
రాణి అహల్యా బాయి హోల్కర్(Ahilyabai Holkar) జీవితంపై సినిమా నిర్మించబోతున్నట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) అధికారికంగా ప్రకటించారు. చాలాకాలంగా ఆమె జీవితాన్ని నేటి తరం యువతకు పరిచయం చేయాలని తాము అనుకుంటున్నట్లు ఆయన అన్నారు. మరాఠ ధీశాలి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని ఆయన తెలిపారు.
రాణి అహల్యా బాయి 300వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలను చేపట్టామని సీఎం అన్నారు. గతంలోనే అహ్మద్‌నగర్ (Ahmednagar) జిల్లా పేరును అహల్యానగర్(Ahilya Nagar)గా మార్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అహల్యా బాయి మరాఠాలు పాలించిన మాల్వా సామ్రాజ్యపు హోల్కరు వంశానికి చెందిన రాణి అని సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. గతంలో ఆమె గురించి ఆయన ఇలా చెప్పారు. ' ప్రస్తుత అహ్మద్‌నగర్ జిల్లాలోని చౌంధీ (Chaundhi) అనే గ్రమంలో ఆమె జన్మించారు.
మహిళా అభ్యుదయవాదిగా దేశం కోసం ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నో దేవాలయాలతో పాటు ధర్మశాలలను ఆమె నిర్మించారు. ఆమె కారణం వల్లే నేడు కాశీలో మహాశివుడి గుడి ఉంంది.' అని ఒక వేదికపై దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. అందుకే ఆమె జీవితాన్ని సినిమాగా దేశ ప్రజలకు చూపించాలని అనుకున్నట్లు ఆయన అన్నారు. దేశంలోని అన్ని భాషల్లో అహల్యా బాయి జీవిత చరిత్ర విడుదల అవుతుందన్నారు.
రీసెంట్‌గా ఛావా సినిమాతో మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ గురించి దేశం మొత్తం తెలుసుకుంది. ఇప్పుడు అదే ప్రాంతం నుంచి రాణి అహల్యా బాయి గురించి సినిమా ప్రకటన రావడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రయుల్లో ఆసక్తి కలుగుతుంది. త్వరలో ప్రారంభం కానున్న ఈ మూవీ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా నిర్మించేందుకు ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వమే ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.