గోల్డెన్‌ మెమొరీస్‌.. పాడిపంటలు @ 50 ఇయర్స్‌ | Krishna Hit Movie Padi Pantalu completed 50 years now | Sakshi
Sakshi News home page

Padi Pantalu: కృష్ణ కెరీర్‌కు కొత్త మలుపు... 'పాడిపంటలు'!

Jan 14 2026 2:38 PM | Updated on Jan 14 2026 3:02 PM

Krishna Hit Movie Padi Pantalu completed 50 years now

సంక్రాంతి పండుగ అంటే... అందరిలో సంతోషం నింపుతుంది. తెలుగునాట ప్రతి ఇంటా సంబరాలు తెస్తుంది. ధనుర్మాసంలో వేసే సంప్రదాయ, రంగుల ముగ్గులైన నెలవాక ముగ్గులతో, సాతాని జియ్యరుల కీర్తనలతో ఊరంతా సందడి చేస్తుంది. పల్లెపడుచుల సొబగులతో, పిండివంటల ఘుమఘుమలతో, కోడిపందాలతో, ఎడ్ల బండ్ల పోటీలతో నూతనోత్సాహాన్ని అందిస్తుంది. జీవితాలను చైతన్యవంతం చేస్తూ, క్రాంతిని అందించే సంక్రాంతి సరిగ్గా 50 ఏళ్ళ క్రితం... 1976  జనవరి 14న తెలుగు తెరకు ‘పాడిపంటలు’ అందించింది. పి. చంద్రశేఖర రెడ్డి (పి.సి. రెడ్డి) దర్శకత్వంలో, స్వీయ నిర్మాణంలో హీరో కృష్ణ, విజయనిర్మల నటించిన ఆ సూపర్‌ హిట్‌ చిత్రం అడుగడుగునా తెలుగుదనం కనబరిచింది. సహజ గ్రామీణ వాతావరణానికి ప్రతిబింబమై నిలిచింది. పల్లెపట్టుల్లోని సిరిసంపదలను కళ్ళకు కట్టినట్లు చూపి, అప్పటికి వరుస వైఫల్యాలతో ఉన్న హీరో కృష్ణ కెరీర్‌ను మళ్ళీ ఘన విజయాల బాట పట్టించింది. ఆ మరపురాని మ్యూజికల్‌ హిట్‌కు నేటితో (2026 జనవరి 14తో) 50 ఏళ్ళు.  
 

అది 1974 నాటి సంగతి. మే 1వ తేదీ. సొంత సంస్థ ‘పద్మాలయా’ బ్యానర్‌పై హీరో కృష్ణ చేసిన అపూర్వ సాహసం ‘అల్లూరి సీతారామరాజు’ రిలీజైంది. అఖండ విజయం సాధించింది. మన్యం వీరుడు, మన తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి పాత్రధారణతో కృష్ణ ఇమేజ్‌ అమాంతం ఆకాశాన్ని అంటింది. సాక్షాత్తూ ఆ అల్లూరినే చూసిన భావనతో జనం నీరాజనాలు పట్టారు. అపారమైన ఆ కీర్తి ప్రతిష్ఠలు ఆయనకు కొన్ని చిక్కులూ తెచ్చాయి. ఆ తరువాత నుంచి ఆయన ఏ సినిమా చేసినా, జనం ఆ పాత్రతో పోల్చుకొని పెదవి విరవడం మొదలుపెట్టారు.

    అంతే... ‘దేవదాసు’, ‘చీకటివెలుగులు’, ‘దేవుడు లాంటి మనిషి’... ఇలా వరుసగా ఫ్లాపులే. 1966లో ‘గూఢచారి 116’ రిలీజైనప్పటి నుంచి 1975 వరకు దాదాపు పదేళ్ళు రోజుకు మూడు షిఫ్టులు, ఏడాదికి పది – పన్నెండు సినిమాలు చేసిన ఆ నిర్మాతల హీరోకు ఒక్కసారిగా చిత్రమైన పరిస్థితి. ఇరవై నెలల కాలంలో 15కు పైగా ఫ్లాపులు. వెరసి, 1975 ద్వితీయార్ధంలో కృష్ణ కెరీర్‌ క్లిష్టదశలో ఉంది. అదిగో... అలాంటి సమయంలో స్వీయ నిర్మాణంలో హీరో కృష్ణ చేసిన మరో సాహసం... ‘పాడిపంటలు’.

ఫ్లాపుల్లో అక్కరకొచ్చిన ఆ పాత కథ

    నిజం చెప్పాలంటే, ‘పాడిపంటలు’ చిత్రకథ అంతకు ముందెప్పుడో దర్శకుడు పి.సి. రెడ్డి మదిలో రూపుదిద్దుకున్న కథ. కృష్ణ, వాణిశ్రీ జంటగా నందినీ ఫిలిమ్స్‌ పతాకంపై ఆయన డైరెక్ట్‌ చేసిన ‘ఇల్లు – ఇల్లాలు’ 1972 డిసెంబర్‌లో రిలీజైంది. అది పెద్ద హిట్‌. మళ్ళీ అదే సంస్థలో, అదే హీరో హీరోయిన్లతో మరో సినిమా చేసేందుకు అప్పట్లోనే ఆయన అనుకున్న స్టోరీ లైన్‌... ఈ ‘పాడిపంటలు’. అందరూ ఓకే అనుకున్నా... అనివార్య కారణాల వల్ల ఆ కథ తెరకెక్కలేదు. మూడేళ్ళ తర్వాత వరుస ఫ్లాపుల్లో ఉన్న కృష్ణ బృందంతో మాటల సందర్భంలో ఆ పాత కథ ప్రస్తావన వచ్చింది. కథాంశం విన్న కృష్ణ సోదరుడు జి. హనుమంతరావు ఈ గ్రామీణ నేపథ్యకథను వెంటనే తెరకెక్కిద్దామన్నారు. అదిగో... అలా ‘పాడిపంటలు’ కథ పట్టాలెక్కింది. 
    
ఆకట్టుకున్న గ్రామాభ్యుదయ కథాంశం

    పల్లెల్లో పెద్దయెత్తున జరుపుకొనే పెద్ద పండుగ సంక్రాంతి. ఆ పండుగ కానుకగా రిలీజైన ‘పాడిపంటలు’ చిత్ర కథాంశం కూడా గ్రామీణ, వ్యవసాయ కుటుంబ నేపథ్యమే. భారతదేశంలో అధికశాతం ప్రజలు గ్రామాల్లో నివసిస్తుండగా, ఆ గ్రామసీమలే దేశానికి జీవనాడి అన్నారు గాంధీజీ. మహాత్ముని మాటలను ఆదర్శంగా తీసుకొని, గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తీసుకొని తీసిన సినిమా ఇది. దర్శక – కథారచయిత పి.సి. రెడ్డి మన పల్లెల్లోని సహజ వాతావరణాన్నీ, మమతలు – మంచితనాన్నీ ప్రేక్షక జనరంజకంగా రంగుల్లో తెరపైకి తెచ్చారు.

    నలుగురూ కలసి పనిచేస్తే తమ రామాపురం గ్రామం పురోగమిస్తుందని నమ్మి, ఆ లక్ష్యసాధన కోసం పాటుపడే ఆదర్శ భావాలున్న యువ రైతు గోపాలం (కృష్ణ). కానీ, గ్రామంలోని కొందరు స్వార్థపరుల దుశ్చర్యల వల్ల అనేక కష్టాల పాలైన గోపాలం చివరకు నదిపై ప్రాజెక్ట్‌ నిర్మాణం సహా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడు. హీరోకు మేనమామ (గుమ్మడి) కూతురుగా విజయనిర్మల, నవనాగరిక యువతిగా లత, హీరో తల్లిగా అంజలీదేవి, తమ్ముడిగా చంద్రమోహన్, విధిని ప్రాణంగా భావించే ఇంజనీరుగా జగ్గయ్య, కాంతారావు, కృష్ణకుమారి తదితరులు నటించారు.

గురుభక్తిలో... దటీజ్‌ హీరో కృష్ణ!

    ‘పాడిపంటలు’ షూటింగ్‌ ఆరంభానికి సరిగ్గా వారం ముందే సెప్టెంబర్‌ 24న కృష్ణకు సినీ జీవితంలో శ్రేయోభిలాషి, మార్గదర్శకులైన నిర్మాత ‘విజయా’ చక్రపాణి దూరమయ్యారు. ఆ బాధ నుంచి తేరుకోక ముందే... సినిమా షూటింగ్‌ ఆంధ్రాలో అవుట్‌డోర్‌లో దూరంగా మొదలైన రోజే రాత్రే... కృష్ణను హీరోగా సినీ రంగానికి పరిచయం చేసిన డైరెక్టర్‌ ఆదుర్తి సుబ్బారావు మరణించారు. ఒకవైపు భారీ షూటింగ్‌... మరోవైపు తొలి అవకాశమిచ్చి, తీర్చిదిద్దిన గురుతుల్యుడైన ఆదుర్తి అంత్యక్రియలు! సమయానికి మద్రాసుకు వెళ్ళి నివాళులు అర్పించి రావాలంటే... దూరాభారం, సమయాభావం!!

    ఆ రోజుల్లో మద్రాసు నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు ఇంగ్లీషు దినపత్రిక ‘ది హిందూ’ కాపీలు ప్రత్యేకంగా వచ్చేవి. అప్పటికప్పుడు ‘హిందూ’ యాజమాన్యంతో మాట్లాడారు. ఆ రోజుకు షూటింగ్‌ మానుకొని, విజయవాడ నుంచి తిరిగెళ్ళే విమానంలో కృష్ణ, విజయనిర్మల ప్రత్యేకంగా మద్రాసు వెళ్ళారు. ఆదుర్తి భౌతికకాయాన్ని దర్శించి వచ్చి, మర్నాడు షూటింగ్‌లో పాల్గొన్నారు. అదీ హీరో కృష్ణకున్న కృతజ్ఞత, గురుభక్తి.

అలా... ఆ ముగ్గురూ మారారు!

    పి.సి. రెడ్డి అనుకున్న ఈ చిత్ర ఇతివృత్తానికి మొదట రచయితగా పనిచేయాల్సింది – ఆచార్య ఆత్రేయ. అందరూ కలసి పూర్తిస్థాయి స్క్రిప్టు వండసాగారు. దాదాపు నెల రోజుల దాకా స్క్రిప్టుపై పని చేసిన ఆత్రేయ ‘అసలు ఈ కథలో పాడి లేదు... పంట లేదు’ అని చీకాకు పడుతూ, పక్కకు తప్పుకున్నారు. దాంతో ఆయన స్థానంలో రచయిత మహారథి ప్రవేశించారు. ఆయన, దర్శకుడు, హీరో కృష్ణ సోదరుడు జి. హనుమంతరావు, తదితరులు కలసి మొత్తం స్క్రిప్టు సిద్ధం చేశారు. నవరసాల ఆ స్క్రిప్టుకు హనుమంతరావు స్క్రీన్‌ప్లే చేస్తే, మహారథి అద్భుతంగా మాటలు రాశారు. అలాగే, ముందుగా ఈ సినిమాకు ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి పనిచేసిన ఆదినారాయణరావుతో సంగీతం చేయిద్దామనుకున్నారు. అయితే, ఆయన అప్పటికే అక్కినేనితో నిర్మిస్తున్న సొంతచిత్రం ‘మహాకవి క్షేత్రయ్య’తో బిజీగా ఉన్నారు. మరోపక్క దర్శకుడు పి.సి. రెడ్డి సైతం తనకు అలవాటైన మ్యూజిక్‌ డైరెక్టర్‌ కె.వి. మహదేవన్‌ వైపు మొగ్గడంతో, ఆయనను సంగీతానికి ఎంచుకున్నారు.  

    ‘పద్మాలయా’ సంస్థకు సన్నిహితులైన వి.ఎస్‌.ఆర్‌. స్వామి ఎప్పటిలానే ‘పాడిపంటలు’కు కూడా ఛాయాగ్రాహణం అందించాలి. ఈస్ట్‌మన్‌కలర్‌లో తీసిన ఈ చిత్రం షూటింగ్‌ మానికొండలో మొదలయ్యాక ఓ వారం పాటు ఆయనే కెమెరా వర్క్‌ చేశారు. కానీ, ఆ తర్వాత ఏమైందో ఆయన స్థానంలో ఆయన సహాయకుడు పుష్పాల గోపీకృష్ణ కెమెరా బాధ్యతలు స్వీకరించి, సినిమా మొత్తం ఆయనే పూర్తి చేశారు. నిర్మాత జి. ఆదిశేషగిరిరావు మాటల్లో చెప్పాలంటే, ‘‘ఆ సమయంలోనే వి.ఎస్‌.ఆర్‌. స్వామికి బాపు – రమణల ‘భక్త కన్నప్ప’ చిత్రం ఉంది. మళ్ళీ డేట్ల ఇబ్బంది వస్తుందని, పరస్పర అంగీకారంతోనే ఆయన పక్కకు తప్పుకున్నారు. అప్పటికే ‘పద్మాలయా’ సంస్థలో ‘దేవుడు చేసిన మనుషులు’ (1973), ‘అల్లూరి సీతారామరాజు’ (1974) లాంటి చిత్రాలకు పనిచేసిన పుష్పాల గోపీకృష్ణ అలా ఈ ‘పాడిపంటలు’కు పూర్తిస్థాయి ఛాయాగ్రాహకుడయ్యారు.’’

    సినిమా క్లైమాక్స్‌లో విలన్లు లాంచీపై వెళుతూ ఉంటే, దానికి సమాంతరంగా రోడ్డు మీద ఎడ్లబండిపై వాళ్ళను తరుముతూ వెళతాడు. జలపాతాల నడుమ లాంచీలో ఫైటింగ్‌ జరుగుతుంది. మరోపక్క ఆనకట్టను బాంబులతో కూల్చివేసే ప్రయత్నాలు జరుగుతాయి. ఇలా ఉత్కంఠభరితంగా మూడు వేర్వేరు ఘట్టాలతో పతాక సన్నివేశాలు సాగుతాయి. గోపీకృష్ణ కెమెరా పనితనం, కోటగిరి గోపాలరావు (నేటి ప్రముఖ ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు అన్నయ్య) ఎడిటింగ్‌ ఆ దృశ్యాలను ఆసక్తిగా తెరపైకి తెచ్చాయి. ఇక, జలపాతం నడుమ లాంచీని కాపాడడం, హీరో బండిని ఎడ్లు వరద గోదావరిని దాటించే సన్నివేశాల లాంటి వాటిని మాత్రం మినియేచర్లతో మద్రాసు వాహినీ స్టూడియోలో ట్రిక్‌ ఫొటోగ్రఫీతో ప్రముఖ ఛాయాగ్రహణ మాంత్రికుడు రవికాంత్‌ నగాయిచ్‌ చిత్రీకరించారు. 
    
