Liger Telugu Movie Review And Rating - Sakshi
Sakshi News home page

Liger Movie Review: విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ ఎలా ఉందంటే...

Published Thu, Aug 25 2022 12:32 PM | Last Updated on Fri, Aug 26 2022 3:04 PM

Liger Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : లైగర్‌
నటీనటులు : విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, మైక్‌టైసన్‌, విషురెడ్డి, అలీ తదితరులు
నిర్మాణ సంస్థలు: ధర్మా ప్రొడెక్షన్స్‌,పూరీ కనెక్ట్స్‌
నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్‌ జోహార్, అపూర్వ మెహతా 
దర్శకత్వం:పూరి జగన్నాథ్
సంగీతం :సునీల్‌ కశ్యప్‌, విక్రమ్‌ మాంట్రోస్‌, తనీష్‌ భాగ్చి
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ
ఎడిటర్‌:జనైద్ సిద్దిఖీ
విడుదల తేది: ఆగస్ట్‌ 25, 2022

యావత్‌ సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన చిత్రం ‘లైగర్‌’. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత డాషింగ్‌ అండ్‌ డేరింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం.. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తొలిసారిగా బాక్సర్ గా వెండితెరపై కనిపించబోతుండడంతో ‘లైగర్‌’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు​ సినిమాపై పాజిటీవ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘లైగర్‌’పై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య గురువారం(ఆగస్ట్‌ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లైగర్‌’ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

‘లైగర్‌’ కథేంటంటే..
కరీంనగర్‌కు చెందిన బాలమణి(రమ్యకృష్ణ) తన కొడుకు లైగర్‌(విజయ్‌ దేవరకొండ)ని మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌(ఎమ్‌.ఎమ్‌.ఏ)లో నేషనల్‌ ఛాంపియన్‌గా చూడాలనుకుంటుంది. కొడుకుకి ట్రైనింగ్‌ ఇప్పించడం కోసం కరీంనగర్‌ నుంచి ముంబై వస్తుంది. అక్కడ ఓ టీస్టాల్‌ నడుపుతూ లైగర్‌కి మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పిస్తుంది. జీవితంలో ఏ అమ్మాయి జోలికి వెళ్లొదని, ప్రేమలో పడితే మన లక్ష్యాన్ని మర్చిపోతామని చెబుతుంటుంది. కానీ లైగర్‌ మాత్రం ముంబైకి చెందిన తాన్య(అనన్యపాండే)తో ప్రేమలో పడిపోతాడు. ఆమె కూడా లైగర్‌ని ప్రేమిస్తుంది కానీ అతనికి నత్తి ఉందని తెలిసి దూరమవుతుంది. లవ్‌ ఫెయిల్యూర్‌ అయిన లైగర్‌ చివరకు తన గోల్‌ని రీచ్‌ అయ్యాడా? లేదా? ఇంటర్నేషనల్‌ చాపియన్‌షిప్‌లో పాల్గొనడానికి లైగర్‌కు సహాయం చేసిందెవరు? తన గురువులా భావించే మైక్‌ టైసన్‌తో లైగర్‌ ఎందుకు తలపడాల్సి వచ్చింది? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే..
ఈ మధ్య కాలంలో ‘లైగర్‌’చిత్రానికి వచ్చినంత హైప్‌ ఏ చిత్రానికి రాలేదు. ఈ సారి పూరీ బలమైన కథలో వస్తున్నాడని అంతా భావించారు. తీరా సినిమా చూశాక.. పూరీ మళ్లీ పాత పాటే పాడరనిపిస్తుంది. ఓ సాధారణ ప్రేమ కథకి మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యాన్ని జోడించి ‘లైగర్‌’ని తెరకెక్కించాడు. ఇది ప్రేమ కథ అని ప్రచారం చేయడం కంటే.. ఎమ్‌ఎమ్‌ఏ నేపథ్యంలో వస్తున్న చిత్రమనే ఎక్కువగా ప్రచారం చేశారు. హీరోని కూడా అదే స్థాయిలో చూపించారు. కానీ కథలో మాత్రం ఆ సిరియస్‌నెస్‌ ఎక్కడా కనిపించలేదు.

