12 రోజులు నరకం చూశానంటూ.. సంతోష సమయంలో కన్నీళ్లు పెట్టుకున్న నందు

Geetha Madhuri Husband Nandu Gets Emotional - Sakshi

టాలీవుడ్‌లో  గీతా మాధురి- నందు బ్యూటిఫుల్‌ కపుల్స్‌గా గుర్తింపు ఉంది. గీతా మాధురి సింగర్‌గా సత్తా చాటితే నందు యాక్టర్‌గా మెప్పిస్తున్నాడు. టాలీవుడ్‌లో టాప్‌ సింగర్‌గా రాణిస్తున్న గీతా త్వరలో తల్లి కాబోతోంది. రెండోసారి పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నెలలోనే ఆమె డెలివరీ డేట్‌ ఉంది. ఈ విషయాన్ని గీతా మాధురియే స్వయంగా వెల్లడించింది. 

ఇంతటి సంతోష సమయంలో తాజాగా నందు పాతరోజులను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాజాగా ఒక టీవీ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న నందుకు హైపర్‌ ఆది ఒక ప్రశ్న వేస్తాడు.. గీతామాధురిని ఉద్దేశించి మీ ఇద్దరి మధ్య జరిగిన ఎమోషనల్ మూమెంట్ చెప్పమని అడుగుతాడు. 

ఆ సమయంలో నందు చాలా ఎమోషనల్‌గా ఇలా చెప్పాడు. ' గతంలో నా మీద ఒక రూమర్ వచ్చింది. దానితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ విషయంలో నా పేరును లాగి న్యూస్‌లలో పదేపదే రిపీట్ చేస్తూ చూపించారు. పలు యూట్యూబ్‌ ఛానల్స్‌ వారు కూడా ప్రచారం చేశారు. అలా ఏకంగా 12 రోజుల పాటు నన్ను నెగిటివ్ చేశారు. తర్వాత ఆ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిశాక సింపుల్‌గా ఒక స్క్రోలింగ్‌లో వేశారు. దానివల్ల నేను చాలా బాధపడ్డాను.' అంటూ నందు స్టేజిపై వెక్కి వెక్కి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాజాగా ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

నందు కన్నీళ్లకు కారణం ఇదేనా
సుమారు ఐదేళ్ల క్రితం టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే. అందులో నందు పాత్ర ఉన్నట్లు ఈడీ అనుమానించింది. అందుకు ఆయన్ను ఈడీ విచారించింది. ఆ సమయంలో నందును కేవలం అనుమానితుడిగానే ఈడీ విచారించింది.ఆపై ఆయనకు క్లీన్‌ చిట్‌ కూడా రావడం జరిగింది. దీని గురించే తాజాగా నందు కన్నీళ్లు పెట్టికుని ఉండవచ్చని తెలుస్తోంది.

whatsapp channel

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top