Kalaipuli: రూ. 100కోట్లతో సినిమా.. లాభాన్ని సమానంగా పంచుతాం

Producer Kalaipuli Announced 100cr Budget Film For Directors Association - Sakshi

తమిళనాడు సినీ దర్శకుల సంఘ సభ్యుల కోసం రూ.100 కోట్లతో సినిమాను నిర్మిస్తానని నిర్మాత కలైపులి ఎస్‌.థాను అన్నారు. ఇటీవల జరిగిన తమిళనాడు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో దర్శకుడు భాగ్యరాజా జట్టుపై ఆర్‌కే సెల్వమణి జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా నూతన కార్యవర్గం పదవీ బాధ్యతలు స్వీకారం కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్‌లో నిర్వహించారు. ఎన్నికల అధికారి సెంథిల్‌ నాథన్‌ సభ్యులతో పదవీ ప్రమాణం చేయించారు.

దర్శకుడు భారతీరాజా అధ్యక్షతన దర్శకుడు విక్రమన్‌ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నిర్మాత కలైపులి ఎస్‌.థాను మాట్లాడుతూ దర్శకుల సంఘం సభ్యుల కోసం తాను రూ.100 కోట్ల బడ్జెట్‌తో చిత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, నటీనటులందరూ అందులో నటించాలన్నారు. అందులో వచ్చిన లాభాన్ని దర్శకుల సంఘం, పెప్సీ సభ్యులందరూ పంచుకోవచ్చునని, ఆ చిత్రానికి దర్శకుడెవరు? కథ ఏమిటి? ఎవరెవరు నటిస్తారు అనేది దర్శకుల సంఘమే నిర్ణయించాలన్నారు.

థాను నిర్ణయాన్ని సంఘం అధ్యక్షుడు ఆర్‌.కె.సెల్వమణి స్వాగతించారు. ఆ చిత్రంలో ప్రముఖ నటీనటులదరూ నటించేలా మంచి కథను తయారుచేసిన దర్శకునికి రూ.50 లక్షలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఆ చిత్రం ద్వారా వచ్చే లాభాన్ని సినీ కార్మికులందరికీ సమానంగా పంచుతామన్నారు. అదేవిధంగా సహ దర్శకులను ప్రోత్సహించే విధంగా ఏటా 70 మంది సహాయ దర్శకులతో లఘు చిత్రాలు రూపొందించడానికి సదుపాయాలు చేస్తామన్నారు. ఇకపై అసిస్టెంట్, అసోసియేట్‌  దర్శకులకు సంఘం ద్వారా వేతనాలను అందించనున్నట్లు వెల్లడించారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top