
ఓ పెద్ద నటుడు, మరీ ముఖ్యంగా అగ్ర హీరోల భార్యలుగా మారడం చాలా మందికి అదృష్టం కావచ్చు అయితే కొందరు మాత్రం కేవలం వారి భార్యలుగా దక్కిన అదృష్టంతో మాత్రమే మిగిలిపోవాలని కోరుకోవడం లేదు. తమను తాము నిరూపించుకోవాలని ఆరాటపడుతున్నారు. అయితే ఈ విషయాన్ని గుర్తించడంలో మన మాధ్యమాలు తరచుగా విఫలమవుతుంటాయి. ఒక పురుషుడిని పెళ్లి చేసుకున్న తర్వాత వంటింటికి మాత్రమే పరిమితమైన గృహిణి ఆకాంక్షలు ఒకలా ఉంటే, పెళ్లి తర్వాత కూడా గడపదాటి తనను తాను నిరూపించుకుంటూ సాగిపోయే వివాహిత ఆకాంక్షలు మరోలా ఉంటాయి అనేది నిర్వివాదం. ఏ వ్యక్తి అయినా తాను సాధించిన విజయాలకు, ప్రత్యేకతలకు తగ్గ వ్యక్తిగత గుర్తింపును ఆశించడం సహజం. దీనికి మగ, ఆడ వ్యత్యాసం లేదు. ఈ నేపధ్యంలో తాజాగా మళయాళ నటుడు ప్రస్తుతం టాప్ పొజిషన్‌లో ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియా మీనన్ తాజాగా ఇచ్చిన ఒక సంచలనాత్మక ప్రకటన ప్రస్తావనార్హం.
ప్రసార మాధ్యమాలతో పాటు అనేక మంది తనను తరచుగా ప్రృధ్వీరాజ్ భార్యగా పేర్కొనడాన్ని ఆమె తప్పుబట్టారు. తాను కేవలం ఒక టాప్ హీరో, నటుడు, సినీ ప్రముఖుడు ‘పృథ్వీరాజ్ భార్య‘గా మాత్రమే పరిగణన పొందాలనే దానిని కోరుకోవడం లేదని ఆమె స్పష్టం చేశారు తన స్వంత కెరీర్‌లో ఒక విజయవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నానని ఆమె బహిరంగంగానే స్పష్టం చేశారు. ఆమె తనకంటూ స్వంత ఇమేజ్ సృష్టించుకోవాలనే కోరికను వ్యక్తం చేశారు. ఏ మగవాడికి సంబంధించి అయినా ‘అతని భార్య‘, ‘అతని తల్లి‘ లేదా ‘అతని కుమార్తె‘గా తగ్గిపోకూడదని ఆమె అంటున్నారు.
పూర్వ జర్నలిస్ట్, ప్రస్తుత చిత్ర నిర్మాత, పృధ్వీరాజ్ ప్రొడక్షన్స్‌కు సహ యజమాని అయిన సుప్రియా, ‘ఎల్2: ఎంపురాన్‘ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఇవే కాక తన కంటూ స్వంత వృత్తిపరమైన విజయాలు ఉన్నప్పటికీ, నిరంతరం తన భర్త పేరుతోనే గుర్తించబడటం అనేది తనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆమె ధైర్యంగా వెల్లడించడం హర్షణీయం.
ఇలా ఒక అగ్రహీరో భార్య బహిరంగంగా వ్యాఖ్యానించడం అనేది నిజంగా ఒక గేమ్ ఛేంజర్ కావచ్చు. మహిళల స్వయం సాధికారత గురించి మాట్లాడే ఉపన్యాసాలు దంచే ఎందరో ప్రముఖులు వారి భార్యలు సాధిస్తున్న విజయాలను తమ సెలబ్రిటీ స్టేటస్ మాటున బలిచేస్తున్న పరిస్థితి ప్రతీ చోటా కనిపిస్తూనే ఉంది. అదే సమయంలో పలువురు నటుల భార్యలు హీరోయిజం అనే షాడో మాటున తమని తాము కోల్పోకుండా వ్యక్తిగత విజయాల కోసం తపిస్తుండడం కనిపిస్తోంది. ఉదాహరణకు టాలీవుడ్ హీరో రామచరణ్ భార్య ఉపాసన, నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ... వంటివారు వ్యక్తిగతంగానూ ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకుంటున్నారు. జీవిత భాగస్వామికి మాత్రమే కాదు తమ కష్టాల ఫలితంగా అందుకున్న తమ వ్యక్తిగత విజయాలకూ గుర్తింపు కోరుకోవడం తప్పు కాదు.. అది.. మహిళ అయినా మగవారైనా..