అంతా అవుట్‌డోర్‌లోనే...

    రైతు కుటుంబాల కథగా సాగిన ‘పాడిపంటలు’లో విశేషం ఏమిటంటే, ఆ సినిమా మొత్తం అవుట్‌డోర్‌లోనే చిత్రీకరణ జరుపుకొంది. ‘‘అంతకు ముందు ‘మూగమనసులు’ లాంటివి గోదావరి దగ్గర లంకల్లో ఆ పక్కన తీశారు కానీ గోదావరికి ఇటు కొవ్వూరు వైపు మొత్తం షూటింగ్‌ చేసిన మొదటి సినిమా మా ‘పాడిపంటలే’. కృష్ణాజిల్లాలోని విజయవాడ, గుడివాడ మధ్యలో ఉన్న మానికొండ గ్రామంలో 1975 అక్టోబర్‌ 1న షూటింగ్‌ మొదలుపెట్టాం. వీధులు, ఇళ్ళు వగైరా ఉన్న ప్రధాన సన్నివేశాలన్నీ మానికొండలో తీస్తే, రాజమండ్రి పరిసరాల్లో 15 రోజులు చిత్రీకరణ జరిపాం. ఈ సినిమా కోసం తూర్పు గోదావరి జిల్లా డొంకరాయి, చింతపల్లి, అలాగే ప్రసిద్ధమైన పట్టిసీమ గుడి, ధవళేశ్వరం ఆర్థర్‌ కాటన్‌ గెస్ట్‌హౌస్, కడియం గ్రామం, ఆత్రేయపురం ప్రాంతంలోని లొల్ల లాకులు, షూటింగులతో ‘సినిమా చెట్టు’గా ప్రసిద్ధమై ఇటీవల పడిపోయిన కుమారదేవం దగ్గరి భారీ వృక్షం దగ్గర, సీలేరు ప్రాజెక్టు... ఇలా అనేకచోట్ల చిత్రీకరణ జరిపాం. షూటింగ్‌ మొదలైనప్పటి నుంచి మూడే మూడు నెలల్లో ఇంత భారీ చిత్ర నిర్మాణం పూర్తి చేసి, డిసెంబర్‌ ఆఖరికే సెన్సార్‌ కూడా జరిపించేశాం. ముందు అనుకున్నట్టే సంక్రాంతి పండుగకు రిలీజ్‌ చేశాం’’ అని నిర్మాత జి. ఆదిశేషగిరిరావు ‘సాక్షి’కి వివరించారు.

‘బెన్‌హర్‌’ ప్రేరణతో... గుంటూరులో!

    సినిమా మొదట్లో వచ్చే ఎడ్ల బండ్ల పందాల దృశ్యాలను చివరలో గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియమ్‌లో భారీయెత్తున తీశారు. హీరో కృష్ణ, విలన్‌ ప్రభాకరరెడ్డి పాల్గొనే ఎడ్ల బండ్ల పోటీని భారీ జనసందోహం మధ్య ఎంతో వ్యయప్రయాసలతో ఉత్కంఠభరితంగా చిత్రీకరించారు. ప్రసిద్ధ హాలీవుడ్‌ చిత్రం ‘బెన్‌హర్‌’లోని రథాల పోటీ సన్నివేశం ఈ ఎడ్ల బండ్ల పోటీకి స్ఫూర్తి. విలన్‌ బండి చక్రాలకు అమర్చిన ఇనుపముళ్ళు కాస్తా హీరో ఎడ్ల బండి చక్రం ఆకులను కోసివేస్తాయి. దాంతో హీరో బండి చక్రం ఒకటి ఊడిపోతుంది. మిగిలిన ఒకే చక్రంతో ఎడ్ల బండిని పరుగులు తీయించి, హీరో గెలిచే ఆ ఘట్టాన్ని కెమెరామన్‌ పుష్పాల గోపీకృష్ణ ఉత్కంఠరేపేలా సెల్యులాయిడ్‌పైకి ఎక్కించారు. కృష్ణ సోదరుడు హనుమంతరావు ఆ చిత్రీకరణ సజావుగా సాగేలా కృషి చేశారు.

శ్రేయోభిలాషులు వద్దన్నా... సంక్రాంతి బరిలోనే!

