రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘రామాయణ’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యష్ రావణుడిగా కనిపించనున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే 137 నగరాలు, పట్టణాల్లో 4,339 షోలకు సంబంధించి 1.81 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వీటి ద్వారా రూ.10 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు సమాచారం.
భారీ విజువల్స్‌తో
మరోవైపు భారీ విజువల్స్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో టికెట్ ధరలు భారీగా ఉన్నాయి. ముంబైలో కొన్ని ఐమ్యాక్స్ థియేటర్లలో రిక్లెయినర్ సీటు ధర రూ.3,170 వరకు పలుకుతోంది. పీవీఆర్ ఐకాన్: ఫీనిక్స్ పల్లాడియంలో ఉదయం 7 గంటల షోకు రిక్లెయినర్ టికెట్ ధర రూ.1,850గా ఉండగా.. ఆ షో ఇప్పటికే హౌస్‌ఫుల్ అయినట్లు సమాచారం.
డిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఐమ్యాక్స్ 3డీ షోల టికెట్ ధరలు రూ.1,550 నుంచి రూ.2,400 వరకు ఉన్నాయని తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో కనిపిస్తున్న స్పందనతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి స్పష్టమవుతోంది.
(ఇదీ చదవండి: ‘ఫౌజీ’పై కొత్త చర్చ.. స్వాతంత్ర్యానికి ముందే ఫిల్టర్ సిగరెట్లా..?)


