
అభిమాన హీరో సినిమాను ఫలానా థియేటర్‌లో చూశాం అని చెప్పుకోవడం ఎప్పుడూ ఉండేదే. అయితే అభిమాన హీరో ధియేటర్‌లో ఫలానా హీరో సినిమా చూశాం అని చెప్పుకునే రోజులు శర వేగంగా వచ్చేస్తున్నాయి. సినిమా హీరోలు వరుసపెట్టి మల్టీఫ్లెక్స్ సహ యజమానులుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

తొలి క్లాప్ మోహన్‌లాల్‌దే...
నిజానికి ఈ తరహా ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది మళయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అని చెప్పొచ్చు. గత పాతికేళ్లకు పైగా ఆశీర్వాద్ సినిమాస్ పేరిట నిర్మాణ సంస్థ ను నిర్వహిస్తున్న ఆయన తాను సహ యజమానిగా కేరళలో ఆశీర్వాద్ సినీప్లెక్స్ పేరిట మల్టీప్లెక్స్ థియేటర్ కాంప్లెక్స్ నెలకొల్పారు.

కాన్సెప్ట్ ఆధారిత సినీ అనుభవం..
కాన్సెప్ట్–ఆధారిత సినిమా చూసే అనుభవం. అనే సరికొత్త శైలితో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఈ రంగంలోకి దూసుకొచ్చారు. ఆయన 2018లో తన పిల్లలు నైసా, యుగ్ పేరు మీద తన సొంత లేబుల్ ఎన్‌వై సినిమాస్ ను ప్రారంభించడం ద్వారా చిన్న పట్టణాలు నగరాల్లో సినిమా వ్యాప్తిని మెరుగుపరచాలని నిర్ణయించుకున్నాడు. రూ. 600 కోట్ల నుంచి రూ. 750 కోట్ల పెట్టుబడితో మల్టీఫ్లెక్స్‌లు ఏర్పాటు చేస్తున్నారు ఆయన గ్రూప్ తమ మొదటి మల్టీప్లెక్స్‌ను మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో రైల్వే నేపథ్య ఇంటీరియర్‌తో ప్రారంభించింది. అలాగే గురుగ్రామ్‌లోని ఎలాన్ ఎపిక్ మాల్‌లో ఒక విలాసవంతమైన మల్టీప్లెక్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో మాక్‌టెయిల్ బార్, ఎన్‌వై కేఫ్ అమోర్ లాంజ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి

‘మల్టీ’ బాటలో ముందున్న టాలీవుడ్
కోవిడ్ సమయంలో ఈ ట్రెండ్‌లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ ఒకరి తర్వాత ఒకరుగా హీరోలను జత చేసుకుంటూ శరవేగంగా ముందంజలో దూసుకుపోతోంది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 2021లో మల్టీఫ్లెక్స్ థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆయన ఆసియన్ సినిమాస్ తో కలిసి హైదరాబాద్ లో ఎఎంబి సినిమాస్ (ఆసియన్ గ్రూప్ – మహేష్ బాబు జాయింట్ వెంచర్) ను స్థాపించాడు. ఆయనతో పాటే నేను సైతం అంటూ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కూడా అదే ఏడాది థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆసియన్ విజయ్ దేవరకొండ (ఎవిడి) సినిమాస్ కు యజమానినని ఆయన సగర్వంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. మొదటి ఎవిడి సినిమా అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్, లో ప్రారంభమైంది.

మహేష్ బాబు విజయ్ దేవరకొండ తర్వాత ఆసియన్ సినిమాస్‌తో చేతులు కలిపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆయన కూడా అదే సంవత్సరంలో ఆసియన్ సినిమాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ’ఎఎఎ’ పేరుతో కొత్త మల్టీప్లెక్స్ నెలకొల్పాడు.

ఆసియన్ సినిమాస్ ఈ సారి మాస్ మహారాజ్‌ను ఎంచుకుంది. మాస్ జాతరకు చిరునామాగా పేరున్న హీరో రవితేజతో కలిసి హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో జాయింట్ వెంచర్ ఆర్ట్ సినిమాస్ పేరుతో నెలకొల్పింది. ఇది జులై 31న విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌తో ప్రారంభం కానుంది.

విస్తరణ బాటలోనూ సై..
మరోవైపు మహేష్ బాబు నమ్రతా శిరోద్కర్ యాజమాన్యంలోని కొండాపూర్‌లోని ఎఎంబి సినిమాస్ మరింతగా విస్తరిస్తోంది. ఈ మల్టీఫ్లెక్స్‌లో బార్కోహెచ్‌డిఆర్ ప్రొజెక్షన్ తో కూడిన కొత్త స్క్రీన్ వచ్చే ఆగస్టులో వార్ 2తో ప్రారంభం అవుతుంది, తద్వారా ఇది హైదరాబాద్ టెక్ కారిడార్‌లో సినీ అభిమానులకు ప్రధాన ఆకర్షణగా మారనుంది. మరోవైపు జనవరి 2026లో, కోకాపేటలోని అల్లు సినిమాస్ హైదరాబాద్‌లో మొట్టమొదటి డాల్బీ సినిమాను పరిచయం చేయనుంది.