    ‘పాడిపంటలు’ రిలీజ్‌ కూడా సంచలనమే. అప్పట్లో కృష్ణ చిత్రాలను ప్రసిద్ధ పంపిణీదారులు ‘తారకరామా ఫిలిమ్స్‌’ వారు వరుసగా రిలీజ్‌ చేస్తున్నారు. ‘పాడిపంటలు’ డిస్ట్రిబ్యూటర్లు కూడా వాళ్ళే. సంక్రాంతికి సినిమా రిలీజని కృష్ణ ముందే ప్రకటన రిలీజ్‌ చేసేశారు. సరిగ్గా ఆ ఏడాది అదే సమయానికి ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్‌బాబుల సినిమాలున్నాయి. అప్పటికే వరుస ఫ్లాపులతో ఉన్నందున ఎన్టీఆర్, శోభన్‌బాబు లాంటి వాళ్ళతో ఇప్పుడు సంక్రాంతి బరిలో పోటీ ఎందుకని శ్రేయోభిలాషులు వారించారు. ప్రసిద్ధ పంపిణీదారు – ‘నవయుగ ఫిలిమ్స్‌’ అధినేత చంద్రశేఖరరావు అయితే స్నేహంకొద్దీ స్వయంగా వచ్చి కలసి, కృష్ణకు చెప్పి చూశారు. అయితే, సినిమా మీద నమ్మకం, కెరీర్‌లో తాడో పేడో తేల్చుకోవాలన్న తెగింపుతో ఉన్న డేరింగ్‌ హీరో కృష్ణ వెనక్కి తగ్గలేదు. సంక్రాంతి బరికే సై అన్నారు.

    ఆదుర్తి మరణంతో అక్కినేని ‘మహాకవి క్షేత్రయ్య’ షూటింగ్‌ పూర్తి కాలేదు. ఆ సంక్రాంతికి అది జనం ముందుకు రాలేదు. కానీ, ఎన్టీఆర్‌ సొంత సినిమా ‘వేములవాడ భీమకవి’ (జనవరి 8న రిలీజ్‌), అలాగే ‘జీవనజ్యోతి’, ‘సోగ్గాడు’ లాంటి వరుస హిట్ల జోరు మీద ఉన్న శోభన్‌బాబు హీరోగా వి.బి. రాజేంద్రప్రసాద్‌ తీసిన ‘పిచ్చిమారాజు’ (జనవరి 9న రిలీజ్‌) రిలీజయ్యాయి. ‘పాడిపంటలు’ రిలీజ్‌ తేదీకి అవి వచ్చి వారమే అయింది. ఇక, ‘పాడిపంటలు’ రిలీజ్‌ రోజునే హీరో రామకృష్ణ సమర్పణలో జానపదబ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో జానపద చిత్రం ‘కోటలో పాగా’ కూడా వచ్చింది. అయితే, చివరకు కృష్ణ సాహసమే నెగ్గింది. మిగతా పెద్ద సినిమాలన్నీ ఫ్లాపయితే, అప్పటి దాకా వరుస ఫ్లాపుల్లో ఉన్న కృష్ణను విజయలక్ష్మి వరించింది.

    కథతో పాటు మహారథి మాటలు, ప్రముఖ గీత రచయితల పాటలు కూడా పెద్ద హిట్టవడంతో ‘పాడిపంటలు’ విపరీతంగా ప్రేక్షకుల్ని ఆకర్షించింది. పక్కనే ఇతర హీరోల చిత్రాలున్నా, బాక్సాఫీస్‌ వద్ద ‘పాడిపంటలు’ ఊపు తగ్గలేదు. ఆ సంక్రాంతికి కలెక్షన్ల మొనగాడుగా కీర్తి ఆయనకే దక్కింది. మరో విశేషమేమంటే, సరిగ్గా ‘పాడిపంటలు’ రిలీజ్‌ సమయానికి బాపు– రమణల ‘ముత్యాలముగ్గు’ (1975) సిల్వర్‌ జూబ్లీ పూర్తి చేసుకుంది. అంతకు ముందు ఏడాదైన 1975లో రిలీజై, ఆ ఏటి మేటి చిత్రంగా ప్రేక్షకుల గౌరవాదరణలు పొందిన ‘ముత్యాలముగ్గు’ ఆ సంక్రాంతి నాటికి 5 కేంద్రాల్లో 175 రోజులు పూర్తి చేసుకుంది.

జనం మెచ్చిన జంతువుల యాక్షన్‌!

    ‘పాడిపంటలు’కు మరో ఆకర్షణ ఆ సినిమాలో హీరో పోషించే ఎడ్ల జత. బలిష్ఠమైన ఆ ఎడ్లు సినిమాలో చేసే రకరకాల విన్యాసాలు, పాల్గొనే పందాలు, లాగే బరువులు నాటి పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఏ పని అయినా చేసేలా శిక్షణ పొందిన ఆ ఎడ్లను ప్రత్యేకంగా కొని, ఈ సినిమా కోసం వాడడం గమనార్హం. హీరో కృష్ణ తండ్రి గారైన వీరరాఘవయ్య చౌదరి ప్రత్యేకంగా ఒంగోలు దగ్గర పరుచూరు దగ్గర నుంచి ఈ ఎడ్ల జతను కొని, తీసుకొచ్చారు. విశేషం ఏమిటంటే, సినిమా అయిపోయినా సెంటిమెంటుగా వాటిని ఆప్యాయంగా తమ దగ్గరే స్వగ్రామంలో ఉంచుకొని సాకారు. పొలం పనులకు సైతం వాడేవారు కాదు. పశువులను సైతం వాటి జీవితాంతం అలా ప్రాణంగా చూసుకోవడం నాటి పల్లె సంస్కృతిలోని ప్రత్యేకత.

    ఇక, ‘పాడిపంటలు’లోనే హీరో హీరోయిన్ల వెంట హనుమాన్‌ అనే ఓ పొట్టేలు ఉంటుంది. అది చేసే విన్యాసాలను తెరపై చూసి, జనం ఆస్వాదించారు. అప్పటికే రకరకాల జంతువులతో సినిమాలు తీయడంలో దక్షిణాది చిత్రసీమలో ‘దేవర్‌ ఫిలిమ్స్‌’ అధినేత – నిర్మాత ‘శాండో’ ఎం.ఎం.ఎ. చిన్నప్ప దేవర్‌ ఫేమస్‌. ‘పాడిపంటలు’ చూసిన ఆయన ‘నేను రకరకాల జంతువులను పెట్టి, సినిమాలు తీశాను కానీ, పొట్టేలుతో కూడా సినిమా చేయొచ్చని ఈ సినిమా చూశాక తెలిసింది’ అన్నారట. అలా ఆ తర్వాత ‘పాడిపంటలు’ పొట్టేలు దృశ్యాల ప్రేరణతోనే శ్రీప్రియ, మురళీమోహన్‌లతో సూపర్‌ హిట్‌ ‘పొట్టేలు పున్నమ్మ’ (1978) నిర్మించారు.

విజయవాడ మిస్సయిన పద్మాలయా స్టూడియో!

    ‘పాడిపంటలు’ షూటింగ్‌ ఆరంభమయ్యే సమయానికే తెలుగు చిత్రసీమను హైదరాబాద్‌కు ఆకర్షించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. 1975 ఆగస్టులోనే టాప్‌ హీరోలు ఏయన్నార్, ఎన్టీఆర్‌లు హైదరాబాద్‌లో సొంత సినిమా స్టూడియోల నిర్మాణానికి శంకుస్థాపనలు కూడా చేసేశారు. జూబ్లీహిల్స్‌లో 15 ఎకరాల్లో ఏయన్నార్‌ అన్నపూర్ణా స్టూడియోస్, ముషీరాబాద్‌లో మూడున్నర ఎకరాల్లో ఎన్టీఆర్‌ రామకృష్ణా స్టూడియో... రెండింటి నిర్మాణం జోరుగా సాగుతోంది. అప్పటికే, ఆంధ్రాలో తానూ సొంతంగా స్టూడియో పెట్టాలనే బలమైన ఆలోచనతో కృష్ణ ముందుకు సాగుతున్నారు.

    ‘పాడిపంటలు’ నిర్మాణ సమయానికే ‘పద్మాలయా స్టూడియో’ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆయనకు విజయవాడ – గుంటూరు మధ్య చినకాకాని వద్ద స్థలం కేటాయించింది. ‘సినిమా విడుదల తర్వాత స్టూడియో నిర్మాణ కార్యక్రమాలు ఆరంభిస్తాం’ అని కృష్ణే స్వయంగా చెప్పారు. అప్పట్లో విజయవాడలోని హనుమాన్‌పేటలో అందుకోసం కార్యాలయం కూడా ఏర్పాటుచేశారు. చిత్రమేమంటే, సరిగ్గా ‘పాడిపంటలు’ రిలీజ్‌ రోజునే హైదరాబాద్‌లో అక్కినేని నాగేశ్వరరావు సొంత స్టూడియో ‘అన్నపూర్ణా స్టూడియోస్‌’ ప్రారంభోత్సవం జరిగింది. ఆ తర్వాత అనేక కారణాల వల్ల చివరకు పద్మాలయా స్టూడియో అక్కడ కాకుండా హైదరాబాద్‌లో స్థాపితమైంది.

కర్ణార్జునులుగా... కృష్ణ ‘కురుక్షేత్రం’ కల!

    ‘పాడిపంటలు’ షూటింగ్‌ సమయానికే కృష్ణ మనసులో భారీ పౌరాణిక చిత్రం ‘కురుక్షేత్రం’ కల ఉంది. ఆ మహాభారత కథలో కర్ణుడు, అర్జునుడు... రెండు పాత్రలూ తానే ధరించాలన్నది ఆయన ఆలోచన. అయితే, అలాంటి భారీ ఇతివృత్తాన్ని సినిమాగా తీయాలంటే నిర్మాణానికి చాలా వ్యయం అవుతుందనీ, పెట్టే పెట్టుబడికీ – వచ్చే వసూళ్ళకూ సరైన పొంతన కనిపించడం లేదనీ వెనకాడారు. ఆనాటి తెలుగు చిత్రాలకు ఉన్న పరిమితుల దృష్ట్యా... పరిస్థితులు ‘కురుక్షేత్రం’ లాంటి భారీ చిత్ర నిర్మాణానికి అనువైనవి కావనీ, పరిస్థితులు అనుకూలించినప్పుడు, వీలుంటే రష్యా లాంటి దేశాల సహ భాగస్వామ్యంతో ఆ చిత్రాన్ని నిర్మించాలని కృష్ణ భావించారు.

