
దీప్తి గంటా, ప్రశాంతి తిపిర్నేని
‘‘కోర్ట్’ సినిమా నచ్చకపోతే, తాను హీరోగా నటించిన ‘హిట్ 3’ సినిమా చూడొద్దని నానిగారు వేదికపై మాట్లాడినప్పుడు మేం షాక్ అయ్యాం. కానీ నాని అలా అన్నారంటే.. ‘కోర్ట్’ సినిమాపై నమ్మకం ఉంది కాబట్టే అంత కాన్ఫిడెంట్‌గా చెప్పగలిగారు. పైగా రెండు (కోర్ట్, హిట్ 3) సినిమాలకూ నానీయే ఓ నిర్మాత... సోప్రాబ్లమ్ లేదు’’ అని అన్నారు దీప్తి గంటా.
ప్రియదర్శి ప్రధాన పాత్రలో, రోషన్, శ్రీదేవి, శివాజీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. రామ్ జగదీశ్ దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి గంటా సహనిర్మాత.
కాగా ఈ సినిమా విడుదలకు రెండు రోజులు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో ఈ ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా చెప్పిన విశేషాలు.
‘‘నాని, ప్రశాంతిగారు స్క్రిప్ట్ విని ఈ సినిమాను ఓకే చేశారు. ఈ కథ నాకూ నచ్చింది. దర్శకుడు జగదీశ్ రాసిన ‘కోర్ట్’ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఈ సినిమాకు నేను ఆన్‌సెట్ ప్రోడ్యూసర్‌గా జాయిన్ అయ్యాను. సెట్స్‌కు రోజూ వెళ్లేదాన్ని. జగదీశ్ చాలా పరిశోధన చేసి, ఈ సినిమా చేశారు. అందుకే నేచురల్‌గా వచ్చింది.
పోక్సో చట్టం గురించి ఆయన చాలా వివరంగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు. ఇక మంగపతి క్యారెక్టర్‌లో శివాజీగారు అద్భుతంగా నటించారు. ఇంకా ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి... ఇలా ప్రతి పాత్రకు సినిమాలోప్రాముఖ్యత ఉంది. ‘మీట్ క్యూట్’ తర్వాత నేను యూఎస్‌కి వెళ్లిపోయాను. ఈ సినిమా కోసం మళ్లీ వచ్చాను.
కొన్ని కథలు ఉన్నాయి. భవిష్యత్‌లో మళ్లీ దర్శకత్వం వహిస్తాను’’ అన్నారు దీప్తి. నాని ‘వాల్‌పోస్టర్ సినిమా’ బ్యానర్‌లోనే మీ డైరెక్షన్ మూవీ ఉండొచ్చా? అన్న ప్రశ్నకు– ‘‘నేను సినిమా చేస్తే నానితో చేయను. అక్కాతమ్ముళ్లు సెట్స్‌లో ఉండకూడదు’’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు దీప్తి.
నానిగారు పెద్దగా లెక్కలు వేయరు: ప్రశాంతి తిపిర్నేని
‘‘కోర్ట్’ సినిమా ప్రీమియర్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. మేం అనుకున్నదానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుండటం హ్యాపీగా ఉంది. ఈ తరహా జానర్‌లోని మూవీని ఆడియన్స్ ఆదరించి, సక్సెస్ చేయడం కూడా మంచి పరిణామం. ప్రస్తుతానికి ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాం.
నాని, నేను ఇద్దరం కథలు వింటాం. మా నమ్మకం అంతా నానిగారి జడ్జిమెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. నానిగారు పెద్దగా లెక్కలేమీ వేయరు. జానర్ ఏదైనా కథలో నిజాయితీ ఉండి, డైరెక్టర్‌లో క్లారిటీ ఉంటే చాలు ముందుకు వెళ్తాం. ఒక కథ థియేటర్స్‌లో చూడాలనిపించేలా ఉంటే చాలు... సినిమా చేసేందుకు నానిగారు ఒప్పుకుంటారు. నానిగారి సినిమాలు థియేటర్స్‌కు ముందే ఓటీటీ డీల్స్‌ను పూర్తి చేసుకుంటున్నాయంటే అది కథలపై తనకు ఉన్న జడ్జిమెంటే కారణం. ఇక ‘కోర్ట్’లో పోక్సో చట్టం ఎలా దుర్వినియోగం కావొచ్చనే పాయింట్‌ను దర్శకుడు జగదీశ్ అద్భుతంగా చూపించారు’’ అని ప్రశాంతి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment