
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan), టాలీవుడ్ యంగ్ టైగర్, స్టార్ హీరో ఎన్టీఆర్(Jr NTR) జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2‘(War 2) విడుదల కాకముందే సంచలనాలు నమోదు చేయడం మొదలైంది. హృతిక్, ఎన్టీయార్ ల అనూహ్య కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ మొదలైన నాటి నుంచే సంచలనంగా మారింది.
ఈ చిత్రం ద్వారా హృతిక్ రోషన్ మళ్లీ తన స్పై క్యారెక్టర్ ’కబీర్’గానే స్క్రీన్ మీదకి రానుండగా, మొదటి సారిగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనున్నాడని తెలియడం మరింత ఆసక్తిని పెంచింది. ఉత్తరాది, దక్షిణాదికి చెందిన ఇద్దరు అగ్రహీరోలు పరస్పరం తెరపై తలపడడం గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కియారా అడ్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగానూ బాలీవుడ్, టాలీవుడ్ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ‘వార్ 2‘ పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతానికి దక్షిణాది వ్యాప్తంగా ఈ సినిమా హైప్‌కి ప్రధాన కారణం జూ.ఎన్టీఆర్ కి ఇటీవలి కాలంలో అమాంతం పెరిగిన క్రేజ్ అనేది నిస్సందేహం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్టీఆర్ హవా ఇటీవల రెట్టింపైంది. ఆర్‌ఆర్‌ఆర్, దేవర...ఇలా వరుసగా బాక్సాఫీస్ దగ్గర వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండడమే సినిమా రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాతలు ఎగబడడానికి కారణంగా చెప్పొచ్చు.
ఈ నేపధ్యంలో విడుదలకి ముందే ప్రాంతీయ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముడైపోవడం ఓ రికార్డ్‌గా చెప్పాలి. తద్వారా ఈ సినిమా భారత మూవీ మార్కెట్‌లో ఓ కొత్త ట్రెండ్‌కి కొబ్బరికాయ కొట్టినట్టయింది. భాషా అంతరాలను దాటి స్టార్ హిరోల క్రేజ్, మల్టీ లాంగ్వేజ్ సినిమాలకి పెరిగిన ఆదరణ కారణంగా ఇటువంటి డీల్స్ ముందుగానే ఖరారవడం ఇక షురూ కావచ్చు. ఈ సినిమా ప్రాంతీయ హక్కుల కోసం ఎదురైన గట్టి పోటీని తట్టుకుని చివరికి ప్రముఖ నిర్మాతలు నాగా వంశీ, సునీల్ నారంగ్ ఈ లాభదాయకమైన డీల్‌ను చేజిక్కించుకున్నారు.
విడుదలకి మూడేళ్లు ముందే ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ హక్కులు రూ. 85–100 కోట్ల మధ్య ధరల్లో అమ్ముడైపోయాయని వార్తలు వస్తున్నాయి. వీటన్నింటి నేపధ్యంలో ఆగస్టు 14, 2025న విడుదల కానున్న ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.