టాలీవుడ్‌లో కొత్తగా అడుగుపెడుతున్న యంగ్ హీరోలలో చాలామంది "కెజియఫ్ రేంజ్"లో సినిమాలు చేయాలని కలలు కంటున్నారు. మేకప్ వేసుకున్న వెంటనే తమ రేంజ్ వేరే లెవల్ అని భావించే ఈ తరం హీరోలు తమ వ్యక్తిత్వం ఏమిటి? తమ వాయిస్, నటనకు ఏం సూటవుతాయి? ఎలాంటి పాత్రలు చేయాలనే విషయాలపై మాత్రం పెద్దగా ఆలోచించరు.
అలా కొంతమంది హీరోలకు చేతిలో సినిమాలు లేకపోయినా "పాన్ ఇండియా" సినిమానే చేస్తానని, మాస్ సినిమానే చేస్తానని గట్టిగా చెప్పేస్తున్నారు. ఇక వారసత్వం ఉన్నవారైతే మరింత ధైర్యం చేస్తున్నారు. ఇటీవల ఓ నిర్మాత ఒక కథకు సరిపోతాడని భావించి ఓ చిన్న హీరోను కలిశాడు. కాగా సదరు హీరో నిర్మాతకు ఫోన్‌లో ఓ వీడియో చూపించాడు. తీరా చూస్తే అది అతనిపై తానే తయారు చేయించుకున్న గ్లింప్స్. అది కెజియఫ్ లెవెల్‌లో ఉన్నట్టు సమాచారం. ఇలాంటి సినిమా చేద్దామని హీరో ప్లాన్ చెప్పాడట. అయితే దానికి సదరు నిర్మాత మాత్రం 'గ్లింప్స్ బాగుంది కానీ మీకు అంతగా సూట్ కాలేదు" అని చెప్పి వెళ్లిపోయాడని సమాచారం.
కెజియఫ్ లాంటి చిత్రాలు అందరికీ సెట్ కావు. అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి సినిమానే చేస్తానని కలలతో కాలక్షేపం చేస్తున్న కుర్ర హీరోలు, ఏజ్ బార్ అయ్యాకే వాస్తవం గ్రహిస్తారు. కానీ అప్పటికే తన తండ్రి ఇచ్చిన ఆస్తి కూడా ఖర్చయిపోయి, కెరీర్‌లో స్థిరపడే అవకాశాలు తగ్గిపోతాయి. టాలీవుడ్‌లో కొత్తగా వస్తున్న హీరోలు తమకు సూటయ్యే పాత్రలు, కథలు ఎంచుకుంటేనే నిలబడగలరనే వాస్తవాన్ని గ్రహించాలి. లేకపోతే "కెజియఫ్ రేంజ్" కలలతోనే వారి కెరీర్ ముగిసే ప్రమాదం ఉంది.


