
బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ(Jackky Bhagnani ) దివాలా తీశారని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh)ను పెళ్లాడిన తర్వాత ఆయన నిర్మించిన మొదటి సినిమా 'బడే మియాన్ చోటే మియాన్' వల్ల భారీగా నష్టపోవడంతో తన ఆఫీస్, ఇల్లు అన్నీ అమ్మేశారని పలు కథనాలు వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా ఈ అంశం గురించి జాకీ భగ్నానీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
'బడే మియాన్ చోటే మియాన్' విడుదలైన తర్వాత తనతో పాటు కుటుంబం ఎదుర్కొన్న కష్ట సమయాల గురించి ఆయన రకుల్ భర్త జాకీ ఇలా మాట్లాడారు. ' నేను నా జుహు కార్యాలయాన్ని తనఖా పెట్టిన మాట వాస్తవమే.. కానీ, ఇప్పుడు మళ్లీ తిరిగి సొంతం చేసుకున్నాను. గతంలో వార్తల్లో నిలిచిన భవనం ఇదే. నేను దివాళా తీయడం వల్ల దానిని అమ్మాల్సి వచ్చిందని, ఆహారం కొనడానికి కూడా నా దగ్గర డబ్బు లేదని వారు చెప్పారు. నేను పారిపోయానని వారు చెప్పారు. ఈ పుకార్లకు నేను ఎవరినీ నిందించాలనుకోవడం లేదు, కానీ అవి ఎలా ప్రారంభమయ్యాయో నాకు తెలియదు. అయితే, వాటి వల్ల నా కుటుంబం బాగా ఇబ్బంది పడింది. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాను.' అని ఆయన అన్నారు. ఇదే సమయంలో 'బడే మియాన్ చోటే మియాన్' సినిమా కోసం దర్శకుడిగా అలీ అబ్బాస్ జాఫర్‌ను ఎంపిక చేసి తప్పుచేశానని ఆయన అన్నారు.
జాకీ భగ్నానీ సొంత బ్యానర్ పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా బడే మియాన్ చోటే మియాన్‌ను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.59 కోట్లు మాత్రమే రాబట్టింది. దీంతో భారీ నష్టాలను ఆయన ఎదుర్కొన్నాడు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించారు. అయితే, కనీసం ఓపెనింగ్స్ కూడా పెద్దగా లేకపోవడంతో కనీసం రెండురోజులు కూడా సినిమా రన్ కాలేదు. 1986 నుంచి పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి పలు సినిమాలను జాకీ భగ్నానీ కుటుంబం నిర్మించింది. బాలీవుడ్‌లో ఈ బ్యానర్ నుంచి మంచి విజయాలు సాధించిన చిత్రాలు ఉన్నాయి.