టైటిల్: నారీ నారీ నడుము మురారి
నటీనటులు: శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య, నరేశ్, వెన్నెల కిశోర్, సత్య, సుదర్శన్, సంపత్ రాజ్ తదితరులు
నిర్మాత: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
విడుదల తేది: జనవరి 14, 2026
ఈ సంక్రాంతికి చివరగా వచ్చిన సినిమా ‘నారి నారి నడుమ మురారి’. మిగతా సినిమాలతో పోల్చితే దీనికి పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ చిత్రంపై కాస్త ఆసక్తి పెరిగింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వరుస ప్లాఫులతో సతమతవుతున్న శర్వా.. ఈ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
ఆర్కిటెక్ట్ గౌతమ్(శర్వానంద్).. నిత్య(సాక్షి వైద్య)తో ప్రేమలో ఉంటాడు. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో..ఆయన తండ్రి కార్తిక్(నరేశ్)కి లేటు వయసులో ప్రేమించిన యువతి పల్లవి(సిరి హనుమంతు)తో పెళ్లి జరిపిస్తాడు. ఆ తర్వాత తన ప్రియురాలు నిత్యని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. నిత్య తండ్రి రామలింగయ్య(సంపత్ రాజ్) తొలుత ఈ పెళ్లికి ఒప్పుకోడు. కానీ కూతురు బాధ చూడలేక చివరకు ఒప్పుకుంటాడు. అయితే రిజిస్టర్ ఆఫీస్‌లోనే పెళ్లి చేసుకోవాలని షరతు విధిస్తాడు.
తప్పనిసరి పరిస్థితుల్లో గౌతమ్ ఈ రిజిస్టర్ పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లి దరఖాస్తు కోసం రిజిస్టర్ ఆఫీసుకి వెళ్లగా.. గౌతమ్‌కి అనుకొని సమస్య ఎదురవుతుంది? అదేంటి? దియా(సంయుక్త) ఎవరు? గౌతమ్‌కి ఆమెకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? పెళ్లి కోసం కొడుకు చెప్పే అబద్దాల కారణంగా కార్తీక్-పల్లవిల దాంపత్య జీవితంలో ఎలాంటి మలుపు వచ్చాయి. చివరకు గౌతమ్-నిత్యల పెళ్లి జరిగిందా లేదా? ఈ కథకి లవకుశ(సత్య), సత్యమూర్తి(సునీల్), గుణశేఖర్(వెన్నెల కిశోర్)ల పాత్రలకు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Nari Nari Naduma Murari Review).
ఎలా ఉందంటే..
కామెడీ సినిమాలకు కథ-కథనం ఎలా ఉన్నా సరే.. కడుపుబ్బా నవ్విస్తే చాలు.. ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తారు. ఇక బలమైన కథ.. ఆ కథలోని పాత్రలకు సరైన నటీనటులు తోడైతే అది నారీ నారీ నడుము మురారీ సినిమా అవుతుంది. సామజవరగమన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు రామ్ అబ్బరాజు..మరోసారి అలాంటి కామెడీ కథతోనే ఈ సినిమాను తెరెక్కించాడు. కథలో కొత్తదనం లేకున్నా.. స్క్రీన్‌ప్లేతో మరోసారి మ్యాజిక్ చేశాడు. ముఖ్యంగా డైలాగులు అదిరిపోతాయి. కథనం మొత్తం కరెంట్ పంచ్ డైలాగులతో హిలేరియస్ యాంగిల్ లో సాగుతుంది.
ఆరు పదుల వయసులో హీరో తండ్రి.. పాతికేళ్ల వయసు ఉన్న అమ్మాయిని ప్రేమించడం.. ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోవడంతో ఆమెను స్వయంగా కొడుకే తీసుకొచ్చి.. పెళ్లి చేయించే సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఇలా సినిమా ప్రారంభం నుంచి నవ్వుల యాత్రను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత గౌతమ్-నిత్యల లవ్‌స్టోరీని ‘పులిహోర’తో ముడిపెడుతూ చాలా హిలేరియస్‌గా చూపించాడు. ఈ జంట పెళ్లి కోసం రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్లిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది.
దియా ఎంట్రీతో కథనం మరో మలుపు తిరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కామెడీ డోస్ మరింత పెరగుతుంది. వెన్నెల కిశోర్ ఎంట్రీ..శ్రీమంతం ఎపిసోడ్..విడాకుల పేరుతో నడిచే కోర్టు డ్రామా.. అన్ని నాన్‌స్టాఫ్‌గా నవ్విస్తాయి. ముఖ్యంగా నరేశ్ పాత్ర చుట్టూ వచ్చే సన్నివేశాలు..ఆయన చెప్పే డైలాగులకు పడి పడి నవ్వుతారు. ఆయన పర్సనల్ లైఫ్‌పై కూడా పంచ్‌లు వేసుకోవడం..మరింత ఫన్‌ని జనరేట్ చేసింది. ప్రీక్లైమాక్స్ నుంచి కథనం కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. అయితే క్లైమాక్స్‌లో కూడా మళ్లీ నరేశ్‌పై పంచ్ డైలాగులు వేయడంతో నవ్వుకుంటూ ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఒకటి రెండు డైలాగులు మినహా ఎలాంటి వల్గారిటీ, బూతు సీన్లు లేకుండా క్లీన్ కామెడీతో ఫ్యామిలీ మొత్తం చూసేలా ఈ సినిమాను తెరకెక్కించారు. కథలో కొత్తదనం ఆశించకుండా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాకు వెళ్తే..హాయిగా రెండున్నర గంటల పాటు నవ్వుకోవచ్చు((Positive And Negatives Of Nari Nari Naduma Murari Movie).
ఎవరెలా చేశారంటే...
గౌతమ్ పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయాడు. టైటిల్‌కి తగ్గట్టే ఇద్దరి అమ్మాయిల మధ్య నలిగిపోయే యువకుడి పాత్ర ఇది. శర్వా పాత్ర టెన్షన్ పడే ప్రతిసారి ప్రేక్షకుడి నవ్వు ఆగదు. ఇక ఈ సినిమాకు రెండో హీరో నరేశ్. లేటు వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్న కార్తిక్ పాత్రలో ఆయన జీవించేశాడు. ఆయన నిజ జీవితానికి ఈ పాత్రకు మధ్య పోలికలు ఉండడం.. డైలాగులు కూడా అలానే ఉండడంతో ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు. సెకండాఫ్‌లో ఆయనకు మంచి సీన్లు పడ్డాయి.
ఇక హీరోయిన్లు సాక్షి వైద్య, సంయుక్త.. ఇద్దరూ తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. కథకు సంబంధం లేకున్నా.. సత్య కామెడీ బాగా వర్కౌట్ అయింది. గురువుపై విపరీతమైన ప్రేమ చూసే గుణశేఖర్‌గా వెన్నెల కిశోర్ తనదైన నటనతో నవ్వించేశాడు. సంపత్ రాజు, సునీల్, సుదర్శన్.. ఇలా ప్రతి ఒక్కరు అవకాశం ఉన్న ప్రతి చోట నవ్విస్తూనే ఉంటారు. భాను భోగవరపు అందించిన కథ.. డైలాగులు బాగున్నాయి. కేవలం హీరోకు మాత్రమే కాదు సినిమాలో అన్నిపాత్రలకు అదిరిపోయే డైలాగులు ఉంటాయి. రామ్ మంచి స్క్రీన్‌ప్లేతో ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా సినిమాను తెరకెక్కించాడు. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు అంతగా గుర్తుండవు. జ్ఞానశేఖర్, యువరాజ్‌ల సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్


