
హీరో రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటు కానుంది. ఈ విగ్రహానికి కావాల్సిన కొలతలు పూర్తయ్యాయని, త్వరలోనే ఆయన మైనపు బొమ్మ ఆవిష్కరణ వేడుక ఉంటుందని ఓ అవార్డు ఫంక్షన్‌లో మేడమ్ తుస్సాడ్స్ ప్రతినిధులు వెల్లడించారు. అలాగే చరణ్ మైనపు విగ్రహంలో ఆయన పెంపుడు కుక్క రైమ్ కూడా కనిపించనుండటం ఓ విశేషం.
మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో భాగం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లుగా రామ్‌చరణ్ వెల్లడించారు. మరి... ఆర్ (రామ్‌చరణ్) అండ్ ఆర్ (రైమ్) మైనపు బొమ్మలు ఎలా ఉంటాయో చూడాలంటే మరికొంత సమయం పడుతుంది. మరోవైపు ప్రస్తుతం ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలోని పాత్రకు సంబంధించిన మేకోవర్‌తో రామ్‌చరణ్ బిజీగా ఉన్నారు. అలాగే రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గేమ్ చేంజర్’ సినిమా క్రిస్మస్ సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉంది.