లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "జయహో రామానుజ". ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీలో సుమన్, ప్రవళ్లిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 25న "జయహో రామానుజ" సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో యాదగిరిగుట్ట బోర్డ్ మెంబర్ డా లక్ష్మీ నారాయణ, ఓబీసీ కన్వీనర్ మల్లేశ్, అన్నపూర్ణ, ప్రొఫెసర్ కిరణ్, శ్రీనివాస్, నిర్మాత మోహన్ గౌడ్, నటుడు రాంకీ, సత్యనారాయణ, వెంకట్ పాల్గొన్నారు.
నటి ప్రవళ్లిక మాట్లాడుతూ.. " ఈ సినిమా నిర్మించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమాలో నిర్మాణ బాధ్యతల వహిస్తూనే పాటు కృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి పాత్రల్లో నటించా. ఈ చిత్రంతో సమ సమాజం కోసం పాటుపడిన రామానుజాచార్యుల వారి గురించి ఈ తరం వారికి మరింతగా తెలియజేసే ప్రయత్నం చేశాం. ఈ సినిమా జర్నీ నాకు ఎన్నో విషయాలు నేర్పింది. అదంతా నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. మీరంతా తప్పకుండా ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
దర్శకుడు లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ..' కులం లేదు.. మతం లేదు.. మనుషులంతా ఒక్కటే, సమానమే అని చెప్పిన గొప్ప మహనీయుడు రామానుజాచార్యులు. ఈ సినిమా రూపొందిస్తున్న సమయంలో ఎన్నో అద్భుతాలు నా జీవితంలో జరిగాయి. టీటీడీకి 20 లక్షల రూపాయలు విరాళం ఇవ్వగలిగా. అంటే అది రామానుజాచార్యుల వారి మహిమే. అప్పట్లో బ్రాహ్మణులకు మాత్రమే దేవాలయాలకు ప్రవేశం ఉండేది. అలాంటి టైమ్‌లో ఒక ఆధ్యాత్మిక విప్లవం తీసుకొచ్చారు రామానుజాచార్యులు. మనుషులంతా ఒక్కటే కదా అలాంటప్పుడు మిగతా వారికి ఆలయ ప్రవేశం ఎందుకు లేదు అని ప్రశ్నించాడు. అందరిలో చైతన్యం తీసుకొచ్చాడు. అందరికీ ఓం నమో నారాయణ మంత్రాన్ని నేర్పించి, ఇక నుంచీ ప్రతి ఒక్కరు బ్రాహ్మణులే వైష్ణవులే అని చాటాడు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరుతున్నా' అని అన్నారు.


