మాకు బెస్ట్‌ స్ప్లిట్‌ కపుల్‌ అవార్డు ఇవ్వాలి

Gulzar, Rakhee Love Story - Sakshi

ఏక్‌సౌ సోలహ్‌ చాంద్‌ కీ రాతే .. ఏక్‌ తుమ్హారే కాంధే కా తిల్‌ 
గీలీ మెహందీ కీ ఖుష్బూ .. ఝూఠ్‌మూఠ్‌ కే శిక్వే కుఛ్‌..
ఝూఠ్‌మూఠ్‌కే వాదే భీ సబ్‌ యాద్‌  కరాదో
 సబ్‌ భిజ్వాదో మేరా వో సామాన్‌ లౌటా దో.. 
(నూటా పదహారు వెన్నెల రాత్రులు.. నీ భుజమ్మీది మచ్చ.. తడి ఆరని గోరింటాకు పరిమళం..
కల్లబొల్లి కబుర్లు, బాసలు... అన్నీ గుర్తు చేయ్‌.. వాటన్నిటినీ పంపించేయ్‌ నా సామాన్లతోపాటే) 
ఇది ‘ఇజాజత్‌’ సినిమాలో గుల్జార్‌ రాసిన ‘మేరా కుఛ్‌ సామాన్‌’ పాటలోని ఒక చరణం. ‘చాలా కవితలను ఆయన తన భార్య రాఖీని దృష్టిలో పెట్టుకొని.. ఆమె కోసమే రాస్తాడు’ అంటారు గుల్జార్‌ను ఎరిగిన వాళ్లు. ‘ఈ పాట కూడా అంతే.. ఫిమేల్‌ వెర్షన్‌లో వినిపించే గుల్జార్‌ మనసు’ అంటారు. 

రాఖీ.. గుల్జార్‌.. 
నటనతో ఆమె.. పాటలు, దర్శకత్వంతో అతను బాలీవుడ్‌కి సంతకాలయ్యారు. రాఖీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేనాటికే కవిగా, రచయితగా, దర్శకుడిగా గుల్జార్‌కు ఓ ప్రత్యేకత ఉంది. తక్కువ కాలంలోనే రాఖీ కూడా బెస్ట్‌ హీరోయిన్‌గా.. గోల్డెన్‌ గర్ల్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా పేరు తెచ్చుకుంది. రాఖీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేనాటికే  ఆమెకు బెంగాలీ డైరెక్టర్‌ అజయ్‌ బిశ్వాస్‌తో పెళ్లి, విడాకులూ అయిపోయాయి.

ఒక పార్టీలో.. 
సినీ ప్రముఖుల ఒక పార్టీలో గుల్జార్‌కి రాఖీని పరిచయం చేశారు ఎవరో. అతని బహుముఖ ప్రజ్ఞకు దాసోహమైంది రాఖీ. బెంగాలీ సంస్కృతి మీదున్న వల్లమాలిన అభిమానంతో ఆమె బెంగాలీ చార్మ్‌ను ఇష్టపడ్డాడు గుల్జార్‌. అది ప్రేమగా మారింది. పెళ్లితో కలిసి ఉండాలనుకున్నారు. ‘అయితే..’ అంటూ ఆగాడు గుల్జార్‌. ‘చెప్పండి.. ’ అంది రాఖీ. ‘పెళ్లయ్యాక నువ్వు సినిమాల్లో నటించకూడదు’ చెప్పాడు అతను. ‘సరే’ అంది రాఖీ. 1973లో పెళ్లి చేసుకున్నారు. 

గుల్జార్‌ నాయికగా.. 
సంతోషంగా మొదలైంది వాళ్ల వైవాహిక జీవితం. పెళ్లి తర్వాత నటించను అని రాఖీ నిర్ణయం తీసుకున్నా దర్శకనిర్మాతల అభ్యర్థనలు ఆగలేదు.  మౌనంగానే ఉండిపోయింది రాఖీ. గుల్జార్‌ తన సినిమాల్లో ఆమెను కథానాయికగా తీసుకుంటాడని ఎదురుచూడసాగింది. బయటి సినిమాలు చేయొద్దన్నాడు కాని తన సినిమాల్లో చాన్స్‌ ఇస్తాడనే నమ్మకంతో.  ఉండబట్టలేక అడిగేసింది కూడా భర్తను. ‘నో చాన్స్‌’ అన్నాడు గుల్జార్‌. అప్పుడు బయటి నుంచి వస్తున్న అవకాశాల గురించీ చెవినేసింది. వినిపించుకోకపోగా విసుక్కున్నాడతను. నొచ్చుకుంది ఆమె. పెళ్లయిన ఏడాదిలోపే మేఘనా పుట్టింది. దాంతో సినిమాల్లో నటించడం ఇంక మరిచిపోతుందనే నిశ్చింతతో ఉన్నాడు గుల్జార్‌.

ఆంధీ.. 
గుల్జార్‌ దర్శకత్వంలో ‘ఆంధీ’ షూటింగ్‌ కశ్మీర్‌లో జరుగుతోంది. రాఖీని కూడా తీసుకెళ్లాడు అతను. ఒకరోజు షూటింగ్‌ పూర్తయ్యాక  సినిమా టీమ్‌ అంతా పార్టీ చేసుకుంటున్నారు. సంజీవ్‌ కుమార్‌ బాగా మందు తాగాడు. ఆలస్యమవుతోందని  ఆంధీ హీరోయిన్‌ సుచిత్రా సేన్‌ పార్టీ నుంచి నిష్క్రమించడానికి లేచింది. ఇంకాసేపు ఉండమంటూ ఆమె చేయి పట్టుకున్నాడు సంజీవ్‌ కుమార్‌. సున్నితంగా వారించింది సుచిత్రా. మరింత బెట్టు చేశాడు సంజీవ్‌. ఇబ్బంది పడసాగింది సుచిత్రా. గ్రహించిన గుల్జార్‌ .. సంజీవ్‌ కుమార్‌ నుంచి నెమ్మదిగా సుచిత్రా చేయి విడిపించి ఆమెను ఆమె గదిలో దిగబెట్టాడు. అది గమనించిన రాఖీ.. సుచిత్ర గదిలో ఏం చేస్తున్నారని భర్తను ప్రశ్నించింది. చిర్రెత్తుకొచ్చింది గుల్జార్‌కు. ‘అందరి ముందు ఏంటిది?’ అన్నాడు. ‘జవాబు చెప్పండి’ అంటూ నిలదీసింది. అంతే కోపంతో ఆమె చెంప ఛెళ్లుమనిపించాడు గుల్జార్‌. అవమానభారంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది రాఖీ. 

మళ్లీ సినిమాల్లోకి.. 
ఆ తెల్లవారే ‘కభీ కభీ’  కోసం రాఖీని ఒప్పించాలనే నిర్ణయంతోపాటు.. సినిమా కోసం లొకేషన్‌నూ చూసుకోవచ్చనే ఉద్దేశంతో కశ్మీర్‌ వచ్చాడు యశ్‌ చోప్రా. రాఖీని కలిసి ‘కభీ కభీ’లో నటించమని కోరి, గుల్జార్‌ దగ్గర అనుమతీ తీసుకోనున్నాని చెప్పాడు యష్‌. ‘ గుల్జార్‌ను అడగఖ్ఖర్లేదు..నేను నటిస్తున్నాను’ అంది రాఖి. ఆ నిర్ణయం గుల్జార్‌ను ఖిన్నుడిని చేసింది.. రెండేళ్ల ఆ వివాహ బంధాన్ని విడగొట్టింది. గుల్జార్‌ ఇంట్లోంచి బయటకు వచ్చేసింది రాఖీ. సినిమా ప్రయాణాన్ని కొనసాగించింది.  

‘మేమిద్దరం ఒకరికొరం ఎప్పటికీ ఉన్నాం.  నిజానికి మాకు బెస్ట్‌ స్ప్లిట్‌ కపుల్‌ అవార్డ్‌ ఇవ్వాలి’ అంటుంది రాఖీ. 

‘మేమిద్దరం ఒకే ఇంట్లో లేకపోయినా అభిప్రాయభేదాలు, గొడవలు, పంతాలు పట్టింపులు, ఆనందాలు.. అన్నిటినీ కలిసే పంచుకుంటున్నాం. దీన్ని మించిన దగ్గరితనం, అనుబంధం ఇంకేం ఉంటుంది?’ అంటాడు గుల్జార్‌.

బెస్ట్‌ స్ప్లిట్‌ కపుల్‌
వాళ్లిద్దరు విడాకులు తీసుకోలేదు. కలిసి ఒక ఇంట్లో ఉండనూ లేదు. ఒకరినొకరు గౌరవించుకుంటూ స్నేహితులుగా మిగిలిపోయారు. అలా కలిసి ఉంటూ విఫలమైన తమ ప్రేమను సఫలం చేసుకుంటోంది ఆ జంట. 
-ఎస్సార్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top