టాలీవుడ్‌ ప్రథమార్ధం రిపోర్ట్‌.. మొత్తం ఎన్ని కోట్లు రాబట్టింది | Indian Movies Collection In First Six Months Of 2025 | Sakshi
Sakshi News home page

చిత్ర పరిశ్రమ ప్రథమార్ధం రిపోర్ట్‌.. మొత్తం ఎన్ని కోట్లు రాబట్టింది

Jul 6 2025 10:12 AM | Updated on Jul 6 2025 12:44 PM

Indian Movies Collection In First Six Months Of 2025

తెలుగు చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్‌ సక్సెస్‌ రేటు బాగా తగ్గిపోయింది. 2025 ఏడాది మొదలై చూస్తుండగానే ఆర్నెళ్లు గడిచాయి. అయినా ఇప్పటికీ టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన సినిమా ఏదీ తెరపై కనిపించలేదు. గతేడాది చివరిలో పుష్ప2  ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతే ఈ ఏడాది మాత్రం అలాంటి మెరుపులు లేవు. అయితే, ఈ  ఆర్నెళ్లలో మన భారతీయ సినిమాలు 856 విడుదలయ్యాయి. బాక్సాఫీస్‌ వద్ద రూ.5,360 కోట్లకు పైగా వసూళ్లతో  ఈ మూవీస్‌ జోరు చూపించాయి.  గతేడాది మొదటి ఆరు నెలల్లో రూ.5,260కోట్లకు పైగా వసూళ్లు రావడం జరిగింది.

అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లు సాధించిన చిత్రాలు ఉన్నా తెలుగు సినిమాలు మాత్రం పెద్దగా లేవు. కొన్ని భారీ బడ్జెట్‌ సినిమాలు నిరుత్సాహపరిచినా జాతీయ మీడియా సర్వేల ప్రకారం ఇండియన్‌ బాక్సాఫీస్‌ ప్రథమార్ధం గతేడాదితో పోలిస్తే తటస్థంగానే ఉందని చెప్పాలి. కానీ, పెద్దగా పుంజుకోలేదనే భావన కూడా ఉంది. విక్కీ కౌషల్ నటించిన 'ఛావా' రూ. 800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి పరిశ్రమకు ఊపరిపోసింది. అయితే, తెలుగులో మాత్రం సంక్రాంతికి వస్తున్నాం రూ.300 కోట్లు సాధించి తర్వాతి స్థానంలో ఉంది. మొదటి ఆరు నెలల్లో తెలుగు పరిశ్రమ నుంచి రూ. 1200 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ప్రారంభంలోనే విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ. 300 కోట్ల కలెక్షన్లతో సత్తా చాటింది. అయితే, రూ. 450 బడ్జెట్‌తో తెరకెక్కిన పాన్‌ ఇండియా సినిమా 'గేమ్‌ ఛేంజర్‌' డిజాస్టర్‌గా మిగలడంతో టాలీవుడ్‌కు తీరని నష్టాలను తెచ్చింది. వెయ్యి కోట్ల కలెక్షన్స్‌ టార్గెట్‌గా రంగంలోకి దిగిన ఈ మూవీ కేవలం రూ. 150 కోట్ల లోపే పరిమతం కావడం జరిగింది. అయితే, ఈ ఏడాదిలో దక్షిణాది సినిమాల కలెక్షన్ల వాటా మాత్రం బాలీవుడ్‌ను దాటేశాయి. గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ (రూ. 250 కోట్లు), తుడరుమ్‌ (రూ. 250 కోట్లు), లూసిఫర్‌ 2 (రూ. 270 కోట్లు), డ్రాగన్‌ (రూ. 160 కోట్లు) వంటి సినిమాలతో పాటు వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన చిత్రాలు భారీగానే ఉన్నాయి. 

ఒక రకంగా ఇండియన్‌ సినిమా మార్కెట్‌లో దక్షిణాది పరిశ్రమల వాటా కాస్త ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఈ ఏడాది సమ్మర్‌లో ఐపీఎల్‌ ప్రభావం కూడా సినిమాలపై ఎక్కువగానే చూపింది. వేసవిలో చాలామటకు విడుదలైన చిన్న సినిమాలు మెప్పించాయి. కానీ, క్రికెట్‌ ప్రభావం వల్ల ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. 

గతేడాది ప్రథమ ఆరు నెలల్లో చిత్ర పరిశ్రమను 'కల్కి' సినిమా కాపాడింది. రూ.1000కోట్ల మైలురాయిని దాటేసి  బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటింది. మొదటి ఆరు నెలల కలెక్షన్స్‌ వాటాలో ఎక్కువ కల్కి సినిమాదే ఉండటం విశేషం. అదే ఏడాది చివర్లో పుష్ప2 రూ. 1800 కోట్లకు పైగా సాధించి తెలుగు పరిశ్రమ ఉణికిని కాపాడింది. అయితే, 2025 మొదటి ఆరు నెలలు మాత్రం తెలుగు పరిశ్రమ కాస్త నిరాశనే మిగిల్చింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

అయితే, బాలీవుడ్‌ సినిమా ఛావా మాత్రమే రూ. 800 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. అలా 2025 మొదటి ఆరు నెలలు కాస్త నిరాశగా ఉన్నప్పటికీ తర్వాత ఆరు నెలల్లో భారీ సినిమాలే ఉన్నాయి. ప్రభాస్‌ (రాజాసాబ్‌), ఎన్టీఆర్‌ (వార్‌2),  కూలీ, రామాయణ, కాంతార2 వంటి భారీ సినిమాలు ఉన్నాయి.

వెంటాడిన పైరసీ
సినిమా పైరసీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు భారతీయ పరిశ్రమ కూడా భారీగానే దెబ్బతింది. గత ఏడాదిలో కేవలం టాలీవుడ్‌లోనే  పైరసీ వల్ల రూ.3,700 కోట్ల నష్టం వాటిల్లిందని తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తాజాగా వెల్లడించింది. 2025 మొదట ఆరు నెలల్లో కూడా సుమారు రూ. 2 వేల కోట్లకు పైగా నష్టపోయినట్లు తెలుగు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న మాట. ఒక్క తెలుగు సినీ పరిశ్రమకే ఈ స్థాయిలో నష్టం వాటిల్లితే.. మరి దేశవ్యాప్తంగా ఇతర భాషల చిత్రాల సంగతేంటి..?  దానిని ఊహించడం చాలా కష్టం. 

సల్మాన్‌ ఖాన్‌ నటించిన సికందర్‌ చిత్రం లీక్‌ కావడంతో నిర్మాత రూ.91 కోట్ల నష్టాన్ని చవిచూశారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఆపై గేమ్‌ ఛేంజర్‌ మూవీ లీక్‌ కావడంతో రూ. 100 కోట్లకు పైగా నష్టం వచ్చిందని సమాచారం. మొన్నటికి మొన్న కన్నప్ప పరిస్థితి కూడా అంతే.. ఇలా చెప్పుకుంటూ పోతే పైరసీకి గురైన సినిమాల జాబితా పెద్దదే. అలా పరిశ్రమకు కూడా తీరని నష్టాలను పైరసీ తెచ్చిపెడుతంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement