వెండితెరపై కనిపించనున్న క్రీడాకారులు

National Sports Day: Biopics On Sports Champions In Hyderabad - Sakshi

సాక్షి, హదరాబాద్‌: పీవీ సింధు, మిథాలీరాజ్, సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్‌... వెండితెరపై సందడి చేయనున్నారు. అదేంటి.. వీరంతా సినిమాల్లో నటిస్తున్నారా..! అని అనుకోకండి. వీరి జీవిత కథలతో సినిమాలు రానున్నాయి. ఈ ప్రాజెక్టులు అప్పుడే పట్టాలపై కూడా ఎక్కేశాయి. మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్, బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ పి.వి.సింధూ, సైనా నెహ్వాల్,  కోచ్‌ పుల్లెల గోపిచంద్‌లకు సంబంధించిన బయోపిక్‌లు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మిథాలీరాజ్‌ బయోపిక్‌కు ‘శభాష్‌ మిత్తూ’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా..సైనా నెహ్వాల్, పుల్లెల గోపిచంద్‌ బయోపిక్‌లకు ఇంకా పేర్లు నిర్ణయించలేదు. పీవీ సింధూ బయోపిక్‌కు సంబంధించి ఇంకా పాత్రల ఎంపికలోనే ఉంది. గల్లీ గ్రౌండ్‌ నుంచి అంతర్జాతీయ గ్రౌండ్‌ వరకు తమ సత్తా చాటిన మన హైదరాబాదీ క్రీడాకారుల బయోపిక్‌లు వెండితెరలపై కనువిందు చేయనున్నాయి. నేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వారి బయోపిక్‌లకు సంబంధించిన వివరాలతో     


   
గల్లీ గ్రౌండ్‌ టూ బయోపిక్‌ 
ప్రపంచం గర్వించదగ్గ క్రీడాకారులు మన హైదరాబాద్‌ నుంచి ఉండటం విశేషం. క్రికెట్‌ దిగ్గజం మిథాలీరాజ్‌ దొరై, బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ పీ.వి.సింధూ, సైనా నెహ్వాల్, కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ల బయోపిక్‌లు నిర్మించేందుకు బాలీవుడ్‌ ముందుకొచ్చింది. ఒకప్పుడు గల్లీ గ్రౌండ్‌లో మొదలైన వీరి ప్రస్థానం దశల వారీగా అంతర్జాతీయ గ్రౌండ్‌లపై తమ సత్తాను యావత్‌ ప్రపంచానికి చాటి చెప్పారు. మారోసారి వీరికి సంబంధించిన బయోపిక్‌లతో వెండితెరపై కూడా వీరి సత్తాను చూపించడానికి రెడీ అవుతున్నారు.  

సింధూగా దీపిక? 
సింధూ బయోపిక్‌లో నటించే వారి వివరాలను మాత్రం సోనూసూద్‌ అప్పుడే వెల్లడించట్లేదు. బయోపిక్‌ నిర్మిస్తున్నట్లు ప్రకటించినప్పుడు సోనుసూద్‌కు ఎంతోమంది హీరోయిన్లు కాల్స్‌ చేసి మరీ మేం చేస్తామంటే మేం చేస్తామంటూ పోటీ పడ్డ విషయాన్ని ఆయన వివరించారు. అయితే పీవి ముఖానికి, తన ఎత్తు, పర్సనాలిటికి సంబంధించి సెట్‌ అయ్యేది ఒకే ఒక్కరు బాలివుడ్‌ టాప్‌ స్టార్‌ దీపిక పదుకొనే. గతంలోనే ఆమెను సోనుసూద్‌ సంప్రదించగా అంగీకరించారు. అప్పుడు తన కాల్షీట్స్‌ లేని కారణంగా బయోపిక్‌ ఇంకా పట్టాలెక్కలేదు. అయితే.. ఇటీవల కాలంలో టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత..  సింధూగా చేస్తుందనే వార్తలు వచ్చాయి. వీటిలో నిజం లేదని సోనుసూద్‌ “సాక్షి’కి తెలిపారు. అన్నీ కలిసొస్తే దీపిక  నటించే అవకాశం ఉన్నట్లు హింట్‌ ఇచ్చారు సోనుసూద్‌.! 

మిథాలీ, సింధు, సైనాలపై బాలీవుడ్, పుల్లెలపై టాలీవుడ్‌ 
ఇటీవల కాలంలో మిథాలీరాజ్, సింధూ, సైనా నెహ్వాల్‌ల ఆటకు యావత్‌ భారతం ఫిదా అయ్యింది. సింధూని ప్రపంచస్థాయి పోటీల్లో నిలబెట్టిన ఘనతను కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ సొంతం చేసుకున్నారు. వీరి జీవిత చరిత్రలను బయోపిక్‌గా తీసేందుకు బాలివుడ్, టాలివుడ్‌ ముందుకొచ్చింది. సింధూపై బయోపిక్‌ని నిర్మించేందుకు ప్రముఖ నటుడు సోనుసూద్, మిథాలీరాజ్‌పై ‘వయోకామ్‌–18’, సైనా నెహ్వాల్‌పై సినిమా నిర్మించేందుకు ‘టీ సిరీస్‌’ సంస్థలు ముందుకు రాగా..కోచ్‌ పుల్లెల గోపిచంద్‌పై నిర్మించేందుకు టాలివుడ్‌కు చెందిన డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తార్‌ ముందుకొచ్చారు.  

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ 
లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ వల్ల కొంత షూటింగ్‌ జరిగి నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ లేకపోతే ఈ ఏడాది దసరా, క్రిస్మస్‌ టైంకి ఈ మూడు బయోపిక్‌లు విడుదలయ్యేవి. ఇప్పుడు సినిమా షూటింగ్‌లకు కేంద్రప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో మరికొన్ని రోజుల్లో ఈ మూడు ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. వచ్చే ఏడాది దసరా నాటికి ఈ మూడు రిలీజ్‌ అయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. పీ.వి.సింధూ బయోపిక్‌ మాత్రం వచ్చే ఏడాది ఇచివర్లో కానీ..2022 సమ్మర్‌లో కానీ విడుదలయ్యే అవాకాశం ఉందని సోనుసూద్‌ ‘సాక్షి’తో చెప్పారు.  

శ్రద్థా టు పరిణీతి 
సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో నటించేందుకు 2018లో ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధ కపూర్‌ కసరత్తులు చేసింది. తన అధికారికి ట్విట్టర్‌ ఖాతాలో కూడా సైనా బయోపిక్‌లో నటిస్తున్నట్లు వెల్లడించింది. సరిగ్గా ఏడాది తిరిగేలోపు ఆమె స్థానంలో పరిణీతిచోప్రా చేరి శ్రద్ధ పక్కకు తప్పుకుంది. శ్రద్ధ కపూర్‌ కంటే పరిణీతి చోప్రానే సైనాలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం విశేషం.  

ప్రొఫెషన్‌ టూ పర్సనల్‌ లైఫ్‌ 
మిథాలీరాజ్, సింధూ, సైనా నెహ్వాల్‌లు చిన్నతనం నుంచి వారికి ఆయా ఆటలపై మక్కుల ఎలా వచ్చింది. ఆ సమయాల్లో వీరికి ఎవరెవరు ఏ విధమైన సాయం చేశారు, ఎవరెవరు విమర్శించారు, సంతోషాలు, విచారాలు ఇలా అన్ని అంశాలను పొందుపరుస్తూ ఈ బయోపిక్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. నగరంలోని గల్లీల్లో ఆడుకునే వీరు ప్రపంచస్థాయికి ఎదిగిన వైనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేందుకు దర్శకులు సిద్ధమవుతున్నారు.  పుల్లెల గోపీచంద్‌ చిన్న పాటి గ్రౌండ్‌ నుంచి అర్జున అవార్డు స్థాయి వరకు ఎలా వచ్చాడు, సింధూను ప్రపంచ పోటీలకు ఎలా తీసికెళ్లగలిగాడు అనే ప్రతి ఒక్క అంశాన్ని బయోపిక్‌లో చూపించనున్నారు. వారి ప్రొఫెషనల్‌ ఆటనే కాదు పర్సనల్‌ లైఫ్‌ని ఎంతవరకు పక్కన పెట్టారు, చిన్నపాటి సరదాలను కూడా వదులుకున్న సందర్భాలను కూడా ప్రేక్షకులకు ఈ బయోపిక్‌ల ద్వారా తెలపనున్నారు.  

తాప్సీ, పరిణీతిచోప్రా, సుధీర్‌బాబులే యాప్ట్‌ 
ఇటీవల విడుదలైన మిథాలీ బయోపిక్‌ ‘శభాష్‌ మిత్తూ’లో హీరోయిన్‌ తాప్సీ పొన్ను అచ్చుగుద్దినట్లు మిథాలీరాజ్‌లాగానే ఉంది. సైనా నెహ్వాల్‌తో కలసి నెట్‌ ప్రాక్టీస్‌ చేసిన బాలీవుడ్‌ నటి పరిణీతిచోప్రా సేమ్‌ సైనాను దించేసింది. ఇక పుల్లెల గోపీచంద్‌ పాత్రలో మన టాలివుడ్‌ హీరో సుధీర్‌బాబు కనువిందు చేయనున్నారు. ఈ ముగ్గురి క్రీడాకారుల ముఖాలకు ఇంచుమించు మ్యాచ్‌ అవుతున్న తాప్సీ, పరిణీతి, సుధీర్‌బాబులను సెలెక్ట్‌ చేసుకోవడంలో దర్శకులు సక్సెస్‌ అయ్యారు. వీరికి సంబంధించిన అప్‌డేట్స్‌ ఇటీవల కాలంలో ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లలో రావడంతో నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంది. చక్కగా యాప్ట్‌ అయ్యే క్యారెక్టర్లను ఎంచుకున్నట్లు సోషల్‌ మీడియాలో పొగడ్తల వెల్లువెత్తుతున్నాయి. 

ఆమె చెప్పిన వన్‌వర్డ్‌ ఆన్సర్‌తో ఫిదా అయ్యా 
మహిళల ప్రపంచ కప్‌కు ముందు జరిగిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో మీ ఫేవరెట్‌ మేల్‌ క్రికెటర్‌ ఎవరంటూ ఓ జర్నలిస్టు వేసిన ప్రశ్నకు మిథాలీరాజ్‌ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చి యావత్‌ ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకుంది. ఇదే క్వశ్చన్‌ను మీరు మేల్‌ క్రికెటర్‌ను ఎందుకడగరంటూ ప్రశ్నించింది. ఆ సన్నివేశం ఇంకా నా కళ్లముందు కనిపిస్తూనే ఉంది. ఆమె డేర్, ఆమె స్ట్రైట్‌ ఫార్వర్డ్‌ నాకెంతో నచ్చాయి. మిథాలీలా నటించమని నన్ను అడగ్గానే యస్‌ చెప్పేశా. ఆ ఒక్క ఆన్సర్‌తో ఫిదా అయ్యాను. శభాష్‌ మిత్తూలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. – తాప్సీ పొన్ను, బాలీవుడ్‌ నటి 

తనలా చేయడం గొప్ప అనుభూతి 
గ్రౌండ్‌లో సైనా నెహ్వాల్‌ ఆడుతున్న ఆటకు బాగా కనెక్ట్‌ అవుతాను. నేను అసలు ఎప్పుడూ ఉహించలేదు సైనాపై బయోపిక్‌ వస్తుందని..అందులో నేనే నటిస్తానని. తనతో కలసి ఎన్నో విషయాలను షేర్‌ చేసుకుంటూ, నేర్చుకుంటూ నటించడం చాలా అనుభూతిగా ఫీల్‌ అవుతున్నాను. ఖచ్చితంగా అందర్నీ మెప్పిస్తాననే ధీమా ఉంది. 
– పరిణీతి చోప్రా, బాలీవుడ్‌ నటి 

