
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’ (Athadu Movie Re Release) క్లాసిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. జయభేరి ఆర్ట్స్ బ్యానర్ మీద మురళీ మోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న రీరిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘మా బ్యానర్‌లో 2005 ఆగస్టు 10న అతడు సినిమా రిలీజ్ చేశాం. ఇప్పుడు ఆగస్ట్ 9న టెక్నాలజీ పరంగా అప్ గ్రేడ్ చేసి మళ్లీ విడుదల చేస్తున్నాం. ఈ మూవీ కోసం ఓ ఇంటి సెట్‌ను వేస్తే అందరూ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు.
సెట్ తీసేశారు
దాదాపు 90 శాతం సీన్లు అదే సెట్‌లో షూటింగ్ చేశాం. ఆ తరువాత ఆ సెట్‌ను చాలా మంది వాడుకున్నారు. అయితే తర్వాతి కాలంలో ఓఆర్ఆర్ రావడంతో ఆ సెట్ వెళ్లిపోయింది. లేదంటే అక్కడే ఓ స్టూడియో కూడా కట్టేవాళ్లం. ‘అతడు’ మూవీ కోసం మహేశ్‌బాబు చాలా సహకరించారు. ఎంత ఆలస్యమైనా సరే, ఎన్ని డేట్లు అయినా ఇచ్చారు. క్లైమాక్స్ ఫైట్ కోసం చాలా కష్టపడ్డారు. ఈ చిత్రం మా సంస్థకు మంచి గౌరవాన్ని తీసుకు వచ్చింది.
చాలా డబ్బు
సెన్సార్ వాళ్లు ‘అతడు’ మూవీ చూసి ఇంగ్లీష్ సినిమాలా ఉందన్నారు. థియేట్రికల్ పరంగా మేం అనుకున్నంత రేంజ్‌లో ఆడలేదు. కానీ బుల్లితెరపై మాత్రం రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మూవీ కోసం వేసిన సెట్‌ను ఇతర ప్రొడక్షన్ కంపెనీలు కూడా వాడుకున్నాయి. వాటి ద్వారా కూడా చాలా డబ్బులు వచ్చాయి. కమర్షియల్‌గా ‘అతడు’ పట్ల మేం సంతృప్తిగానే ఉన్నాం. నాకు ఈ చిత్రంలో త్రివిక్రమ్ వేషం ఇవ్వలేదు. ‘నాకు వేషం ఇవ్వండి అని ఎవరినీ అడగొద్దు’ అంటూ మా ఆవిడ నాకొక కండీషన్ పెట్టారు.
భార్య కండీషన్
అందుకే ఇంత వరకు ఎవ్వరినీ నేను వేషం అడగలేదు. మహేశ్‌బాబు, త్రివిక్రమ్ డేట్లు ఇస్తే ‘అతడు’ సీక్వెల్‌ను మా బ్యానర్ నిర్మిస్తుంది. ‘అతడు’ మూవీకి మొదట్లో డివైడ్ టాక్ వచ్చింది. కానీ బుల్లితెరపై వచ్చాక ‘అతడు’ గొప్పదనాన్ని అందరూ తెలుసుకున్నారు. అందుకే ఈ రీ రిలీజ్‌కు ఇంత క్రేజ్ ఏర్పడింది. ఇందులో నాజర్ పోషించిన పాత్రకి శోభన్ బాబును అనుకున్నాం. కానీ, ఆయన అందరికీ నేను హీరోగా మాత్రమే గుర్తుండాలి అంటూ ఆ పాత్ర రిజెక్ట్ చేశారు. బుల్లితెరపై ఎక్కువ సార్లు ప్రదర్శించిన చిత్రంగా ‘అతడు’ రికార్డులు క్రియేట్ చేసింది’ అని అన్నారు.
4k వర్షన్
మహేష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధి అన్వేష్ మాట్లాడుతూ.. ఈ రీ రిలీజ్‌ల ద్వారా ఎంత డబ్బు వచ్చినా సరే దాన్ని ఫౌండేషన్ కోసమే వాడుతున్నాం. మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామన్నారు. జయభేరి ఆర్ట్స్ ప్రతినిధి ప్రియాంక దుగ్గిరాల మాట్లాడుతూ .. ‘‘అతడు’ మూవీని ఫిల్మ్‌లో తీశారు. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని దాన్ని 8k, సూపర్ 4Kలోకి మార్చాం. డాల్బీ సౌండ్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. క్లైమాక్స్ ఫైట్‌లో సౌండింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
చదవండి: టెన్షన్ ఎందుకు? భర్త ఉద్యోగానికి వెళ్తే భార్య పిల్లల్ని చూసుకోవాలి!