మరింత దయనీయంగా పావలా శ్యామల పరిస్థితి.. ఏదో ఓరోజు.. | Tollywood Senior Actor Pavala Syamala Health And Financial Condition Worsening - Sakshi
Sakshi News home page

Pavala Syamala: చేతిలో చిల్లిగవ్వ లేక తినడానికి తిండి లేక పస్తులుంటున్న కమెడియన్‌.. ఆత్మహత్యే దిక్కంటూ కంటతడి..

Published Wed, Oct 18 2023 12:29 PM

Pavala Syamala Health and Financial Condition Worsening - Sakshi

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పుడు వెలుగు వెలిగిన ఎందరో తారలు చివరి దశలో మాత్రం కష్టాల కడలిలో మునిగిపోయారు. ప్రముఖ నటి పావలా శ్యామల పరిస్థితి కూడా అంతే! వెండితెర‌పై న‌వ్వుల వాన కురిపించిన ఆ న‌టి ఇప్పుడు నిస్సహాయ‌స్థితిలోకి వెళ్లిపోయింది. త‌న‌ను కాపాడండి అంటూ ఆ క‌ళామాత‌ల్లి ముద్దుబిడ్డ చేతులెత్తి అర్థిస్తోంది. ద‌యనీయ జీవితం గడుపుతున్న నటి పావలా శ్యామల జీవిత క‌థ ప్ర‌తి ఒక్క‌రిని కంటతడి పెట్టిస్తోంది. 

ఆర్థిక భారం, వయోభారం..
పావలా శ్యామల... అందరికీ ఆనందం పంచిపెట్టిన ఆమె చాలాకాలంగా దయనీయ జీవితం గడుపుతోంది. ఒకవైపు  ఆర్ధిక భారం.. మరో వైపు  వయోభారం ఆమెకు నరకం చూపిస్తున్నాయి.. అంతేకాకుండా ఎదిగిన కూతురు మంచానికి పరిమితమవ్వడం ఆమెకు మనోవేదనను కలిగిస్తోంది. గతంలో ఆమెకు కొంత మంది నుంచి సాయం అందినా అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కల్గించాయి.

అవార్డులను అమ్మేసుకుంది
తనకు వచ్చిన అవార్డులను అమ్ముకొని ఆ డబ్బుతో బియ్యం, పప్పులు కొనుకొన్న రోజులున్నాయని ఆమె తాజాగా ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అనారోగ్యంతో ఉన్న తాము తినడానికి తిండి లేక ఒక్కోసారి ఐదు రోజులు పస్తులుండాల్సి వ‌చ్చింద‌ని చెప్పింది. అలాంటిది ఇక మందులు ఎక్కడి నుంచి కొనుక్కోగలమని బాధపడింది. పరిస్థితులు ఇలాగే ఉంటే ఏదో ఓ రోజు ఇద్దరం మంచంలోనే ఆకలితో చనిపోతామని కంటతడి పెట్టుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం సరిపోవడంలేదని చెప్తుందంటే ఆమె పరిస్థితి ఏ స్థితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

సినీ కెరీర్‌..
పావలా శ్యామల 1984లో బాబాయ్ అబ్బాయ్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించింది. స్వర్ణ కమలం, కర్తవ్యం, ఇంద్ర, ఖడ్గం, బ్లేడ్ బాబ్జీ, గోలీమార్ సహా సుమారు 250 సినిమాలలో హాస్య నటిగా, సహాయ నటిగా నటించింది. అనేక అవార్డులు, సన్మానాలు అందుకున్న ఆమె నేడు తినడానికి తిండి కూడా లేక, అనారోగ్య సమస్యలతో స‌త‌మ‌త‌మ‌వుతోంది. పావలా శ్యామల ప్రస్తుతం ఫిర్జాదిగూడలోని ఓ వృద్దాశ్రమంలో ఉంటుంది. ఆ ఆశ్రమానికి నెలవారీ డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతోంది. ఆమెకు డబ్బు, మందులు, నిత్యావసర సరుకులు మరేదైనా ఇచ్చి సాయపడాలనుకొంటే నేరుగా ఆమె ఇంటికే వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది.

దినదిన గండంగా బతుకీడుస్తూ, ఆపన్నహస్త కోసం ఎదురుచూస్తున్న నటి పావలా శ్యామలకు సహాయం చేయాలనుకునేవారు కింద ఇస్తున్న బ్యాంక్‌ అకౌంట్‌కు డబ్బులు పంపించవచ్చు.
Neti Shyamala, A/c: 52012871059, IFSC :SBIN0020458, Srikrishna Nager, Yusuf guda Branch, Hyderabad , Cell : 9849175713.

చదవండి: ఎంగేజ్‌మెంట్‌ ఆగిపోవడానికి కారణమిదే! పెళ్లి చేసుకోవాలనుంది.. త్వరలోనే.. : రేణు దేశాయ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement