
ఈ వీకెండ్‌లో దాదాపు 35కి పైగా కొత్త సినిమాలు,వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లోకి వచ్చాయి. వాటిలో తమ్ముడు, సితారే జమీన్ పర్, 3 బీహెచ్‌కే, ఓ భామ అయ్యో రామ, పాపా, కలియుగం 2064 ఉన్నంతలో చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటే రీసెంట్‌గానే ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా 'గార్డ్' కూడా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండింగ్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)
విరాజ్ రెడ్డి, మీమీ లియోనార్డ్, శిల్ప బాలకృష్ణన్ లీడ్ రోల్స్ చేసిన సినిమా 'గార్డ్'. జగ్గా పెద్ది దర్శకత్వం వహించారు. అనసూయ రెడ్డి నిర్మాత. ఈ ఏడాది ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజ్ కాగా.. గత నెలలో రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి అత్యధిక వ్యూస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఆస్ట్రేలియాలో షూటింగ్ చేసిన హారర్ కామెడీ మూవీ ఇది. హాలీవుడ్ టెక్నీషియన్స్ పలువురు ఈ సినిమా కోసం పనిచేయడం విశేషం. 'గార్డ్' త్వరలో మరో రెండు ఓటీటీల్లోనూ ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.
'గార్డ్' విషయానికొస్తే.. సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే హీరో. ఓ అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ఓ సందర్భంలో నిషేధిత ల్యాబ్‌లోకి అడుగుపెట్టి ఓ అమ్మాయిని రక్షిస్తాడు. అప్పటినుంచి వింత వింత సంఘటనలన్నీ జరుగుతుంటాయి. ఓ అమ్మాయి దెయ్యం రూపంలో కనిపిస్తూ అందరికీ భయపెడుతూ ఉంటుంది. మరి చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన 'బిగ్‌బాస్' ఫేమ్ గౌతమ్)
