గుంటూరు కారంతో ఆ రికార్డులన్నీ మడతపెట్టేసిన మహేశ్‌ బాబు | Sakshi
Sakshi News home page

గుంటూరు కారంతో ఆ రికార్డులన్నీ మడతపెట్టేసిన మహేశ్‌ బాబు

Published Tue, Jan 9 2024 8:36 AM

Guntur Kaaram Movie Trailer All Time Record In 24 Hours - Sakshi

టాలీవుడ్‌  సూపర్​స్టార్ మహేశ్ ​బాబు 'గుంటూరు కారం' ట్రైలర్ యూట్యూబ్​లో రికార్డులు బద్దలుకొడుతోంది. సినిమా విడుద‌ల‌కు ముందే స‌రికొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తూ ఊచ‌కోత‌ సృష్టిస్తోంది. ట్రైల‌ర్ విడుద‌లైన 24 గంట‌ల్లో 39 మిలియ‌న్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే ఈ ఘ‌న‌త సాధించిన‌ తొలి చిత్రంగా ఆల్‌టైమ్‌ రికార్డుల‌కెక్కింది. ఇదివరకు ఈ రికార్డు సలార్ పేరిట ఉంది. ఇటీవల రీలీజైన సలార్ ట్రైలర్​కు 24 గంటల్లో 32.50 మిలియన్ వ్యూస్ వచ్చాయి. రీజనల్‌ సినిమాతోనే మహేశ్‌ ఇలా రికార్డులు క్రియేట్‌ చేస్తే.. రేపొద్దున రాజమౌళి సినిమాతో పాన్‌ ఇండియా రేంజిలోకి ఎంట్రీ ఇచ్చాక ఇండస్ట్రీలో ఆయన ఊచకోత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

(ఇదీ చదవండి: ముగ్గురు ఫ్యాన్స్‌ మృతి.. వారి కుటుంబాలకు అండగా నిలిచిన హీరో యశ్‌)

ఆదివారం (జనవరి 7) రాత్రి 9.09 నిమిషాల‌కు విడుదలైన ఈ చిత్ర టైల‌ర్ సరిగ్గా 24 గంటల్లో  దాదాపు 40 మిలియ‌న్ల మంది వీక్షించిన‌ట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్ర‌క‌టిస్తూ సోష‌ల్‌మీడియా వేదిక‌గా పంచుకుంది. మహేశ్‌ బాబు 'గుంటూరు కారం' చిత్రం త‌ర్వాత స‌లార్ 24 గంట‌ల్లో 32.58 M , లియో 31.91M, బీస్ట్‌ 29.8M, స‌ర్కారు వారి పాట 26.77 M, తెగింపు (అజిత్‌) 25 M రాధేశ్యామ్ 23.3 M, ఆచార్య 21.86M, బాహుబ‌లి 21.81M, RRR 20.45 M, KGF- 2 19.38 M, బ్రో ది అవ‌తార్ 19.25 M వ్యూస్ సాధించిన జాబితాలో ఉన్నాయి. 

నేడు గుంటూరులో ప్రీ రిలీజ్:  గుంటూరులోని నంబూరు క్రాస్‌ రోడ్స్‌ వద్ద బహిరంగప్రదేశంలో నేడు (జనవరి 9) సాయింత్రం  ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగనుంది. వాస్తవానికి ఈ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్ మొదట జనవరి 6న హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్‌ ఇవ్వకపోవడంతో క్యాన్సిల్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ నిరాశ పడకుండా ఉండేందుకు ఏపీలోని గూంటూరులో ఈవెంట్‌ ఉంటుందని మూవీ మేకర్స్ మరో డేట్ అనౌన్స్ చేశారు. ట్రైలర్​తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. త్రివిక్రమ్‌ డైరెక్ట్‌ చేస్తున్న 'గుంటూరు కారం'లో శ్రీలీల, మీనాక్షీ చౌదరి, రమ్యకృష్ణ, జగపతిబాబు, జయరామ్ ప్రధానంగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి  'గుంటూరు కారం' రానుంది.

 
Advertisement
 
Advertisement