
తమిళ హీరో ధనుష్‌తో కలిసి నాగార్జున చేసిన ‘కుబేర’ సినిమా ఈ జూన్ 20న విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమాలో నాగార్జున విలన్‌గా నటించగా, ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. అలాగే నాగార్జున వందో సినిమా పనులు తమిళ దర్శకుడు ఆర్.ఎ. కార్తీక్‌తో జరుగుతున్నాయి.
కాగా తాజాగా శశికుమార్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘అయోత్తి’ పట్ల నాగార్జున ఆసక్తిగా ఉన్నారట. 2023లో విడుదలై, ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఒకవేళ ఈ రీమేక్ వార్త నిజమే అయితే ఈ సినిమాలో ఆయనే హీరోగా నటిస్తారా? లేక నిర్మాణం వరకే పరిమితమవుతారా? అనేది చూడాలి. ఇక ‘అయోత్తి’ కథ విషయానికి వస్తే... ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జీవించే బలరాం తీర్థయాత్ర కోసం తమిళనాడులోని రామేశ్వరానికి వెళతాడు.
కానీ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో బలరాం భార్య జానకి, కూతురు శివానీ గాయపడతారు. చికిత్స తీసుకుంటూనే జానకి మరణిస్తుంది. దీంతో జానకి మృతదేహాన్ని అయోధ్యకు తీసుకెళ్లాలని బలరాం అనుకుంటాడు. కానీ అతనికి అనుకోని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను ఎదుర్కొని, అబ్దుల్ మాలిక్ అనే వ్యక్తి సాయంతో జానకి మృతదేహాన్ని అయోధ్యకు బలరాం ఎలా తీసుకుని వెళ్లాడన్నదే ‘అయోత్తి’ సినిమా.