    అయితే, చాలామందికి తెలియనిదేమిటంటే... ‘పాడిపంటలు’ రిలీజైన కొన్నాళ్ళకే 1976 మొదట్లోనే ఎన్టీఆర్‌ మాత్రం తన ‘దానవీరశూర కర్ణ’ చిత్ర నిర్మాణం మొదలుపెట్టేశారు. సినారె రచించిన ‘జయీభవ... విజయీభవ...’ అన్న సుయోధనుడి స్వాగత గీతం రికార్డింగ్‌ కూడా అప్పట్లోనే చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు అటు ఎన్టీఆర్‌ ‘కర్ణ’, ఇటు కృష్ణ ‘కురుక్షేత్రం’ పోటాపోటీగా నిర్మాణం సాగడం, సరిగ్గా ఏడాది తర్వాత 1977 సంక్రాంతికి వాటి మధ్య కనివిని ఎరుగని బాక్సాఫీస్‌ యుద్ధం జరగడం మరో పెద్ద కథ!

ఎమ్జీఆర్‌ రీమేక్‌ చేయాలనుకున్నా...

    ‘పాడిపంటలు’ చిత్రం తెలుగులో సంచలన విజయం సాధించడంతో ఆ కథను ఇతర భాషల్లోకి రీమేక్‌ చేయాలనే ఆలోచన అప్పట్లో బలంగా కలిగింది. తమిళంలో అప్పటికే రాజకీయాల్లో చురుగ్గా ఉండి, డీఎంకె పార్టీ నుంచి బయటకొచ్చేసి, అన్నా డీఎంకె పేరిట కొత్త పార్టీ పెట్టి, రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు తమిళ అగ్రహీరో ఎం.జి. రామచంద్రన్‌. ఆయన ‘పాడిపంటలు’ తమిళంలో చేయాలని ముచ్చటపడ్డారు. అప్పటికే ఆయన ఊరూరా పార్టీ సభలు, సమావేశాలతో బిజీగా ఉన్నారు. అయినా సరే, ఓ రోజు రాత్రి వేళ మద్రాసులో ఆయన కోసం ‘పాడిపంటలు’ స్పెషల్‌ ప్రొజెక్షన్‌ ఏర్పాటు చేశారు.

    వేరే ఊళ్ళో సభలో ఉన్న ఎమ్జీఆర్‌ అది ముగించుకొని మద్రాసుకు రావడానికి రైలు మిస్సయింది. కారులో బయలుదేరారు. తీరా మద్రాసులో ప్రొజెక్షన్‌ థియేటర్‌ వద్దకు చేరేసరికి, అర్ధరాత్రి దాటేసింది. అలసిసొలసిన ఆయన ఇంకేం సినిమా చూస్తారని దర్శకుడు పి.సి. రెడ్డి తదితరులు అనుకుంటే, ఎమ్జీఆర్‌ మాత్రం ఆసక్తిగా ఆసాంతం సినిమా చూసి, సినిమా చాలా బాగుందని దర్శకుడిని అభినందించారు. హీరోగా తన ఆఖరు సినిమాగా, హీరోయిన్‌ లత జోడీగా, పి.సి. రెడ్డి దర్శకత్వంలోనే తమిళంలో ‘పాడిపంటలు’ చేద్దామన్నారు. ఆ రీమేక్‌ ప్రయత్నాలు జరుగుతుండగానే, 1977 ఎన్నికల్లో ఎమ్జీఆర్‌ ఘన విజయం సాధించి, తమిళనాడు సీఎం అయ్యారు. దాంతో, పూర్తిగా పట్టాలెక్కకుండానే ఆ తమిళ రీమేక్‌ ఆగిపోయింది. ఇక, తన కెరీర్‌కు కీలకమైన బ్రేక్‌ ఇచ్చిన ‘పాడిపంటలు’ చిత్రాన్ని పి.సి. రెడ్డి దర్శకత్వంలోనే హిందీలో జితేంద్ర హీరోగా రీమేక్‌ చేయాలని కృష్ణకు అప్పట్లో బలంగా కోరిక. కానీ, ఎందుకనో అదీ తీరనే లేదు.

మారుమోగిన మ్యూజికల్‌ హిట్‌!

