
తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన ‘బాహుబలి’ మరోసారి థియేటర్స్‌లో సందడి చేసేందుకు వచ్చేస్తుంది. బాహుబలి సినిమా విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా రెండు భాగాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’(Baahubali: The Epic) పేరుతో మరోసారి రిలీజ్ చేయబోతున్నారు.
అక్టోబర్ 31న ఈ చిత్రం ప్రేక్షకుల రాబోతుందని ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా రన్‌టైన్‌పై పుకార్లు మొదలయ్యాయి. రెండు సినిమాలను కలిపి చూపిస్తారు కాబట్టి.. దాదాపు 5 గంటలపైనే రన్‌టైమ్ ఉంటుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మరికొంతమంది నాలుగు గంటల నిడివి ఉంటుందని చెబుతున్నారు. తాజాగా ఈ పుకార్లపై ఆ సినిమాలో భల్లాల దేవ పాత్ర పోషించిన హీరో రానా(Rana Daggubati) స్పందించారు. ఆయన సమర్పణలో రిలీజ్ కాబోతున్న ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమా ఈవెంట్‌లో రానా బాహుబలి రన్‌టైమ్ గురించి మాట్లాడుతూ.. ‘నిడివి ఎంత అనేది నాకు కూడా తెలియదు. ఎంత నిడివి ఉన్నా పర్లేదు..నేను అయితే ఆనందంగా ఉన్నాను.
ఈ ఏడాదిలో నేను ఏ సినిమాలో నటించలేదు. కానీ బాహుబలి ది ఎపిక్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోబోతున్నాను. నిడివి ఎంత అనేది రాజమౌళి కూడా నాకు చెప్పలేదు. నాలుగు గంటలు, ఐదు గంటలు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రాజమౌళి చెప్పే వరకు ఎవరికీ తెలియదు’ అని రానా అన్నారు.
బాహుబలి విషయానికొస్తే.. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం తొలి భాగం లిభాగం 2015 జులై 10న విడుదలై భారతీయ సినీ చరిత్రలోనే అనేక రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత పార్ట్-2 2017లో రిలీజై తెలుగు సినిమా ఖ్యాతిని మరోస్థాయికి తీసుకెళ్లింది.బాహుబలిగా ప్రభాస్, భళ్లాలదేవగా రానా, దేవసేనగా అనుష్క, శివగామిగా రమ్యకృష్ణ, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్యరాజ్ ఈ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు.