
ఈ ఏడాది రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా పెద్దగా రాణించలేకపోయింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో అంజలి, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు.
అయితే 'గేమ్ ఛేంజర్' డైరెక్టర్ శంకర్‌పై ఎడిటర్ షమీర్ మహమ్మద్ విమర్శలు చేశారు. ఆయనతో పని చేయడం నా జీవితంలో చేదు అనుభవమని చెప్పారు. దర్శకుడు శంకర్‌తో కలిసి పనిచేయడం చాలా దారుణంగా అనిపించిందని షమీర్ మహమ్మద్ వెల్లడించారు. నేను చాలా ఉత్సాహంగా అక్కడికి వెళ్తే.. నాకు అక్కడ అంతా భిన్నంగా ఉందని అన్నారు.
ఎడిటర్ షమీర్ మహమ్మద్ మాట్లాడుతూ.. 'గేమ్ ఛేంజర్ కోసం దాదాపు ఒక సంవత్సరం పనిచేశా. ఆరు నెలల తర్వాత వారితో మరో నెల రోజులు ఉండాల్సి ఉంటుందని నాతో చెప్పారు. నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు సినిమా నిడివి 7 గంటల నుంచి 7.30 గంటలు. దానిని మూడున్నర గంటలకు తగ్గించా. ఆ తర్వాత మరో కొత్త ఎడిటర్ వచ్చి దానిని రెండున్నర నుంచి 3 గంటలకు కుదించాడు. డైరెక్టర్ ఎడిటింగ్ కోసం ఒక తేదీని నిర్ణయించేవాడు. కానీ పది రోజుల తర్వాత మాత్రమే వచ్చేవాడు. అదే పద్ధతి చాలా రోజులు కొనసాగింది. దీంతో నేను 300-350 రోజులు చెన్నైలో ఉన్నా. అందుకే ఈ సినిమాను మధ్యలో వదిలేయాల్సి వచ్చింది" అని అన్నారు. కానీ షమీర్ ప్రాజెక్ట్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఎడిటర్ రూబెన్‌ను తీసుకున్నారు.