రాజమౌళిగారు చేస్తానన్నారని నేను డ్రాప్‌ అయ్యాను  | Sakshi
Sakshi News home page

రాజమౌళిగారు చేస్తానన్నారని నేను డ్రాప్‌ అయ్యాను 

Published Fri, Jan 12 2024 1:03 AM

Prashant Varma Talks About Uniqueness Of Hanuman - Sakshi

‘‘ఒక ఫిల్మ్‌ మేకర్‌గా క్వాలిటీ ప్రోడక్ట్‌ ఇవ్వడంపైనే నా ఏకాగ్రత ఉంటుంది. సినిమా విడుదల, థియేటర్ల కేటాయింపులు వంటివి నిర్మాతలకు చెందినవి. ఈ సినిమా సక్సెస్‌ అయితే రాబోయే పదేళ్లల్లో  తెలుగు ప్రేక్షకులు గర్వపడే సినిమాలు చేసేలా మేం కొన్ని ప్లాన్‌ చేసి ఉన్నాం. కానీ ఇప్పుడు ఇదంతా (థియేటర్స్‌ గురించిన వివాదం గురించి పరోక్షంగా స్పందిస్తూ..) జరుగుతోంది.

తప్పు జరుగుతున్నప్పుడు మాట్లాడకపోవడం అనేది ఇంకా పెద్ద తప్పు అన్నట్లుగా ఓ సామెత ఉంది. అందుకే కొన్ని విషయాలపై స్పంది
స్తున్నాను’’ అన్నారు ప్రశాంత్‌ వర్మ. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను–మాన్‌’. కె. నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో ప్రశాంత్‌ వర్మ చెప్పిన విశేషాలు. 

∙‘హను–మాన్‌’ సినిమా కోసం తేజ సజ్జా కొత్తగా మేకోవర్‌ అయ్యాడు. ఇక యాక్టింగ్‌ గురించి నేను అతనికి నేర్పించాల్సింది ఏమీ లేదు. పైగా సెట్స్‌లో ఫలానా సన్నివేశంలో ఇలా యాక్ట్‌ చెయ్‌ అని నటించి, చూపించడం నాకు రాదు. ‘హను–మాన్‌’పై నా కన్నా ఎక్కువగా తేజ ఆశలు పెట్టుకున్నట్లు ఉన్నాడు. ఈ సినిమా కోసం చాలా సమయం కేటాయించాడు. కొత్త సినిమాలేవీ చేయలేదు. రీసెంట్‌గా ఓ సినిమా ఒప్పుకున్నాడు.

సినిమా మొదలైన ఇరవై నిమిషాలు హీరో క్యారెక్టర్‌ సింపుల్‌గా ఉంటుంది. ఎప్పుడైతే హీరో పాత్రకు సూపర్‌ పవర్స్‌ వస్తాయో అప్పట్నుంచి కథ మరింత ఆసక్తిగా  ముందుకు వెళ్తుంది. ∙పురాణాలు, ఇతిహాసాల కథలు, హనుమంతునిపై వచ్చిన కొన్ని ఆర్టికల్స్, ప్రచారంలో ఉన్న కొన్ని అంశాల ఆధారంగా ఈ సినిమా కథ రెడీ చేసుకున్నాను. తెలుగు సినిమా స్టైల్‌ని పోలి ఉండే సూపర్‌ హీరో సినిమా ‘హను–మాన్‌’. ‘బ్యాట్‌మేన్‌’ సినిమాను రాజమౌళిగారు తీస్తే ఎలా ఉంటుందో అలా ‘హను–మాన్‌’ ఉంటుంది. ‘కేజీఎఫ్‌’లో యశ్‌ను ఎలివేట్‌ చేసినట్లుగా ‘హను–మాన్‌’ సినిమా ఉంటుంది.

నిర్మాత నిరంజన్‌ రెడ్డిగారు నాకన్నా పాజిటివ్‌ పర్సన్‌. మేం సినిమా కోసం ఓ ఆలోచన చెబితే, దానికి ఎక్స్‌టెన్షన్‌ లెవల్లో ఆయన ఆలోచించేవారు. దాశరథి శివేంద్రగారు అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చారు. ∙మేం అనుకున్నదాని కన్నా ‘హను–మాన్‌’ బడ్జెట్‌ మూడింతలు పెరిగింది. కానీ పదింతల క్వాలిటీ సినిమాను ఆడియన్స్‌ చూస్తారు. ఇక ఈ సినిమాను త్రీడీలో రిలీజ్‌ చేయాలంటే మరికొంత బడ్జెట్‌ కావాలి. అందుకే త్రీడీలో విడుదల చేయడం లేదు. అయితే రిలీజ్‌ తర్వాత మంచి స్పందన వస్తే, భవిష్యత్‌లో రీ–రిలీజ్‌లో త్రీడీలో కూడా రిలీజ్‌ చేస్తాం.

ఓ నెల గ్యాప్‌ తర్వాత విదేశీ భాషల్లో ‘హను–మాన్‌’ను రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నాం. ∙పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా సినిమాలు చేయాలనే ఆసక్తి ఉంది. మహాభారతంపై ఓ సినిమా చేయాలనుకున్నాను. కానీ రాజమౌళిగారు చేయాలను టున్నారని తెలిసి డ్రాప్‌ అయ్యాను.

 
Advertisement
 
Advertisement