‘ప్యాసా’గా గురుదత్‌ మళ్లీ మన ముందుకు..

Guru Dutt Biopic Underway - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా త్రిపాత్రాభినయంతో బాలీవుడ్‌పై చెరగని ముద్రవేసి చిరు ప్రాయంలోనే (39 ఏళ్లు) నిజ జీవిత చిత్రం నుంచి తెరమరుగైన గురు దత్‌ను ఇప్పటికీ గుర్తు చేసుకునే వారు ఉంటారంటే ఏం ఆశ్చర్యం కలుగదు. అలాంటి కోవకు చెందిన వారే అభ్యుదయ చిత్ర దర్శకులు భావనా తల్వార్‌. ఆమె గురు దత్‌ను గుర్తు చేసుకోవడమే కాకుండా నేటి తరం ప్రేక్షకులకు ఆయనను పరిచయడంతోపాటు నాటి తరం ప్రేక్షకులకు సినీ కళా తపస్సీ గురు దత్, తన సినిమా జీవితంతో ముడివడిన నిజ జీవితంలో ఎదుర్కొన్న ఒడి దుడుకులను, కష్ట నష్టాలను తెలియజేయడం కోసం ఆయన ‘బయోపిక్‌’తో మనముందుకు వస్తున్నారు. ‘ధర్మ్‌ (2007)’ సినిమాతో బాలీవుడ్‌లోకి దర్శకురాలిగా రంగ  ప్రవేశం చేసిన భావనా తల్వార్, గురు దత్‌ బయోపిక్‌ నిర్మాణం కోసం స్క్రిప్ట్‌ను పూర్తి చేశారు. (గురుదత్‌ బయోపిక్‌)

దానికి 1957లో విడుదలైన గురుదత్‌ మాస్టర్‌ పీస్‌ ‘ప్యాసా’ పేరే పెట్టారు. అంతకుముందు ఆయన ఆర్‌పార్, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55 లాంటి ఆరు చిత్రాలను నిర్మించినప్పటికీ ‘ప్యాసా (దాహార్తి)’ సినిమాతో ఆయన పేరు బాలీవుడ్‌ చరిత్రలో దిగంతాలను తాకింది. ఆకట్టుకునే అందమైన లొకేషన్లు, హద్యమైన సన్నివేశాలు. కథానుగత సందర్భాలు, సందోర్భోచిత డైలాగులు, వీనుల విందైన పాటలు...అన్ని రకాలుగా ఆ సినిమా ప్రేక్షకుల మనసులను దోచుకుంది. గురు దత్తే ‘ప్యాసా’ చిత్రం మొత్తాన్ని భుజాన మోసుకొని తీసినట్లు కనిపిస్తుంది కనుక గురు దత్‌ బయోపిక్‌ ‘గురు దత్స్‌ ప్యాసా’ అని నామకరణం చేస్తేనే బాగుంటుందేమో! 

గురుదత్‌పై తాను తీస్తున్న సినిమా 2021లో సెట్స్‌ పైకి వెళుతుందని, గురుదత్‌గా, ఆయన బార్య గాయని గీతాదత్‌గా నటించేందుకు ఎవరిని ఎంపిక చేశారో ఇప్పడే వెళ్లడించేందుకు భావనా తల్వార్‌ నిరాకరించారు. చలనచిత్ర రంగానికి గురుదత్‌ను పరిచేయడంతోపాటు ఆయన సినీ విశ్వంలో తనదైన పాత్రను పోషించిన వహిదా రెహమాన్‌ పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తున్నారనే ప్రశ్నకు కూడా ఆమె వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. వాస్తవానికి తాను గురుదత్, గీతాదత్‌ల ఏకైక సంతానమైన నీనా అనుమతి తీసుకోవాల్సి ఉందని తల్వార్‌ తెలిపారు. గురుదత్‌ బయోపిక్‌ను తీసేందుకు గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయి. ‘ఇన్‌ సర్చ్‌ ఆఫ్‌ గురుదత్‌’ పేరిట 1989లో డాక్యుమెంటరీ తీయడమే కాకుండా 1996లో ‘ది డిఫినిటివ్‌ బయోగ్రఫీ గురుదత్‌ : ఏ లైఫ్‌ ఇన్‌ సినిమా’ పేరిట పుస్తకం రాసిన నస్రీన్‌ మున్నీ కబీర్‌ ప్రయత్నించారు.

పదేళ్ల క్రితమే తాను స్క్రిప్ట్‌ సిద్ధం చేసుకొని రాకేశ్‌ మెహ్రాతోని చర్చించానని, సంజయ్‌ లీలా బన్సాలీ కూడా ఉత్సాహం చూపారని కబీర్‌ తెలిపారు. గురుదత్‌లా మెప్పించే నటుడు దొరకడం కష్టం అవడమే కాకుండా ఆయనతో పరిచయమున్న నిజమైన పాత్రలను ఎలా పరిచయం చేయాలో, అందుకు వారు అనుమతిస్తారనే నమ్మకం లేకపోవడం తదితర కారణాల వల్ల ఆయన బయోపిక్‌ను తీయడాన్ని పక్కన పడేయాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. 2008లో యూటీవీ మూవీస్‌ కోసం గురుదత్‌ బయోపిక్‌ను తీసేందుకు శివేంద్ర సింగ్‌ దుంగార్పూర్‌ ప్రయత్నించారు. ఆయన అందుకు కుటుంబ సభ్యుల అనుమతి కూడా తీసుకున్నారు. అనురాగ్‌ కాశ్యప్‌ నుంచి స్క్రిప్టు సహకారం తీసుకున్నారు. గురుదత్‌గా ఆయన ఆమీర్‌ ఖాన్‌ను తీసుకోవాలనుకున్నారు. పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ను వదులుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పుడు సినిమా షూటింగ్‌కన్నా, పాత్రల ఖరారు కన్నా గురుదత్‌ బయోపిక్‌ను తాను తీస్తున్నట్లు ముందుగానే చెప్పడానికి కారణం ఎంతో మంది పాతతరం నటీ నటులు, వారి వారసుల నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండడమేనని తల్వార్‌ వివరించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top