
మహేశ్‌బాబు నేడు (ఆగష్టు 9) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తను హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ (వర్కింగ్ టైటిల్) నుంచి దర్శకుడు రాజమౌళి ఒక అప్డేట్ ఇచ్చారు. చాలా కాలంగా ఈ సినిమా వివరాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కథ ఏంటి? షూటింగ్ ఎంత వరకూ వచ్చింది? వంటి విషయాలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో మహేశ్ అభిమానుల్లో నిరాశ ఏదురైంది. అయితే, తాజాగా జక్కన్న చేసిన ప్రకటనతో కాస్త రిలాక్స్ అయ్యారు.

మహేశ్‌బాబు సినిమా గురించి ఉద్దేశిస్తూ రాజమౌళి ఇలా పోస్ట్ చేశారు.. 'భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రియమైన సినిమా ప్రేమికులారా, అలాగే మహేశ్ అభిమానులారా.. మేము షూటింగ్ ప్రారంభించి చాలా కాలం అయింది. ఈ చిత్రం గురించి తెలుసుకోవాలనే మీ ఆసక్తిని మేము అభినందిస్తున్నాము. అయితే, ఈ సినిమా కథ పరిధి చాలా విస్తృతమైనది. కేవలం ప్రెస్‌మీట్ పెట్టి ఆపై కొన్ని పోస్టర్స్ విడుదల చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేమని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం మేము ఒక ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం. చాలా లోతైన సబ్జెక్ట్ కోసం కష్టపడుతున్నాం. ఒక అద్భుతాన్ని చూపించేందుకు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాం. అయితే, నవంబర్ 2025లో ఈ సినిమా గురించి ఆవిష్కరిస్తాం. అప్పుడు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఎంతో కాలంగా ఓపికతో ఉన్న మీ అందరికీ ధన్యవాదాలు.' అని రాజమౌళి పేర్కొన్నారు.
అయితే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ‘ఇండియానా జోన్స్’ స్టైల్ కథతో ఈ సినిమా రూపొందుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ కథలో విలన్ ఎవరు? అనే విషయం సినిమా ముగిసేవరకూ ఊహించలేమట. పతాక సన్నివేశాల వరకు నెగెటివ్ రోల్ తెలియనివ్వకుండా ప్రేక్షకులను సస్పెన్స్ చేయనున్నారట రాజమౌళి. ఈ చిత్రంలో మాధవన్ కీలకపాత్రలో కనిపించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. దాంతో ఆయన విలన్‌గా కనిపించనున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంకా చోప్రా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు చేస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.
For all the admirers of my #GlobeTrotter… pic.twitter.com/c4vNXYKrL9
— rajamouli ss (@ssrajamouli) August 9, 2025