Lata Mangeshkar: అభిమానిగా మారిన పాక్‌ నియంత జియా 

Pakistan Brutal Dictator Zia Ul Haq Also Fan Of Lata Mangeshkar - Sakshi

సుమధుర గాయని, భారత రత్న లతా మంగేష్కర్‌ గాత్రానికి ముగ్దుడు కానీ సినీ ప్రియుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.పాకిస్తాన్‌లో సంగీతం, లలిత కళలపై కఠిన నిషేధం విధించిన నాటి కరడుగట్టిన నియంత జనరల్‌ జియా ఉల్‌ హక్‌ కూడా లత గాన మాధుర్యానికి ఫిదా అయ్యాడు. తానామె అభిమానినని 1982లో ప్రఖ్యాత జర్నలిస్టు కుల్‌దీప్‌ నయ్యర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. 1977లో సైనిక తిరుగుబాటు ద్వారా జుల్ఫికర్‌ అలీ భుట్టో సర్కారును కూలదోసి జియా అధికారంలోకి రావడం తెలిసిందే. తర్వాత భుట్టోను హత్య కేసులో ఉరి తీయించాడు. దానిపై దేశమంతటా వెల్లువెత్తిన నిరసనలను కట్టడి చేసే చర్యల్లో భాగంగా మహిళలు పాల్గొనే సంగీత, సాహిత్య ప్రదర్శనలపై నిషేధం విధించాడు. అందుకే తన అభిమాన గాయని లతతో కూడిన భారత గాయక బృందం పాకిస్తాన్‌లో పర్యటించేందుకు అనుమతించలేదు! 

గోవాలో మూలాలు 
లత మూలాలు గోవాలో ఉన్నాయి. అక్కడి మంగేషీ గ్రామం ఆమె పూర్వీకుల స్వస్థలం. అక్కడి మంగేషీ ఆలయంలో మంగేశుని పేరుతో కొలువైన శివుడు లత కుటుంబీకుల కులదైవం. ఆయన పేరిటే ఈ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం ఇంటి పేరు మంగేష్కర్‌గా స్థిరపడింది. లత తండ్రి అయిన సంగీత దర్శకుడు, రంగస్థల నటుడు దీనానాథ్‌ మంగేష్కర్‌ అసలు పేరు దీనానాథ్‌ అభిషేకీ. తమ ఊరిపై మమకారంతో ఇంటిపేరును మంగేష్కర్‌గా మార్చుకున్నారు. ఆ ఇంటి పేరుకు పెద్ద కూతురు లత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top