నాకు కరోనా సోకింది: జెనీలియా | Genelia Says She Was Tested Covid 19 Positive Now Recovered | Sakshi
Sakshi News home page

కరోనా నుంచి కోలుకున్నాను: జెనీలియా

Aug 29 2020 8:47 PM | Updated on Aug 29 2020 9:42 PM

Genelia Says She Was Tested Covid 19 Positive Now Recovered - Sakshi

ముంబై: మహమ్మారి కరోనా ఎవరినీ వదలడం లేదు. సెలబ్రిటీలు మొదలు సామాన్యుల దాకా అందరినీ వెంటాడుతూ చుక్కలు చూపిస్తోంది. ఇక ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ ప్రాణాంతక వైరస్‌ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నటి జెనీలియా దేశ్‌ముఖ్‌ కూడా ఈ జాబితాలో చేరారు. మూడు వారాల క్రితం తనకు కరోనా సోకిందన్న ఆమె.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నానని శనివారం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. మహమ్మారిని జయించి కుటుంబంతో హాయిగా గడిపేందుకు సిద్ధమయ్యానని సంతోషం వ్యక్తం చేశారు. (చదవండి: ముందుకు సాగిపోవాలి అంతే: జెనీలియా)

ఈ మేరకు.. ‘‘మూడు వారాల క్రితం నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే లక్షణాలేవీ బయటపడలేదు.  దేవుడి దయ వల్ల నేను ఈరోజు కోవిడ్‌ నెగటివ్‌ ఫలితం వచ్చింది. నాపై కురిపించిన ఆశీర్వాదాలు వ్యాధితో నా పోరాటాన్ని సులభతరం చేశాయి. అయితే అదే సమయంలో 21 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండటం అనేది చాలా కఠినమైనది. ఫేస్‌టైం, ఇతరత్రా డిజిటల్‌ వ్యాపకాలు ఒంటరితనం అనే దుష్టశక్తిని అంతం చేయలేవు. నన్ను ప్రేమించే వాళ్లు, నా కుటుంబ సభ్యుల సమక్షంలోకి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నింటి కంటే ఇదే అతిపెద్ద బలం. ప్రతీ ఒక్కరికి కావాల్సింది ఇదే’’ అంటూ జెనీలియా ఇన్‌స్టాలో భావోద్వేగపూరిత లేఖను పంచుకున్నారు. 

అదే విధంగా..  కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏమాత్రం అనారోగ్యంగా అనిపించినా.. వీలైనంత త్వరగా పరీక్ష చేయించుకుని, పౌష్టికాహార భోజనం తీసుకోవాలని సూచించారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే కరోనా రక్కసితో పోరాడవచ్చని పేర్కొన్నారు. కాగా బాలీవుడ్‌తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జెనీలియా.. దక్షిణాదిన అగ్ర తారగా వెలుగొందిన విషయం తెలిసిందే. అరంగేట్ర సినిమాలో తనకు జోడిగా నటించిన రితేశ్‌ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన ఆమె.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. బాలీవుడ్‌ అన్యోన్య జంటల్లో ఒకటిగా చెప్పుకొనే రితేశ్‌-జెనీలియాలకు రియాన్‌, రేహిల్‌ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాగా రితేశ్‌.. మహారాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ కుమారుడన్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement