
‘మెట్ గాలా’లో పాల్గొన్న తొలి భారతీయ నటుడిగా షారుక్ ఖాన్
సెలబ్రిటీల ఫ్యాషన్ షో ‘మెట్ గాలా’(Met Gala 2025) వేడుక వైభవంగా ప్రారంభమైంది. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ వేదికగా ఈ ఫ్యాషన్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది ‘మెట్ గాలా’ డ్రెస్‌కోడ్ ‘టైలర్డ్ ఫర్ యు’ కాగా, ‘సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్‌స్టైల్’ను థీమ్‌గా నిర్ణయించారు నిర్వాహకులు. ఈ థీమ్‌కు తగ్గట్లుగా ఈ వేడుకలో నలుపు రంగు దుస్తుల్లో పాల్గొన్నారు ప్రముఖులు.
ఇక ఈ వేడుకలకు హాజరైన తొలి భారతీయ నటుడిగా షారుక్ ఖాన్( Shah Rukh Khan) చరిత్ర సృష్టించారు. సబ్యసాచి డిజైన్ చేసిన దుస్తుల్లో అల్ట్రా స్టైలిష్‌గా కనపడి, ఈ వేడుకలో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు షారుక్ ఖాన్. ‘‘ఈ ఏడాది మెట్ గాలాకి ఆహ్వానం అందగానే నా కుమారుడు ఆర్యన్, కుమార్తె సుహానా ఎంతగానో సంతోషించారు. ఈ వేడుకలో నేను పాల్గొంటే అది చరిత్ర అవుతుందని కూడా నాకు తెలియదు. నేను ఇప్పటివరకు రెడ్ కార్పెట్‌పై నడవలేదు. నాకు ఫ్యాషన్‌పై ఆసక్తి కూడా తక్కువ. దీంతో ఈ వేడుకకు రావడానికి నేను చాలా భయపడ్డాను. కాస్త బిడియంగా అనిపించింది. ఓ దశలో పారిపోవాలనిపించింది’’ అని పేర్కొన్నారు షారుక్ ఖాన్.
ఇంకా ఈ వేడుకలో నటి–నిర్మాత ప్రియాంకా చోప్రా, ఆమె భర్త–నటుడు నిక్ జోనస్, హీరోయిన్ కియారా అద్వానీ, సింగర్–నటుడు–నిర్మాత దిల్జీత్ సింగ్ తదితర ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఇక త్వరలో తల్లి కాబోతున్న కియారా అద్వానీ ఈ వేడుకలో ‘బేబీ బంప్’తో మెరిశారు.