    ‘పాడిపంటలు’ పాటలు అప్పట్లో జనంలో తెగ వినిపించాయి. ప్రసిద్ధ నాటక – సినీ రచయిత మోదుకూరి జాన్సన్‌ రాసిన ‘మన జన్మభూమి బంగారుభూమి... పాడిపంటలతో పసిడిరాశులతో... కళకళలాడే జననీ... మన జన్మభూమీ...’ పాట ఆల్‌టైమ్‌ హిట్‌. కె.వి. మహదేవన్‌ సంగీతం, అలాగే ‘రైతు లేనిదే రాజ్యంలేదని...’ రైతు గొప్పదనాన్నీ, రైతు రాజ్యం ఘనతనూ అవిస్మరణీయంగా చెప్పి, భరతమాతకు నీరాజనాలిచ్చే జాన్సన్‌ సాహిత్యం ఆ పాటను ఇవాళ్టికీ గొప్పగా నిలిపాయి. అలాగే, ఆనకట్ట నిర్మాణ సందర్భానికి తగ్గట్టు శ్రీశ్రీ రాసిన ‘పనిచేసే రైతన్నా పాటుపడే కూలన్నా... రండోయ్‌ రారండోయ్‌ మన కలలు పండే రోజొచ్చింది రారండోయ్‌...’ ఆకట్టుకుంది. కృష్ణ – విజయనిర్మలపై వచ్చే ‘ఇరుసు లేని బండి... ఈశ్వరుని బండి... చిరతలే లేనిది చిన్నోడి బండి...’ పాట (ఆత్రేయ రచన) పెద్ద హిట్‌. ‘ఆడుతూ పాడుతూ జోరుగా వసంతమాడాలి...’ అనే ఊరి సంబరాల పాట, ‘అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌... ముద్దపప్పోయ్‌ మూడట్లోయ్‌... ముద్దుగుమ్మ పట్నం బొమ్మకు వడ్డిద్దాం వేడట్లోయ్‌...’ లాంటివీ అలరించాయి. అలా పాటలన్నీ సూపర్‌హిట్‌.  
అక్కడ నుంచి ‘సూపర్‌స్టార్‌’ సెకండ్‌ ఇన్నింగ్స్‌!

    అప్పట్లో ‘పాడిపంటలు’ చిత్రం 33 కేంద్రాల్లో 50 థియేటర్లలో రిలీజైంది. సంక్రాంతి సీజన్‌ కావడం... పండగకు రిలీజ్‌ అవడం... సినిమాలో సెంటిమెంట్, వినోదం పుష్కలంగా ఉండడం... పైగా సినిమా మ్యూజికల్‌ హిట్‌ కావడం... ఇవన్నీ ‘పాడిపంటలు’కు కలిసొచ్చాయి. ముఖ్యంగా, గ్రామీణ నేపథ్యంలోని ఈ చిత్రాన్ని పట్నాలతో పాటు పల్లెల్లోనూ బాగా ఆదరించారు. మహిళా ప్రేక్షకులు పెద్దయెత్తున నీరాజనాలు పట్టారు. ‘‘అందుకే, ఆ సినిమాకు ఊహించని రెవెన్యూ వచ్చింది. ఫస్ట్‌ డే ఎంత షేర్‌ వచ్చిందో, అయిదో రోజు కూడా అంత షేర్‌ వచ్చింది. మా సంస్థ నిర్మించిన సినిమాల్లో అధిక వసూళ్ళు తెచ్చినవాటిలో ఒకటిగా నిలిచింది. రిపీట్‌ రన్స్‌లో కూడా బాగా ఆడి, మా సంస్థకు చిరస్మరణీయ చిత్రంగా మిగిలింది’’ అని ఆదిశేషగిరిరావు వివరించారు.

    అప్పట్లో ‘పాడిపంటలు’ 27 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఆ పైన 6 (విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, తిరుపతి) కేంద్రాల్లో డైరెక్ట్‌గా, ఒక కేంద్రం (కాకినాడ)లో షిఫ్టులతో... మొత్తం 7 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. తర్వాత హైదరాబాద్‌లో షిఫ్టింగులతో 175 రోజులు పూర్తి చేసుకొని, సిల్వర్‌ జూబ్లీ జరుపుకొంది.

    అంతే... ‘అల్లూరి సీతారామరాజు’ ఇమేజ్‌ క్రీనీడలో చిక్కుకొని, వరుస ఫ్లాపులు చవిచూస్తున్న కృష్ణను ఒక్కసారిగా పరాజయాల గ్రహణం వీడింది. ఆ నీడలో నుంచి బయటపడ్డ ఆయన కెరీర్‌ మళ్ళీ పట్టాలెక్కింది. అలా అక్కడ నుంచి కృష్ణ రెండో ఇన్నింగ్స్‌ మొదలైంది. ఆ తర్వాత అనేక ఏళ్ళ పాటు సిల్వర్‌స్క్రీన్‌పై ‘సూపర్‌స్టార్‌’ కృష్ణ మ్యాజిక్‌ కొనసాగింది. అదీ ‘పాడిపంటలు’ ఘనత!

రచన – రెంటాల జయదేవ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement