
ఒకే బేనర్‌లో ఒక స్టార్ హీరో మూడు సినిమాలు చేయడానికి అంగీకరించడం అంటే అది పెద్ద విషయమే. ఆ బేనర్ అధినేతతో వేవ్ లెంగ్త్ కుదిరితేనే ఇలా ‘త్రీ ఫిల్మ్ డీల్’ ఓకే అవుతుంది. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ ‘హోంబలే’లో ప్రభాస్ మూడు సినిమాలు చేయనున్న విషయం తెలిసిందే. ఈ హీరోతో ‘సలార్: 1 సీజ్‌ఫైర్’ చిత్రంతో ఈ సంస్థ అనుబంధం ఆరంభమైంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘సలార్: 2 శౌర్యాంగపర్వం’ రావాల్సి ఉంది. ఈ రెండో భాగంతో పాటు మరో రెండు చిత్రాలు ఈ సంస్థలో చేయనున్నారు ప్రభాస్.
ఇలా ఒకే బేనర్‌లో మూడు చిత్రాలు చేయాలనుకున్న నిర్ణయం గురించి ప్రభాస్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – ‘‘హోంబలే సంస్థ అధినేత విజయ్ కిరగందూర్‌తో ‘సలార్’తో నా జర్నీ మొదలైంది. సెట్స్‌లో ఆయన అందర్నీ బాగా చూసుకుంటారు. అందరి గురించి ఆయన తీసుకునే కేర్ చూసి, నేను విజయ్‌తో సినిమాలు చేయాలనుకున్నాను. మా మధ్య ఫ్యామిలీ మెంబర్స్‌కి ఉండేలాంటి అనుబంధం పెరిగింది. ఒక ఇంటి మనిషితో ఉన్నట్లే నాకనిపిస్తుంటుంది. అలాగే నేను, తను ఒక విషయంలో సేమ్.
అదేంటంటే... నాలానే తను కూడా తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్‌కిప్రాధాన్యం ఇస్తారు. నాలానే బయట ఎవర్నీ కలవడానికి పెద్దగా ఇష్టపడరు. ఇలాంటి కొన్ని లక్షణాల వల్ల మా వేవ్ లెంగ్త్ కుదిరింది. ఇక నిర్మాతగా క్వాలిటీ విషయంలో రాజీపడరు. ఒకసారి ‘కేజీఎఫ్’ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం జరిగితే... అందరూ టెన్షన్ పడిపోయారట. కానీ విజయ్ కూల్ డౌన్ చేసి, ‘బడ్జెట్ గురించి ఏం బాధపడొద్దు. రాజీపడకుండా సినిమా చేద్దాం’ అన్నారని విన్నాను. అలాగే తను నిర్మించిన ‘కాంతార’, ఇతర సినిమా యూనిట్స్ నుంచి కూడా నేనిలాంటివి విన్నాను’’ అని పేర్కొన్నారు. ఇక హోంబలేతో ప్రభాస్ చేయనున్న మూడు సినిమాల్లో ‘సలార్ 2’ ఒకటి కాగా మిగతా రెండు చిత్రాల వివరాలు తెలియాల్సి ఉంది.