మహిళా పాత్రలను ఎక్కువగా పురుషుల కోణంలోనే రూపొందిస్తుంటారని ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ అభిప్రాయపడ్డారు. కెరీర్ ఆరంభంలో తాను కూడా ఇలాంటి పాత్రలకే పరిమితమయ్యానని వెల్లడించారు. తాజాగా కరీనా కపూర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘వాట్ ఉమెన్ వాంట్’ టాక్‌షోలో పాల్గొన్న ఆమె.. తన సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.
‘గుడ్ గర్ల్’ పాత్రలకే పరిమితం చేశారు!
కెరీర్ ప్రారంభంలో అందుబాటులో ఉన్న పరిమిత అవకాశాల్లోనే మంచి పాత్రలను ఎంచుకోవాల్సి వచ్చేదని కృతి సనన్ తెలిపారు. చాలా కాలం పాటు తనను కేవలం ‘మంచి అమ్మాయి’ తరహా పాత్రలకే పరిమితం చేశారని చెప్పారు. ‘మన సినిమాల్లో మహిళా పాత్రలను ఎక్కువగా పురుషుల కోణంలోనే రాస్తుంటారు. సంప్రదాయబద్ధంగా ఉండటం, సిగ్గుపడటం, ఎవరైనా ఇబ్బంది పెడితే హీరో వచ్చి కాపాడే వరకు ఎదురుచూడటం.. ఎప్పుడూ ఎలాంటి తప్పూ చేయకుండా ఉండటం వంటి లక్షణాలతోనే మహిళా పాత్రలను రూపొందిస్తుంటారు’ అని ఆమె పేర్కొన్నారు.
రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ తనకు ‘గుడ్ గర్ల్ సిండ్రోమ్’ ఉందని కృతి సరదాగా చెప్పారు. ఎప్పుడూ పద్ధతిగా ఉంటూ అందరినీ మెప్పించాలని ప్రయత్నించడం కొన్నిసార్లు విసుగు తెప్పిస్తుందని తెలిపారు. అందుకే తెరపై భిన్నమైన లక్షణాలున్న పాత్రలు చేయాలని, నటిగా తనను తాను కొత్తగా కనిపించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
నిర్మాతగానూ!
‘హీరోపంతి’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కృతి సనన్.. తన కెరీర్‌లో విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘బరేలీ కీ బర్ఫీ’, ‘దిల్‌వాలే’, ‘మిమీ’, ‘తేరీ బాతోం మే ఐసా ఉల్జా జియా’, ‘క్రూ’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మిమీ’ చిత్రంలో నటనకుగానూ ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. నటనతో పాటు సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగానూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించారు.
(ఇదీ చదవండి: అతన్ని మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకుంటా.. తప్పేంటి? : రష్మిక మందన్న)


