కిడ్నాప్‌ కేసులో 'మైత్రీ మూవీ మేకర్స్‌' అధినేత నవీన్‌ యర్నేని | Naveen Yerneni Name In Phone Tapping And Kidnapped Case | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ కేసులో 'మైత్రీ మూవీ మేకర్స్‌' అధినేత నవీన్‌ యర్నేని

Apr 15 2024 10:40 AM | Updated on Apr 15 2024 12:57 PM

Naveen Yerneni Name In Phone Tapping And Kidnapped Case - Sakshi

క్రియా హెల్త్‌కేర్‌ వివాదంలో బలవంతపు షేర్లు, యాజమాన్య బదిలీ వ్యవహారంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేత నవీన్‌ యర్నేని పేరు ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన నిందితుల జాబితాలో ఆయన కూడా ఉన్నారని జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది. అక్రమ ఫోన్‌ ట్యాపింగ్, వ్యాపారుల పట్ల బెదిరింపు వసూళ్లు ఆరోపణలపై  హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావుతో పాటు ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు, ఎస్సై మల్లికార్జున్‌పై జూబ్లీహిల్స్‌ ఠాణాలో కిడ్నాప్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే. 

సంచలనంగా మారిన ఈ ఫోన్‌ ట్యాపింగ్ వివాదం విషయాన్ని తెలుసుకున్న క్రియా హెల్త్‌కేర్‌ డైరెక్టర్‌ చెన్నుపాటి వేణుమాధవ్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులను కొద్దిరోజుల క్రితం సంప్రదించారు. ప్రస్తుతం ఫోన్‌ ట్యాపింగ్‌లో చిక్కుకున్న వారిలో కొందరు గతంలో తనను కిడ్నాప్‌ చేసి తన  కంపెనీ షేర్లను బలవంతంగా బదలాయించుకున్నారని ఫిర్యాదు చేశారు. ప్రాణభయంతో ఇన్నాళ్లు మిన్నకుండిపోయిన వేణుమాధవ్‌కు ఇటీవల రాధాకిషన్‌రావు అరెస్టు విషయం తెలిసి ధైర్యంగా ముందుకు వచ్చి  జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీని ఆధారంగా అధికారులు రాధాకిషన్‌రావు, చంద్రశేఖర్‌ వేగే, గట్టుమల్లు, మల్లికార్జున్, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీ తదితరులపై ఐపీసీలోని 386, 365, 341, 120 (బీ), రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

హైదరాబాద్‌కు చెందిన వేణుమాధవ్‌ చెన్నుపాటి ప్రపంచ బ్యాంక్‌లో కొన్నాళ్లు పని చేసిన తర్వాత 2008లో తిరిగి వచ్చి 2011లో క్రియా హెల్త్‌కేర్‌ సంస్థను స్థాపించారు. ఈ కేసు వ్యవహారంలో పోలీసులతోపాటు తన సంస్థకు చెందిన నలుగురు పార్ట్‌టైమ్‌  డైరెక్టర్లకు సైతం లబ్ధి చేకూరినట్లు తాజాగా ఫిర్యాదులో వేణుమాధవ్‌ పేర్కొన్నారు. దీంతో ఆ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న నిర్మాత నవీన్‌ యర్నేని, గోపాలకృష్ణ సూరెడ్డి,రాజ్‌ తలసిల, రవికుమార్‌ మందలపు, వీరమాచినేని పూర్ణచందర్‌రావులను  నిందితుల జాబితాలో తాజాగా చేర్చారు. దీంతో వారందరికీ నోటీసులు ఇచ్చి విచారించేందుకు పోలీసులు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement