
టాలీవుడ్‌లో మొన్నటి వరకు పోటీ లేకుండా సినిమా రిలీజ్ అయ్యేది కాదు. ఒకేవారం పెద్ద సినిమాతో పాటు మూడు, నాలుగు చిన్న చిత్రాలు కూడా రీలీజ్ అయ్యేవి. కానీ సమ్మర్ నుంచి టాలీవుడ్‌లో పెద్దగా పోటీ లేకుండా సినిమాలు వస్తున్నాయి. ఇక గత నెలలో థగ్‌లైఫ్, కుబేర, కన్నప్ప లాంటి పెద్ద సినిమాలు వచ్చినా.. వాటి మధ్యలో కూడా వారం, వారం గ్యాప్ ఉంది. వీటితో పాటు రెండు, మూడు చిన్న సినిమాలు కూడా వచ్చాయి. కానీ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాయి. ఇక జులైలో టాలీవుడ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నెల మొత్తంలో ఒకే ఒక పెద్ద సినిమా రిలీజ్ కానుంది. మిగిలిన సినిమాలన్ని పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగబోతున్నాయి.
జులై మొదటి వారంలో తమ్ముడు చిత్రంలో నితిన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ హీరోయిన్లుగా నటించగా, లయ కీలక పాత్ర పోషించింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంపై మోస్తరు అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాల మేరకు అయినా సినిమా ఆడుతుందో లేదో జులై 4న తెలుస్తుంది. ఇక అదే రోజు సిద్ధార్థ్ నటించిన 3 బి.హెచ్.కె కూడా విడుదల కానుంది. తమ్ముడుతో పోలిస్తే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు అయితే లేవు. హిట్ టాక్ వస్తే తప్ప థియేటర్‌కి వెళ్లి చూసే పరిస్థితి అయితే ఈ సినిమాకు లేదు.
ఇక రెండో వారంలో అనుష్క షూటీ రిలీజ్ కావాల్సింది. కానీ అది వాయిదా పడింది. దీంతో ఈ వారంలో ఎలాంటి పోటీ లేకుండా సింగిల్‌గా బరిలోకి దిగుతున్నాడు సుహాస్. ఆయన హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామ జులై 11న రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. మరి సింగిల్‌గా వస్తున్న సుహాస్.. సూపర్ హిట్ కొడతాడో లేదో చూడాలి.
ఇక మూడో వారంలో మేఘాలు చెప్పిన ప్రేమ కథ(జులై 17) అనే చిన్న సినిమాతో పాటు జూనియర్(జులై 18 అనే కన్నడ-తెలుగు సినిమా కూడా ఇక్కడ విడుదల కాబోతుంది. గాలి జనార్థన్‌రెడ్డి కొడుకు కిరీటీ హీరోగా నటిస్తున్న జూనియర్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం, హీరోయిన్‌గా శ్రీలీల నటించడం, మరో కీలక పాత్రలో జెనీలియా కనిపించడంతో జూనియర్‌పై టాలీవుడ్‌లో మంచి హైప్ క్రియేట్ అయింది.
ఇక చివరి వారంలో (జూలై 24) హరిహరి వీరమల్లు రాబోతుంది. ఈ నెలలో వస్తున్న ఏకైక పెద్ద సినిమా ఇదే. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఎంఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామాలో నిధి అగర్వాల హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసిది.