
హీరో తన టాలెంట్‌కు పదును పెడుతూ కుళ్లు జోకుతో జనాలను నవ్వించే ప్రయత్నం చేశాడు.
నవ్వడం ఈజీ కావచ్చు, కానీ నవ్వించడం అంత ఈజీ కాదు, అందులోనూ స్టాండప్ కామెడీ అంటే మరీ కష్టం. అయినా సరే వచ్చీరాని జోకులతో నవ్వించడానికి రాహుల్‌గా మన ముందుకు వచ్చాడు రాజ్‌తరుణ్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "స్టాండప్ రాహుల్". శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను హీరో రానా విడుదల చేశాడు. స్టాండప్ కామెడీకి అన్నింటికన్నా ముఖ్యమైనది ఒరిజినాలిటీ అంటూ టీజర్ మొదలైంది. ఆ వెంటనే హీరో తన టాలెంట్‌కు పదును పెడుతూ కుళ్లు జోకుతో జనాలను నవ్వించే ప్రయత్నం చేశాడు.
'ఒక మొఘల్ రాజు యుద్ధానికి వెళ్లినప్పుడు కత్తి కనబడలేదు, ఎందుకంటే అది ఔరంగ'జేబు'లో ఉండిపోయింది' అని పకపకా నవ్వాడు. దీంతో హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఇప్పుడది జోక్, దానికి మళ్లీ నవ్వడం ఒకటా? అని ఓ లుక్కిచ్చుకుంది. ఈ సినిమాలో శ్రేయారావుగా అలరించనున్న వర్ష కూడా స్టాండప్ కమెడియనే కావడం విశేషం. టీజర్ మధ్యలో వచ్చే.. నవ్వించాలంటే ముందు ఏడుపేంటో తెలియాలి అన్న డైలాగ్ బాగుంది. ఇక రాజ్ తరుణ్ అమ్మాయిల కోసం అబ్బాయిలు ఉద్యమాలు చేస్తున్నారంటూ స్పీచ్ ఇచ్చాడు.
"మాకు పిల్లల్ని కనడానికి తప్ప మగాడు అవసరం లేదని ప్రియాంక చోప్రా అంటే ఈలలు వేశారు, అదే మన చలపతిరావు అంటే గోలగోల చేశారు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే అబ్బాయి సింగిల్‌గా ఉంటే పులవుతాడు, అమ్మాయితో ఉంటే పులిహోర అవుతాడు" అని సభ్య సమాజానికి మెసేజ్ ఇచ్చాడు. యూత్‌ను తెగ ఆకట్టుకుంటున్న ఈ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు ప్రణీత్ హనుమంతు టీజర్ ఎడిటింగ్ ఓ రేంజ్‌లో చేశాడని కామెంట్లు పెడుతున్నారు. సాంటో మోహన్ వీరంకిని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నాడు.