక్తి తనే. ఆ సినిమా చిత్రీకరణ సమయం లో ఆమెతో నాకు జరిగిన సంభాషణలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. రాణీముఖర్జీ 30 ఏళ్ళ సినీ జర్నీని సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా అద్భుతం. ఇప్పటికీ ఆమె ఎంచుకునే పాత్రలు, సినిమాలు సిల్వర్‌స్క్రీన్ పై మహిళలను గొప్పగా చూపించేలా ఉంటాయి’’ అని పేర్కొన్నారు. ఇక రాణీముఖర్జీ నటించిన ‘మర్దానీ 3’ చిత్రం ఈ నెల 30న రిలీజ్ కానుంది.


