బాడీ షేమింగ్‌కు గురై ఆత్మహత్యలు చేసుకునేవారంతా తన దృష్టిలో మూర్ఖులేనని అన్నారు ప్రముఖ నటి రచితా రామ్. రజనీకాంత్ ‘కూలి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటి రచితా రామ్. ఆ సినిమాలో మాస్ విలన్ పాత్రలో నటించి, మెప్పించింది. ప్రస్తుతం కన్నడ సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఆమె నటించిన తాజా కన్నడ చిత్రం ‘కల్ట్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఈవెంట్‌లో బాడీ షేమింగ్ గురించి రచితా(Rachita Ram ) మాట్లాడారు. చాలా మంది ఆడపిల్లలాగే తాను కూడా బాడీ షేమింగ్ ఎదుర్కొన్నానని.. కానీ దాన్ని చాలా తెలివిగా హ్యాండిల్ చేశానని చెప్పారు. వాళ్ల కామెంట్స్‌ని పట్టించుకోకుండా..మన పని మనం చేసుకుంటే సరిపోతుందని ఆమె సలహా ఇచ్చారు.
‘ప్రతి మహిళ శరీరంలో మార్పులు వస్తుంటాయి. ఒక్కొక్కరు ఒక్కో కారణంతో బరువు పెరుగుతుంటారు. పీసీఓడీ, ఒత్తిడి వల్ల కొంతమంది లావు అవుతుంటారు. పీరియడ్స్‌కి ముందు, తర్వాత కూడా శరీరంలో మార్పులు వస్తుంటాయి. నిద్ర కూడా మన శరీరంపై ప్రభావం చూపుతుంది.
కొంతమందికి ఎనిమిది గంట నిద్ర కచ్చితంగా అవరసరం ఉంటుంది. లేదంటే వాళ్ల బాడీలో మార్పులు వచ్చేస్తుంటాయి. నేను కూడా ఆ లిస్ట్‌లోకి వస్తా. నేను సరిగా నిద్రపోకపోతే.. ఉదయం నా మొఖం చాలా ఉబ్బుగా కనిపిస్తుంది. కొన్ని గంటల తర్వాత మళ్లీ సన్నబడుతుంది. నాతో పని చేసే దర్శకులు కూడా ఇది గమనించి చెప్పారు. ఇలాంటి సమస్యలు చాలా మంది మహిళలకు ఉంటాయి. ఇవన్నీ బయటకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకి నచ్చినట్లుగా మనం ఉండాలి. ఇది నా శరీరం.. నా ఇష్టం. ఎందుకు లావు అయ్యామో.. ఎందుకు సన్నబడ్డామో అనే విషయాలను ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదు. మన ఆరోగ్యం గురించి వేరేవాళ్లకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అని రచితా చెప్పుకొచ్చారు.
అలాగే ఆన్‌లైన్‌లో వచ్చే నెగెటివ్ కామెంట్స్, ట్రోలింగ్‌ని ఎలా హ్యాండిల్ చేయాలనేదాని గురించి మాట్లాడుతూ.. ‘ అసలు నెగెటివ్ కామెంట్స్‌ని ఎందుకు చూడాలి? ఎందుకు వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి? అలాంటి విషయాలను మీరు మైండ్‌లోకి తీసుకోకండి. వాటిని పట్టించుకోకుండా.. మన పని మనం చేసుకుంటేనే ప్రశాంతంగా ఉంటాం’ అని రచితా రామ్ చెప్పుకొచ్చింది.


