
టీవీలో ‘కుంకుమ‘ పెట్టుకొని ప్రారంభించి, నేడు సిల్వర్ స్క్రీన్ పై ‘సూపర్’గా మెరుస్తోంది. బ్యూటీకి బ్రెయిన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఆమెను చూస్తే చాలు, ఎమోషన్ , ఎలిగెన్స్, ఎక్స్‌ప్రెషన్– అన్నింటికీ చిరునామా! మారిన మృణాల్ చెప్పిన ముచ్చట్లు!
మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
నటి కావాలనేది మృణాల్ చిన్నప్పటి కోరిక. కానీ సినిమా రంగంపై అపోహల వల్ల ఆమె తల్లిదండ్రులు మొదట అందుకు అంగీకరించలేదు. ఒకరోజు ఆమె తండ్రికి ‘త్రీ ఇడియట్స్’ సినిమాను చూపించి, నటి అయితే ఇలాంటి మంచి సినిమాల్లో నటించే అవకాశం ఉంటుందని నచ్చజెప్పింది.
అందుకే ప్రతి సినిమా చేసేముందు, తన తల్లిదండ్రులు గర్వపడేలా పాత్ర ఉందా లేదా అని చూసుకుని గ్రీన్ సిగ్నల్ ఇస్తానని మృణాల్ చెబుతుంది.
మృణాల్ టీవీ సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించింది. ‘కుంకుమ రేఖ’ సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. కాని, ఆడిషన్లకు వెళ్లేటప్పుడు టీవీ నటి అనే ట్యాగ్‌తో చాలామంది చులకనగా చూసేవారు. కొన్నిసార్లు డిప్రెషన్ను తట్టుకోలేక, లోకల్ ట్రైన్ నుంచి దూకేయాలనిపించినా, తల్లిదండ్రులు గుర్తొచ్చి ఆగిపోయేదట!
హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ అంటే మృణాల్‌కు విపరీతమైన అభిమానం. హృతిక్‌తో ‘సూపర్ 30’, షాహిద్‌తో ‘జెర్సీ’ సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పుడు ఆనందంతో పొంగిపోయింది.
తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు మొదటి పరిచయం దర్శకుడు నాగ్ అశ్విన్ ద్వారా. అప్పుడే తెలుగు పరిశ్రమపై ఒక స్పష్టమైన అభిప్రాయం ఏర్పడిందట! హను రాఘవపూడి ‘సీతారామం’ కథ చెప్పగానే, ఆ కథలో హీరోయిన్ పాత్రతో ప్రేమలో పడిపోయిందట. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’, ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాల్లో నటించింది. ఆమె పెర్ఫార్మెన్స్కి మంచి పేరు వచ్చింది.
తన టీవీ కాలంలో పని చేసిన కొంతమంది నటులు, రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్లు, హీరోలతో మృణాల్ పేరు కలిపి డేటింగ్ రూమర్లు వచ్చాయి. వాటిపై ఆమె స్పందిస్తూ, ‘నేను ఎవరితో రిలేషన్లో ఉన్నాను, ఎవరితో బ్రేకప్– ఇవన్నీ పబ్లిక్‌కి చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకున్నప్పుడు ఎలాగైనా చెబుతాను’ అని చెప్పింది.
హీరోయిన్గా సినిమాల్లో బిజీగా ఉన్నా, వెబ్ సిరీస్‌లకు కూడా ఆసక్తి చూపుతోంది. ఇందుకు ప్రధాన కారణాలుగా తక్కువ పని రోజులు, విభిన్నమైన పాత్రలు, ఎక్కువ రీచ్ వస్తుందని చెప్పింది.
మాతృభాష మరాఠీ అయినా, తెలుగు భాష కూడా దగ్గరగా ఉందని, కొద్దిగా బ్రోకెన్ తెలుగులో మాట్లాడగలనని మృణాల్ చెప్పింది.
తన కాలేజ్ ఫ్రెండ్స్ క్షేమ, అనుశ్రీ జైన్ ఆమెకు బెస్ట్ ఫ్రెండ్స్. షూటింగ్‌లతో బిజీగా ఉన్నా వాళ్లతో తరచు ట్లాడుతుంటుందట!
టీవీ సీరియల్స్‌లో పనిచేస్తున్న రోజుల్లో తరచు అపార్ట్‌మెంట్లు మార్చాల్సి వచ్చేది. ఒక్కో సీరియల్ నెలల తరబడి, ఏళ్ల తరబడి సాగేది. షూటింగ్ లొకేషన్కి దగ్గరగా, తక్కువ రెంటులో ఉండే ఫ్లాట్లను ఎంచుకునేది. ఆ సమయంలో వంట పని యాక్టింగ్ కంటే కష్టంగా అనిపించేదట!
తెలుగు షూటింగ్‌లకి వచ్చినప్పుడు ఇడ్లీ, వడ ఆమె ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్. టిఫిన్ కంటే చట్నీలు తినడానికి ఇష్టపడుతుంది మృణాల్.
మృణాల్‌కు చెందిన డేట్స్, రెమ్యునరేషన్ వంటి విషయాలు ఆమె సోదరి లోచన్ చూసుకుంటుంది. షూటింగ్‌లలో బిజీగా ఉన్నప్పుడు గంటన్నర, రెండు గంటలకంటే ఎక్కువ నిద్రపోయే అవకాశం ఉండదట. ఎక్కువగా ఫ్లైట్ జర్నీల్లోనే నిద్రపోతుంటుందట మృణాల్.