
తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జూలై 18న) రాత్రి కన్నుమూశారు. కిడ్నీ మార్పిడి చేస్తే నాన్న బతికేవాడని అతడి కూతురు భావోద్వేగానికి లోనైంది. అలాగే హీరో రామ్‌చరణ్.. లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారన్న అసత్య ప్రచారం వల్ల తమ కుటుంబానికి ఎవరూ సాయం చేయలేదని వాపోయింది. నాన్న మరణించాక తమను పరామర్శించేందుకు గబ్బర్ సింగ్ టీమ్ తప్ప సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ రాలేరని పేర్కొంది.
కిడ్నీతో పాటు కాలేయం కూడా..
వెంకట్ కూతురు ఇంకా ఏమందంటే.. నాన్నకు మొన్నటివరకు కిడ్నీ సమస్య ఉందని మాత్రమే వైద్యులు చెప్పారు. నిన్న అన్ని టెస్టులు చేస్తే కాలేయం కూడా పాడైపోయిందన్నారు. ఇన్‌ఫెక్షన్ పెరుగుతోందని చెప్పారు. బతకడం కష్టమన్నారు. నిన్న సాయంత్రం ఆరింటి వరకు కూడా నాన్న బాగానే ఉన్నారు. అయితే 80% కోమాలో ఉన్నారని డాక్టర్స్ చెప్పారు. రాత్రి సడన్‌గా బీపీ పడిపోయింది, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. రాత్రి 9.25 గంటలకు నాన్న చనిపోయాడు.
ఒక్క రూపాయి అందలేదు
నాన్నను ఆస్పత్రిలో చేర్పించినప్పుడే ఎవరైనా ఆర్థిక సాయం చేసుంటే ఆయన కచ్చితంగా బతికేవాడు. డబ్బు లేకపోవడం వల్లే నాన్నను కోల్పోయాం. ఇండస్ట్రీ నుంచి హీరో విశ్వక్ సేన్, జెట్టి ఫేమ్ కృష్ణ మానినేని సాయం చేశారు. హీరో రామ్‌చరణ్‌కు చెందిన క్లీంకార ఫౌండేషన్ నుంచి రూ.25 వేల సాయం అందింది. అయితే రామ్‌చరణ్ మా నాన్నను మంచి ఆస్పత్రిలో చేర్పించాడు, ఆర్థిక సాయం చేశాడంటూ పుకార్లు లేపారు. దీనివల్ల ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఒక్క రూపాయి కూడా విరాళం రాలేదు. నాన్నకు అంత సీరియస్‌గా ఉంటే గబ్బర్ సింగ్ టీమ్ తప్ప ఎవరూ చూడటానికి రాలేదు. డబ్బు సాయం చేసుంటే నాన్న ఈరోజు బతికి ఉండేవాడు అని చెప్పుకొచ్చింది.