గోపి.. నా ఇన్‌స్పిరేషన్‌ 
గోపి (గోపీచంద్‌) నా ఇన్‌స్పిరేషన్‌.. ఒక వ్యక్తిగా నేను పరిణితి చెందడంలో గోపి పాత్ర చాలా ఉంది. అతనితో నాకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ప్రతిసారీ గర్వంగా అనిపిస్తుంది. ఆరోజుల్లో ఇద్దరం కలసి ఆడటం, ఎన్నో విషయాలను షేర్‌ చేసుకున్నాం.  అతని బయోపిక్‌ ద్వారా రాబోయే తరం గోపిని ఆదర్శంగా తీసుకోవాలి. అన్నీ సక్రమంగా ఉంటే వచ్చే ఏడాది చివర్లో బయోపిక్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. – సుధీర్‌బాబు, సినీ హీరో 

కలసి ఆడాం.. అతనే చెయ్యడం హ్యాపీ 
ఒకప్పుడు నేనూ, హీరో సుధీర్‌బాబు కలసి విజయవాడలో బ్యాడ్మింటన్‌ ఆడాం. మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు అతనే నా బయోపిక్‌లో నటించడం ఆనందంగా ఉంది. ప్రారంభ దినాల్లో మేం ఎన్నో ఇబ్బందులు పడ్డాము, ఈ స్థాయికి ఎలా వచ్చేమనే విషయాలు ఈనాటి యువతకు బయోపిక్‌ల ద్వారా తెలపడం ఆనందంగా ఉంది.
– పుల్లెల గోపిచంద్, బ్యాడ్మింటన్‌ కోచ్‌. 

చాలా హ్యాపీగా ఉన్నా 
నా మీద బయోపిక్‌ రావడం పట్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పైగా పరిణీతి చోప్రా నాలా నటిస్తుంది. నానుంచి ఆమెకు కావల్సిన టిప్స్‌ అన్నీ ఇచ్చాను. షూటింగ్‌ అంతా
 పూర్తయ్యి రిలీజ్‌ అయితే ప్రేక్షకులతో కలసి చూడాలనిపిస్తుంది.  – సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌  

కష్టానికి గుర్తింపు బయోపిక్‌  
చిన్నప్పటి నుంచి ప్రపంచస్థాయి వరకు నేను పడిన కష్టం, శ్రమకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, ప్రజల మన్నలను అందుకున్నాను. కానీ నేను పడిన కష్టం, ఆరోజుల్లో ఏ విధమైన వసతులు లేకుండా పట్టుబట్టి మరీ ఆటపై పట్టు సాధించడాన్ని ఇప్పుడు బయోపిక్‌ ద్వారా యావత్‌ ప్రపంచానికి చూపించే ప్రయత్నం జరగడం ఆనందంగా ఉంది. విదేశీ గడ్డపై నా గెలుపు అనంతరం మువ్వెన్నెల జెండా రెపరెపలాడిన సమయంలో ఎంత సంతోషంగా ఉందో..ఇప్పుడు బయోపిక్‌ ద్వారా నా జీవిత చరిత్ర ప్రేక్షకుల ముందుకు రావడం గర్వంగా అనిపిస్తుంది.  – పీ.వి.సింధూ, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ 

బయోపిక్‌ రావడం ఆదర్శమనిపిస్తుంది
ఒకప్పుడు క్రికెట్‌ అంటే అమ్మాయిలకెందుకు అనేవాళ్లు. మేం ప్రపంచకప్‌ పోటీల్లో ఆడిన ఆటకు తతి ఒక్కరూ ఫిదా అయ్యారు, మమ్మల్ని మెచ్చుకున్నారు. అంతేకాకుండా తమ అమ్మాయిలను క్రికెట్‌ కెరీర్‌గా మలుచుకోమని పంపండం సంతోషంగా ఉంది. నా గురించి బయోపిక్‌ రావడం నిజంగా నేటితరం వారికి ఆదర్శమనిపిస్తుంది. 
– మిథాలీరాజ్‌ దొరై, ఇండియన్‌ క్రికెటర్‌ 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top