పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నశివకార్తికేయన్ లేటెస్ట్ మూవీ 'పరాశక్తి'. శ్రీలీల హీరోయిన్ కాగా రవి మోహన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. అధర్వ కీలక పాత్ర చేశాడు. సుధా కొంగర దర్శకురాలు. పీరియాడికల్ స్టోరీతో తీసిన ఈ చిత్రం ఈ శనివారం(జనవరి 10న) థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు తమిళ ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశారు.
1964లో తమిళనాడులో ఓ ఊరిలో జరిగిన ఉద్యమం ఆధారంగా 'పరాశక్తి' తీశారని ట్రైలర్‌తో క్లారిటీ వచ్చేసింది. హిందీని జాతీయ భాషగా ప్రకటించిన తర్వాత మధురైలోని ఓ ఊరిలో విద్యార్థులకు, ఓ ఊరివాళ్లకు.. ఓ పోలీస్‌తో ఎలాంటి గొడవ జరిగింది? చివరకు ఏమైంది అనే పాయింట్‌తో మూవీని తెరకెక్కించారు.ప్రధాన పాత్రధారులు వేషధారణ దగ్గర నుంచి డైలాగ్స్ వరకు ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే తెలుగులో దీనికి ఎంతవరకు ఆదరణ దక్కుతుందో చూడాలి?
ఎందుకంటే 'పరాశక్తి' చిత్రాన్ని జనవరి 10న తెలుగు, తమిళంలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తమిళ వరకు అయితే విజయ్ 'జన నాయగణ్' మాత్రమే పోటీలో ఉంది. తెలుగుకు వచ్చేసరికి 'రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'అనగనగా ఒక రాజు', 'నారీ నారీ నడుమ మురారీ'.. ఇలా ఐదు తెలుగు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు 'పరాశక్తి'కి ఏ మేరకు థియేటర్లు లభిస్తాయనేది, సబ్జెక్ట్ ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది చూడాలి?


