
రజినీకాంత్- లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం కూలీ. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా తొలిరోజు అదరగొట్టింది. రిలీజ్కు ముందే రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ కావడంతో కోలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో కోలీవుడ్ హిస్టరీలోనే రెండో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కూలీ నిలిచింది. కూలీ కంటే ముందుగా విజయ్ నటించిన లియో మొదటి రోజే రూ.145 కోట్ల వసూళ్లు రాబట్టింది.
ఇండియాలోనూ కూలీ మూవీ వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. తొలి రోజే దాదాపు రూ.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తమిళనాడులో రూ. 30 కోట్లు, కర్ణాటకలో రూ.15 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో18 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్లోనూ దాదాపు రూ.75 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.
ఈ వసూళ్ల పరంగా చూస్తే విజయ్ నటించిన 'లియో'ను అధిగమించలేకపోయింది. ఇండియావ్యాప్తంగా దళపతి విజయ్ నటించిన లియో దేశవ్యాప్తంగా మొదటి రోజే దాదాపు రూ. 76 కోట్లు వసూలు చేసింది. అయితే వరుసగా సెలవులు రావడంతో కూలీ కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి. ఈ సినిమాలో సత్యరాజ్, నాగార్జున అక్కినేని, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు.