Radhe Shyam Movie: అది మా ఫ్యామిలీ బ్లడ్‌లోనే ఉంది: సాయి ప్రసీద

Prabhas Sister Sai Praseeda Comments on Radhe Shyam Movie - Sakshi

సాయిప్రసీద.. డాటర్‌ ఆఫ్‌ రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు. సిస్టర్‌ ఆఫ్‌ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. తండ్రి, అన్నయ్యల విజిటింగ్‌ కార్డ్‌తో నిర్మాతగా పరిచయమవుతున్నారు ప్రసీద ఉప్పలపాటి. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్‌’కి ప్రసీద ఓ నిర్మాత. కె. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో  వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ప్రసీద చెప్పిన విశేషాలు.

►మీరు నిర్మాతగా లాంచ్‌ కావడానికి ‘రాధేశ్యామ్‌’ సరైన ప్రాజెక్ట్‌ అని ఎందుకు అనిపించింది?
అమెరికాలో ప్రొడక్షన్‌ కోర్స్‌ చేశాను. తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు ‘రాధేశ్యామ్‌’ రైట్‌ ప్రాజెక్ట్‌ అని నాన్న (కృష్ణంరాజు), అన్నయ్య (ప్రభాస్‌) సపోర్ట్‌ చేశారు. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలోనే పెరిగాను కాబట్టి సినిమాలంటే ఆసక్తి ఉంది. అయితే ఏదైనా వేరే బిజినెస్‌ చేద్దామని లండన్‌లో మాస్టర్స్‌ చేశాను. కానీ సినిమాలపై ఇష్టంతో ‘సాహో’కి వర్క్‌ చేసి, ఆ తర్వాత మాస్టర్స్‌ చేయడానికి యూఎస్‌ వెళ్లాను. అక్కడ నా థియరీస్‌ అన్నీ సినిమాపైనే చేశాను. నిజానికి మా అమ్మగారు (శ్యామల) బిజినెస్‌వైపే వెళ్లమన్నారు. కానీ బిజినెస్‌ మొదలుపెట్టి, సినిమాల మీద ఇష్టంతో మళ్లీ వెనక్కి వచ్చి టైమ్‌ వేస్ట్‌ ఎందుకని ఇండస్ట్రీవైపే వచ్చేశాను.

►ప్రొడక్షన్‌ కోర్స్‌లో నేర్చుకున్నదానికి, ‘రాధేశ్యామ్‌’ని నిర్మించడానికి ఉన్న తేడాలేంటి?
పుస్తకంలో చదివినదానికి ప్రాక్టికల్‌గా చేయడానికి తేడా ఉంటుంది. యూఎస్‌లో ప్రొడక్షన్‌ కోర్స్‌ చేశాక నెట్‌ఫ్లిక్స్‌కి చెందిన ఓ హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌కి వర్క్‌ చేశాను. మన వర్కింగ్‌ స్టైల్‌కి, అక్కడి వర్కింగ్‌ స్టైల్‌కి చాలా తేడాలు కనిపించాయి. మన దగ్గర సెట్స్‌లో కనిపించే ఫన్‌ అక్కడ కాస్త తక్కువ. అలానే మేకింగ్‌వైజ్‌గా కూడా చాలా తేడా ఉంది.

అన్నయ్య ప్రభాస్‌తో...

►కృష్ణంరాజుగారు ఖర్చు బాగా పెట్టి గ్రాండ్‌గా సినిమాలు తీసేవారు. మరి నిర్మాతగా మీరు?
ఈ విషయంలో నాన్నలా ఉండకూడదని నేర్చుకున్నాను (నవ్వుతూ). వృథా ఖర్చులు తగ్గించుకోవాలనే విషయంపైనే ఎక్కువగా ఫోకస్‌ పెడుతున్నాను. అలా అని నిర్మాణ పరంగా ఖర్చు చేయకూడదని కాదు. ఖర్చంతా స్క్రీన్‌పై కనిపించాలి. ఆడియన్స్‌కు విజువల్‌ ట్రీట్‌లా అనిపించాలి. ‘రాధేశ్యామ్‌’ దాదాపు 300 కోట్లతో నిర్మించిన సినిమా కాబట్టి కాస్త టెన్షన్‌గా ఉంది. కానీ ఈ సినిమాతో మంచి అనుభవజ్ఞులు అసోసియేట్‌ కావడంవల్ల మంచి రిజల్ట్‌ వస్తుందనే నమ్మకం ఉంది.

►గోపీకృష్ణా మూవీస్‌ బాధ్యతలను మీకు అప్పజెప్పేటప్పుడు కృష్ణంరాజుగారు, ప్రభాస్‌గారు ఎలాంటి జాగ్రత్తలు చెప్పారు?
సినిమా ప్రొడక్షన్‌ మీద నాకు ఆసక్తి ఉందని నాన్నతో అన్నప్పుడు అన్నయ్యతో చెప్పమన్నారు. అన్నయ్యతో చెబితే, ‘నాకెందుకో సినిమాలపై నీకు ఆసక్తి ఉందనిపించింది. అయితే నా అంతట నేను అడిగి, ఓ ఐడియా క్రియేట్‌ చేయకూడదని అడగలేదు’ అని అన్నయ్య అన్నారు. ‘నాకు తెలిసింది నేర్పిస్తాను. నాన్నగారు కూడా నేర్పిస్తారు. ఆ తర్వాత నువ్వే కష్టపడాలి’ అని కూడా అన్నారు. ఓ దశలో డైరెక్షన్‌ పట్ల ఆసక్తి కలిగినప్పటికీ ఫైనల్‌గా ప్రొడక్షన్‌ వైపే రావాలని నిర్ణయించుకున్నాను.

►మేకింగ్‌ పరంగా ‘రాధేశ్యామ్‌’ చిత్రంలోని కొత్త విషయాల గురించి ఏం చెబుతారు?
ఈ సినిమాకు వర్చువల్‌ ప్రొడక్షన్‌ చేశాం. హాలీవుడ్‌లోని అన్‌రియల్‌ ఇంజిన్‌ అనే ఓ కొత్త టెక్నాలజీని తీసుకువచ్చాం. ‘రాధేశ్యామ్‌’ ఇటలీ బ్యాక్‌డ్రాప్‌ మూవీ. కోవిడ్‌ వల్ల కొన్నిసార్లు అక్కడ షూటింగ్‌ కుదర్లేదు. దీంతో ఈ కొత్త టెక్నాలజీతో ఇటలీనే ఇండియాకు తీసుకువచ్చాం.  

►మీ అన్నయ్య పాన్‌ ఇండియన్‌ స్టార్‌ అయ్యాక మీతో స్పెండ్‌ చేసే టైమ్‌ తనకు దొరుకుతోందా?
ఏమాత్రం వీలున్నా అన్నయ్య ఫ్యామిలీకి టైమ్‌ కేటాయిస్తారు. ఓ గంట సమయం ఉంది.. రండి అని నన్ను, నా చెల్లెళ్లను పిలుస్తారు. మేం వెళ్లిన తర్వాత చాలా టైమ్‌ స్పెండ్‌ చేస్తారు. మిగతావన్నీ పోస్ట్‌పోన్‌ (నవ్వుతూ..). అలాగే ప్రతి ఏడాది రాఖీ పండక్కి మాకు గిఫ్ట్‌లు ఇస్తుంటారు. 

►మీ అన్నయ్యను యాక్షన్‌ హీరోగా చూడటం ఇష్టమా? లేక రొమాంటిక్‌ హీరోగానా?
అన్నయ్య చేసిన రొమాంటిక్‌ ఫిల్మ్‌ ‘డార్లింగ్‌’ ఇష్టం. ఓ ఫ్యాన్‌గా అన్నయ్య యాక్షన్‌ ఫిల్మ్స్‌ ఇష్టం. ‘సలార్‌’ కోసం ఎదురు చూస్తున్నాను.

►ప్రభాస్, కృష్ణంరాజుగార్లు కాకుండా ఇండస్ట్రీలోని వేరేవాళ్ల నుంచి ప్రొడక్షన్‌ పరంగా సలహాలేమైనా తీసుకున్నారా?
వైజయంతీ మూవీస్‌లో అన్నయ్య చేస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ డెవలప్‌మెంట్స్‌లో పాల్గొన్నాను. స్వప్న, ప్రియాంక బాగా గైడ్‌ చేశారు. 

►మీ ముగ్గురు సిస్టర్స్‌లో ప్రభాస్‌గారు ఎక్కువగా ఎవర్ని ప్యాంపర్‌ చేస్తుంటారు?
అన్నయ్య, మా రెండో సిస్టర్‌ ప్రకీర్తి బెస్ట్‌ ఫ్రెండ్స్‌. ‘ప్రాజెక్ట్‌ కె’కి ప్రకీర్తి అసిస్టెంట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా చేస్తోంది. మా చిన్న చెల్లి (ప్రదీప్తి) సైకాలజీ చదువుతోంది. ఈ ఇయర్‌ లాస్ట్‌ గ్రాడ్యుయేషన్‌. చిన్న చెల్లికి సినిమాలపై ఆసక్తి లేదు. నాకు, ప్రకీర్తికి చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉంది. 

నీలిమ గుణ (దర్శకుడు గుణశేఖర్‌ కుమార్తె), కోడి దివ్య (దివంగత దర్శకుడు  కోడి రామకృష్ణ కుమార్తె) వంటి వారు నిర్మాణరంగంలోకి వచ్చారు. ఈ రంగంలో మహిళల సంఖ్య పెరగడంపై మీ అభిప్రాయం?
చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల మహిళలకు ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు లభిస్తాయి. హన్షిత అక్క (నిర్మాత ‘దిల్‌’ రాజు కుమార్తె), నీలిమలతో మాట్లాడుతుంటాను. నీలిమవాళ్లు మొన్ననే చాలా ఆర్గనైజ్డ్‌గా ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేశారు. మహిళా నిర్మాతలుగా మేం మాట్లాడుకుంటూనే ఉంటాం.

►నిర్మాతగా మీ తర్వాతి చిత్రం?
ఓ న్యూ ఏజ్‌ మూవీ కోసం కథలు వింటున్నాను. పెద్ద సినిమాలనే కాదు.. చిన్నవి కూడా నిర్మించాలని ఉంది.

►విందు ఇవ్వడంలో కృష్ణంరాజు, ప్రభాస్‌ ది బెస్ట్‌ అని ఇండస్ట్రీ టాక్‌.. మరి మీరు?
నేనూ వంద శాతం నాన్న, అన్నయ్యలానే. అది మా ఫ్యామిలీ బ్లడ్‌లోనే ఉండిపోయింది. చిన్నప్పటి నుంచి మేం అలానే పెరిగాం. డాడీతో మేం షూట్‌కు వెళ్లినా ఫుడ్‌ ఉంటుంది. ‘బిలా’్ల సినిమా షూటింగ్‌ మలేసియాలో జరిగినప్పుడు మా అమ్మ యూనిట్‌ మొత్తానికి పులావ్‌ వండిపెట్టారు. అలానే నాకూ అలవాటైపోయింది. నేను కూడా యూఎస్‌ వెళ్లినప్పుడు అక్కడ అందరికీ వండిపెట్టేదాన్ని. మా అన్నయ్యకు వంట రాదు.

►మీ నాన్న, అన్నయ్యలో ఉన్న కామన్‌ క్వాలిటీస్‌ ఏంటి?
అందరికీ మర్యాద చేయడం, చక్కగా ఫుడ్‌ పెట్టడం.. ఇలా చాలా కామన్‌ పాయింట్స్‌ ఉన్నాయి. ఒకే రకమైన ప్యాషన్‌తో అన్నయ్య, నాన్న సినిమాలు చేస్తారు. ఇప్పటికీ నాన్నగారు సినిమా పట్ల చాలా ప్యాషన్‌గా ఉంటారు. ‘రాధేశ్యామ్‌’లో నాన్న, అన్నయ్య మధ్య వచ్చే సీన్లు చాలా బాగుంటాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top