
పైకి ఎన్ని మాటలు చెప్పినా అందాల రాణులుగా రాణించాలనుకునే వారి అంతిమ లక్ష్యం సినిమాల్లో రాణించడమే అవుతుందనేది నిజం. అందుకు నిదర్శనాలెన్నో మనకు తెలుసు. అయితే అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్నప్పటికీ, తద్వారా వచ్చే అనేక రకాల ఆఫర్లను వాటి ద్వారా వచ్చే డబ్బు పేరు ప్రఖ్యాతుల్ని మాత్రం వద్దనుకున్న ఏకైక బ్యూటీ క్వీన్ రీటా ఫారియా(Reita Faria). మన భారతదేశపు తొలి మిస్ వరల్డ్.
అప్పట్లోనే స్విమ్ సూట్ ధరించడమే కాకుండా బెస్ట్ ఇన్ స్విమ్ సూట్ అనే టైటిల్‌ని కూడా దక్కించుకున్న రీటా..అందాల ప్రదర్శన అంటే సినిమా అవకాశాల కోసమేననే అపోహలను 6 దశాబ్ధాల క్రితమే పటాపంచలు చేశారు. అందాల పోటీలను అత్యంత ప్రొఫెషనల్‌గా తీసుకున్న ఏకైక రోల్‌మోడల్‌గా నిలిచారు.
ఆమె కధలోకి వెళితే... రీటా ఫారియా పావెల్ 1943 ఆగస్టు 23న ముంబైలోని మాతుంగా ప్రాంతంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు గోవా కాథలిక్కులు, తండ్రి జాన్ టివిమ్ అనే గ్రామానికి, తల్లి ఆంటోయినెట్ గోవాలోని శాంటా క్రజ్‌కు చెందినవారు,పెద్ద కుమార్తె ఫిలోమెనా తర్వాత ఫరియా వీరికి రెండవ కుమార్తె. ఆమెది మధ్యతరగతి కుటుంబం, తండ్రి మినరల్ వాటర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు తల్లి బ్యూటీ సెలూన్ నడిపేవారు. యుక్తవయసులోనే 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు వల్ల ఫరియా ఒక సగటు భారతీయ అమ్మాయిలా కాక అసాధారణంగా అనిపించేవారు.
దాంతో ఆమె ’మమ్మీ లాంగ్ లెగ్స్ ’ అంటూ సహ విద్యార్థుల ఎగతాళికి గురయ్యారు. అయితే ఫారియా తన పొడవైన స్లిమ్ ఫిజిక్‌ని క్రీడలలో సత్తా చాటడం కోసం ఉపయోగించుకుని ’త్రోబాల్, నెట్‌బాల్ బ్యాడ్మింటన్ ఇలా పలు క్రీడల్లో రాణించారు. హాకీలో హ్యాట్రిక్ సాధించి తొలిసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత ఆమె మిస్ బాంబే పోటీలో పాల్గొని గెలుచుకున్నారు. అదే ఊపులో ఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా పోటీని గెలుచుకుని తద్వారా మిస్ వరల్డ్ 1966 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి అర్హత సాధించారు. మిస్ వరల్డ్ పోటీల్లో, ’బెస్ట్ ఇన్ స్విమ్‌సూట్’ వ’బెస్ట్ ఇన్ ఈవినింగ్‌వేర్’ అనే ఉప–టైటిళ్లను గెలుచుకుని, ఫైనల్స్‌లో ఇతర దేశాల నుంచి∙పోటీ పడుతున్న 51 మంది ప్రతినిధులను ఓడించి మిస్ వరల్డ్ కిరీటాన్ని కూడా స్వంతం చేసుకున్నారు.
తొలి ఇండియన్ మిస్ వరల్డ్‌గా నిలిచిన ఆమెను అనేక రకాల ఆఫర్లు చుట్టుముట్టాయి. ముఖ్యంగా సినిమాల్లో నటింపజేయడానికి లాభదాయకమైన ఆఫర్లు విసిరారు. ఆకర్షణీయమైన ఆదాయం అంతకు మించి మరింత గొప్ప కెరీర్ కనిపిస్తున్నప్పటికీ, మోడలింగ్, నటన కాంట్రాక్టులను ఆమె నిస్సంకోచంగా తిరస్కరించారు. బదులుగా వైద్య విద్యపై దృష్టి పెట్టి గ్రాంట్ మెడికల్ కాలేజ్‌లో చేరి ఎం.బి.బి.ఎస్. డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత లండన్ లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లో చదువుకున్నారు. అదే సమయంలో గురుతుల్యులైన డేవిడ్ పావెల్‌ను 1971లో వివాహం చేసుకుని 1973లో ఐర్లాండ్‌లోని డబ్లిన్ కు మకాం మార్చారు, అక్కడ వైద్య వృత్తిలో స్థిరపడ్డారు.
ప్రస్తుతం ఫారియా తన భర్త, ఎండోక్రినాలజిస్ట్ డేవిడ్ పావెల్‌తో కలిసి ఐర్లాండ్‌లోని డబ్లిన్ లో నివసిస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. ఆ తర్వాత కూడా మన దేశంతో సహా పలు చోట్ల అందాల పోటీల్లో జడ్జిగా అతిధిగా పాల్లొన్న రీటా ఫరియా... ఎందరో అందగత్తెలకు మార్కులు వేశారు. అయితే అందాల పోటీలో గెలుపు అంటే అందలాలు ఎక్కడానికి పిలుపు కాదని నిరూపించిన రీటా మార్క్ మాత్రం చెరిగిపోనిదే... ఎప్పటికీ...