ఎమ్‌.ఎమ్‌.ఏ సంబంధించిన సీన్స్‌ సాధారణంగా సాగుతాయే తప్ప ఉత్కంఠను రేకెత్తించవు. పోనీ ప్రేమ కథను అయినా ఆకట్టుకునేలా ఉందా అంటే అదీ అనిపించదు.తాన్య, లైగర్‌ ప్రేమలో పడిన తీరు కూడా ఆకట్టుకునేలా ఉండదు. యూత్‌ని అట్రాక్‌ చేయడం కోసం బోల్డ్‌నెస్‌ని అతికించడం కొంతమేర ఇబ్బందిగా అనిపిస్తుంది.  హీరోహీరోయిన్‌ ప్రేమలో పడిన సన్నివేశాలతో పాటు.. వాళ్లు విడిపోవడం, సెకండాఫ్‌లో బ్రేకప్‌కి చెప్పిన రీజన్‌ అన్ని సిల్లీగా అనిపిస్తాయి. అయితే తెరపై విజయ్‌ని చూపించిన తీరు మాత్రం అందరిని మెప్పిస్తుంది.

 

ఇక సెకండాఫ్‌ ఎక్కువగా మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఛాపింయన్‌ చుట్టే తిరుగుతుంది. ఇంటర్నేషనల్‌ ఛాపింయన్‌షిప్‌ కోసం అమెరికా వెళ్లాల్సిన లైగర్‌కు ప్రభుత్వం సహాయం చేయకపోవడం.. స్పాన్సర్‌షిప్‌ వ్యవహారం అంతా సాదాసీదాగా సాగుతుంది. అలాగే కొడుకు అమెరికాలో ఫైట్‌ చేస్తుంటే.. తల్లి ముంబైలోని ఇంట్లో కూర్చొని ప్రోత్సహించడం లాంటి సీన్‌తో పాటు మరికొన్ని సనివేశాలు వాస్తవికతకు దూరంగా ఉంటాయి. మైక్‌టైసన్‌, విజయ్‌ల మధ్య వచ్చే ఫైటింగ్‌ సీన్‌ అయితే మైక్‌టైసన్‌ అభిమానులు జీర్ణించుకోవడం కష్టమే. సినిమాలోని మెయిన్‌ పాయింట్‌కి ఆధారంగా ముగింపు ఉంటే బాగుండేది. హీరో నత్తితో పలికే డైలాగ్స్‌ కొన్ని చోట్ల నవ్విస్తాయి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌ కనెక్ట్‌ కాలేరు. పూరీ రాసుకున్న స్టోరీ లైన్‌, లైగర్‌ అనే క్యారెక్టర్‌ బాగున్నప్పటికీ.. ఆ క్యారెక్టర్‌కి తగ్గట్లుగా కథనాన్ని మాత్రం నడిపించలేకపోయాడు. 

ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాకు ప్రధాన బలం విజయ్‌ దేవరకొండ యాక్టింగ్‌. ప్రాణం పెట్టి నటించాడు. లైగర్‌ పాత్ర కోసం ఆయన పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. నత్తితో ఆయన పలికిన డైలాగ్స్‌ సహజంగా అనిపిస్తాయి. గత సినిమాలలో కంటే  ఇందులో విజయ్‌ నటన కొత్తగా ఉంటుంది. ఎనర్జిటిక్‌ ఫెర్ఫార్మెన్స్‌తో విజయ్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక లైగర్‌ తల్లి బాలామణిగా రమ్యకృష్ణ తనదైన నటనతో ఆకట్టుకుంది. తాన్యగా అనన్య పాండే మెప్పించింది. తెరపై అందంగా కనిపించింది. అయితే ఆ పాత్ర సినిమాపై అంతగా ప్రభావం చూపదు. పాటల్లో విజయ్‌, అనన్య రొమాన్స్‌ ఆకట్టుకుంటుంది.

లైగర్‌ కోచ్‌గా రోనిత్‌ రాయ్‌ మెప్పించాడు. విషురెడ్డి, అలీ, గెటప్‌ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికిస్తే.. సంగీతం పర్వాలేదు. పాటలు టాలీవుడ్‌ కంటే బాలీవుడ్‌ ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవుతారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. 


- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement